వికీపీడియా:2015 లక్ష్యాలు
2015లో తెలుగు వికీ సముదాయంగా సమిష్టికృషితో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు. వికీపీడియా లక్ష్యాలు స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు. ఈ త్రిముఖ వ్యూహంలో వికీ నాణ్యత, సముదాయపు అభివృద్ధి మరియు వికీ అవగాహన మూడు అంగాలు.
వికీ నాణ్యత
[మార్చు]నాణ్యతకు కొన్ని నిజమైన నిదర్శనాలు 1) వ్యాసాలలో అచ్చుతప్పులు లేకుండా ఉండటం 2) మూలలను చూపటం 3) సమాచారం సమగ్రంగా ఉండటం. వికీ నాణ్యతను కొలిచేందుకు మరో సులభమైన పద్ధతి లేక వికీలోతు అనే ప్రమాణికాన్ని తయారు చేశారు. కానీ దానినే లక్ష్యంగా పెట్టుకోవటం వలన, లోతును సాధించడానికి కొన్ని అడ్డదారులు తొక్కే అవకాశం ఉన్నది (ఉదాహరణకు వ్యాసేతర పేజీలు ఎక్కువగా సృష్టిస్తే వికీ లోతు పెరుగుతుంది)
ఈ సంవత్సరంలో 100 వ్యాసాలను గుర్తించి వాటిని విశేష ఉత్తమ వ్యాసాలుగా తీర్చిదిద్దాలి
[మార్చు]సంవత్సరాంతానికి ఇంకా 7 నెలలు ఉన్నాయి. ఒక్కో నెలలో 20 వ్యాసాలపై కృషి చేస్తే చాలు ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు అందరమూ కలిసి ఒక వంద వ్యాసాలను ఎంచుకుందాం. దీనికి 15-20 మంది సభ్యుల సహకారం కావాలి. ఒక్కో వాడుకరి ఒక నెలంతా శ్రమించి ఒక వ్యాసాన్ని అభివృద్ధి చేస్తారనమాట. మొదటి నెలలో వ్యాసాలు ఎంపిక చేసుకోవటానికి, సభ్యులకు అవగాహన కల్పించడానికి సరిపోతుంది.
- బలాలు: ఇప్పటికే గణనీయమైన సమాచారమున్న వ్యాసాలు కొన్ని ఉన్నాయి, వికీలో సునాయాసంగా పనిచేయగల 10+ మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు
- బలహీనతలు:
విశేషఉత్తమ వ్యాసాలంటే ఎలా ఉండాలన్న అవగాహన లేదు.విశేషఉత్తమ వ్యాసాలను బేరీజు వేసే పద్ధతి కొరవడింది. - అవకాశాలు: దీనితో నాణ్యతపై సముదాయానికి చక్కని అవగాహన కలగటమే కాక, మరో రెండేళ్ళలో తెలుగు వికీపీడియాను సీడీ రూపంలో తెచ్చేందుకు మార్గం సుగమమౌతుంది.
- ఆటంకాలు: సముదాయం నుండి సరైన స్పందన లేకపోవటం
- వ్యాసాలు సమిష్టి కృషితో అభివృద్ధి చేయడం లేదా?
ఇదివరకట ఉన్నట్టు ఇప్పుడు కియాశీలకంగా ఉన్న వాడుకరుల్లో దిద్దుబాటు ఘర్షణ జరిగితే ఏంచెయ్యాలన్న విషయంపై అవగాహన లేదు. అందుకే సమిష్టి కృషి వ్యాసం పెద్దగా పుంజుకోలేదని నా అభిప్రాయం. ఒక్కోక్క వ్యాసానికి ఒక ప్రధాన సంపాదకులు ఉన్నా, ఇతరులు, ఆ సంపాదకుని కోరికపై అవసరాన్ని బట్టి తగు సహాయం చేస్తారు.
