వికీపీడియా:2024 లో తెవికీ ప్రగతి - మధ్యంతర పరిశీలన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2024 లో మే 31 వరకు తెవికీ అవలోకనం ఇది.

వడివడిగా కొత్త వ్యాసాలు

[మార్చు]

2024 లో కొత్త వ్యాసాలు విరివిగా వచాయి. మొదటి 5 నెలల్లో వచ్చిన వ్యాసాల సంఖ్య 6174 - సగటున నెలకు 1200 పైచిలుకు. మునుపెన్నడూ లేనంతగా కొత్త వ్యాసాలు వస్తున్నాయి. రెండూ వికీ ప్రాజెక్టులు దీనికి దోహదపడ్డాయి. ఈ ఏడు లక్ష వ్యాసాల సంఖ్య చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఈ వ్యాసాలను రాసే బాధ్యత మాత్రం కొందరు వాడుకరులే వహిస్తున్నారు. మొదటి 5 నెలల్లో వచ్చిన కొత్త వ్యాసాల్లో 90% కి పైగా రాసినది పదిమందే. ఒక్క వ్యాసమైనా రాసినది 107 మంది కాగా, వందకు పైబడి వ్యాసాలు రాసినది 11 మంది.

మందకొడిగా కొత్త వాడుకరి ఖాతాలు

[మార్చు]

ఈ లక్షాలు సాధించాలంటే కొత్త వాడుకరులు రావాలి. చురుగ్గా రాసే వాడుకరుల (నెలలో కనీసం 1 దిద్దుబాటైనా చేసేవారు) సంఖ్య సుమారు 170-190 ఉంటూ ఉంటుంది. నెలకు 100 కంటే ఎక్కువ దిద్దుబాట్లు చేసే వారు సుమారు 15 మంది ఉంటారు. ఈ సంఖ్యలు రెట్టింపు అయితే తప్ప 2025 లక్ష్యం సిద్ధించదు. కానీ, ఈ సంవత్సరం మొదటి 5 నెలల్లోనూ కొత్తగా చేరిన వాడుకరుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2024 జనవరి-మే మధ్య చేరిన కొత్త వాడుకరుల సంఖ్య 414. గత 18 ఏళ్ళలో ఇదే అత్యల్పం. గత పదేళ్ళలో ఈ సంఖ్య కింది విధంగా ఉంది.

2014 2015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 2024
852 868 800 940 1037 1112 1123 661 446 721 414

వికీప్రాజెక్టులు

[మార్చు]

ఈ యేడు రెండు ముఖ్యమైన వికీప్రాజెక్టులు జరిగాయి. స్త్రీవాదం 2024 ప్రాజెక్టులో 1740 కొత్త వ్యాసాలు వచ్చాయి. ఎన్నికలు 2024 ప్రాజెక్టులో 2300 కొత్తవ్యాసాలు వచ్చాయి. మొత్తం తెవికీ పేజీల్లో ఈ రెండూ కలిసి 3.2%. తెవికీ వ్యాసాల భవనం కుదురును విస్తరించిన ప్రాజెక్టుల్లో ఇవి కూడా ఉన్నాయి.

మన లక్ష్యాలు

[మార్చు]

మొత్తం తెవికీ వ్యాసాల్లో రెండు తెలుగు రాష్ట్రాల గ్రామ,మండల, పట్టణాల వ్యాసాలు 30.21% దాకా ఉన్నాయి. ఇది 15 శాతానికి తగ్గాలంటే మొత్తం వ్యాసాల సంఖ్య 1,15,000 కు చేరుకోవాలి. అది బహుశా 2025 లో సాధించగలం. ఈ శాతం 20 కి తగ్గాలంటే మొత్తం వ్యాసాల సంఖ్య 1,45,000 కు చేరాలి. అది మన 2026 లక్ష్యంగా పెట్టుకోవచ్చు.

