విద్యుదయస్కాంతం
విద్యుదయస్కాంతం అంటే ఒక తీగ ద్వారా విద్యుత్తుని ప్రవహింప జేయడం ద్వారా తాత్కాలికంగా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం.
సాధారణ అయస్కాంతాన్ని ఉక్కు లేదా ఇనుముతో తయారు చేస్తారు. దీనికి ఉత్తర, దక్షిణ ధృవాలుంటాయి. దీనినే శాశ్వత అయస్కాంతం అని కూడా అంటారు. దీనికి భిన్నమైనది విద్యుదయస్కాంతం. విద్యుత్తు ప్రవహించినంత సేపు మాత్రమే ఇందులో అయస్కాంత తత్త్వం ఉంటుంది.
దీన్ని తయారు చేయడానికి ఒక బ్యాటరీ, లేదా విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనం, ఒక తీగచుట్ట (solenoid) ఉంటే చాలు కానీ సర్వసాధారణంగా ఈ తీగని ఒక ఇనము వంటి లోహపు కడ్డీ చుట్టూ చుడితే ఆ అయస్కాంతం బలంగా ఉంటుంది. బొమ్మలో తీగచుట్ట అడ్డుకోత పటం చూడొచ్చు. ఇందులో ప్రవాహం అడుగు నుండి కాగితంలోకి వెళ్లి, పైనుండి బయటకి వస్తోంది. ప్రవాహం ఇలా ఉంటే అయస్కాంత క్షేత్రం ఎటు నుండి ఎటు వెళుతోందో బాణపు గుర్తులు చూపెడుతున్నాయి.
శాశ్వత అయస్కాంతంతో పోల్చితే విద్యుదయస్కాంతానికి ఒక ముఖ్యమైన లాభం ఉంది: తీగలో ప్రవహించే విద్యుత్తు ప్రవాహాన్ని నియంత్రించి అయస్కాంతపు బలాన్ని పెంచనూ వచ్చు, తగ్గించనూ వచ్చు. కాని విద్యుత్తు ప్రవాహం ఆగిపోతే అయస్కాంత లక్షణం కూడా హరించిపోతుంది.
నిత్యజీవితంలో విద్యుదయస్కాంతాల ఉపయోగాలు కొల్లలు.
- విద్యుత్ చాలకాలు (మోటారులు), అనగా విద్యుత్తుని వాడుకుని పనులు చేసేవి.
- విద్యుత్ ఉత్పాదకాలు (జెనరేటర్లు, డైనమోలు), అనగా యాంత్రిక శక్తి వాడుకుని విద్యుత్తుని పుట్టించేవి.
- విద్యుత్ పరివర్తకాలు ట్రానస్ఫార్మర్లు, అనగా విద్యుత్తు యొక్క పీడనాన్ని పైకి ఎగదోసేవి, కిందకి దిగదోసేవి
- రిలేలు, అనగా విద్యుత్ వలయాలలో మార్గాలని తెగగొట్టి ప్రవాహాన్ని ఆపుచేసేవి, లేదా ఒక దారి నుండి మరొక దారికి మళ్ళించేవి.
- విద్యుత్ గంటలు, అనగా బయట మీట నొక్కితే లోపల గంట మోగే సాధనం
- లౌడ్ స్పీకర్లు, మెల్లగా మాట్లాడిన వాక్కుని బిగ్గరగా చేసే సాధనాలు
- హార్డ్ డిస్క్‌లు, కంప్యూటరు రంగంలో దత్తాంశాలు నిల్వ చెయ్యడానికి వాడే ఉపకరణం
- క్రేన్లు, బరువులని ఎత్తే సాధనాలు
- రేణు త్వరణులు లేదా తొరణికలు (accelerators), అణుప్రమాణమైన రేణువులని త్వరితపరచి జోరుగా పరుగెత్తించే సాధనం
ఇలా ఎన్నెన్నో సందర్భాలలో అయస్కాంతాలని వాడతారు.