ఈ సంవత్సరంతో పాటు, 2025,2026 సంవత్సరాలకు కూడా లక్ష్యాల సూచనలు:

  • 2024 లక్ష్యం: 1,02,000 (సంవత్సరంలో 12,000, మిగిలిన 7 నెలలకు 6000 వ్యాసాలు. నెలకు సుమారు 900 వ్యాసాలు)
  • 2025 లక్ష్యం: 1,20,000 (సంవత్సరంలో 18,000, నెలకు 1500 వ్యాసాలు)
  • 2026 లక్ష్యం: 1,44,000 (సంవత్సరంలో 24,000, నెలకు 2000 వ్యాసాలు)

పై లక్ష్యాలకు అనుగుణంగా కొత్త వాడుకరుల సంఖ్యను కూడా పెంచుకోవాల్సిన వసరం ఉంది. వచ్చే ఏడు నెలల్లో 700 మంది కొత్త వాడుకరి ఖాతాలు లక్ష్యంగా ఉండాలి. 2025 లో 2500, 2026 లో 3000 లక్ష్యంగా పెట్టుకోవాలి.

కార్యక్రమాలు

[మార్చు]

ఈ లక్ష్యాల సాధన కోసం ప్రధానంగా కొత్త వాడుకరులు చేరాలి. దాని కోసం ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి.

ప్రచార కార్యక్రమాలు

[మార్చు]

కొత్తగా వాడుకరులు చేరాలంటే, మరింత మందికి తెవికీని పరిచయం చెయ్యాలి. అందుకు గాను మనం ఔట్‌రీచ్ కార్యక్రమాలు ఎక్కువగా చెయ్యాలి. కింది కార్యక్రమాలు ఎలాగూ చేస్తాం.

  1. 2024 డిసెంబరు పుస్తక ప్రదర్శన
  2. 2025 డిసెంబరు పుస్తక ప్రదర్శన
  3. 2025 జనవరి తెవికీ పండగ
  4. 2026 జనవరి తెవికీ పండగ

వీటికి తోడు -

  1. మరిన్ని ఔట్‌రీచ్ కార్యక్రమాలు చెయ్యాలి. ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉద్యోగులకూ ప్రత్యేక ఔట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించాలి. 2024 ఆగస్టు, సెప్టెంబరుల్లో ఒకటి చేయవచ్చు.
  2. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చెయ్యడం ద్వారా ఆకర్షించాలి.
  3. పేజీ పక్కపట్టీలో సామాజిక మాధ్యమాల లింకు వచ్చేలా ఏదైనా గాడ్జెట్టు ఉందేమో చూసి పెట్టుకోవాలి
  4. ప్రతి రెండు నెలలలకు ఒకసారి, తెవికీ గురించి పత్రికలలో ఏదో ఒక వార్త వచ్చేలా చూసుకోవాలి.

కొత్తగా చేరిన వాడుకరుల కోసం

[మార్చు]

అలాగే కొత్తగా చేరే వాడుకరులను నిలుపుకునేందుకు కూడా కార్యక్రమాలు చేపట్టాలి. ఉదాహరణకు -

  1. కొత్త వాడుకరులకు పోటీలు పెట్టడం
  2. వారి కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టులు నడపడం
  3. సహాయం పేజీలను తాజాకరించడం, విస్తరించడం

చురుగ్గా రాస్తూ ఉన్నవారి కోసం

[మార్చు]

చురుగ్గా రాస్తూ ఉన్న వాడుకరుల కోసం కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. ఉదాహరణకు -

  1. తెవికీ బడి ద్వారా శిక్షణ కార్యక్రమాలు: దాదాపు రెండు నెలలుగా ఈ ఆన్‌లైను శిక్షణ జరుగుతోంది. వీటిని కొనసాగిస్తూ విస్తరించుకోవాలి
  2. అనువాద పరికరం వాడుకను ప్రోత్సహించాలి.

అభిప్రాయాలు, సూచనలు

[మార్చు]