- నాణ్యత ఎవరు బేరీజు వేస్తారు?
ఆంగ్ల వికీపీడియాలో ఒకరో, ఇద్దరో వ్యాసాన్ని విశ్లేషించి, బేరీజు వేసి, ఆయా వ్యాసపు రచయితకు తగువిధమైన సూచనలిస్తారు. కానీ తెలుగు వికీలో ప్రస్తుతం విశేష ఉత్తమ వ్యాసాలపై ఉన్న అవగాహన తక్కువ కాబట్టి నిర్ణీత త్రిసభ్య మండలి అన్ని వ్యాసాలను బేరీజు వేసి, విశ్లేషక పాత్రను పోషిస్తుంది. వచ్చే ఏడాదికి ఈ పద్ధతి మారవచ్చు.
- ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టుల విషయమేమిటి?
ఇప్పుడున్న ప్రాజెక్టులు అలాగే కొనసాగుతాయి. అయితే వీటి లక్ష్యాలు 100 విశేష ఉత్తమ వ్యాసాల లక్ష్యానికి తోడ్పడేటట్టు కృషిచేయాలి. ఉదాహరణకు సుజాత గారు పనిచేస్తున్న మొఘల్ చక్రవర్తుల వ్యాసాల్లోనే కొన్ని ఎంచుకొని విశేష ఉత్తమ వ్యాసాలుగా అభివృద్ధిచేయటం. సమీప భవిష్యత్తులో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకపోతే బాగుంటుంది. ఇక్కడ క్రియాశీలక వాడుకరులకంటే ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే చాలామటుకు ప్రాజెక్టులు పెద్దగా పురోగమించలేదు.
- ఈ కృషి బయటి సంస్థలు తమ ఖాతాలో జమచేసుకుంటాయా?
సముదాయేతర సంస్థలు ఈ కృషిని తమ ఖాతాలో జమచేసుకోకుండా ముందునుండే చర్యలు తీసుకుంటాము.
అన్ని వ్యాసాలకు కనీసం ఒక మూలమైన చేర్చాలి
[మార్చు]గ్రామాల వ్యాసాల అభివృద్ధి
[మార్చు]సముదాయపు అభివృద్ధి
[మార్చు]సముదాయపు అభివృద్ధిని సులభంగా ఎంతమంది కొత్తవాడుకరులు చేరుతున్నారన్న గణాంకంతో కొలవవచ్చు. కానీ కొత్త సభ్యులు చేరినంత మాత్రాన ప్రయోజనంలేదు వాళ్ళు సముదాయపు తీరును గమనించి, పద్ధతులు నేర్చుకొని, క్రియాశీలకంగా సముదాయంలో పాల్గొంటూ, సమిష్టిగా విజ్ఞానసర్వస్వం అభివృద్ధి చేయగలిగితేనే వారు నిజమైన వికీపీడియను అయినట్టు. .
- ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ -> అంటే వికీలో కొత్తగా చేరిన వారిని వికీపీడియన్లుగా మలిచే ప్రక్రియను స్థాపించి, బలోపేతం చేయాలి. "హ్యూమన్ టచ్" ఇక్కడ బాగా ఉపయోగించాలి.
- క్రియాశీలక వాడుకరులను వికీ పద్ధతులలో శిక్షణనిచ్చి, చక్కని వికీపీడియన్లుగా తయారుచెయ్యాలి
- నిర్వహణా వ్యవస్థను పటిష్టం చేయాలి - క్రియాశీలకంగా లేని నిర్వాహకులను నిర్వాహకత్వం నుండి తొలగించి, క్రియాశీలక నిర్వాహకులకు కంటిన్యుయష్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ప్రవేశపెట్టాలి (అంటే నిర్వాహకులు తమ వికీ జ్ఞానాన్ని నిరంతరం సానబెట్టుకుంటూ ఉండే పద్ధతి అనమాట). నిర్వాహకులు కనీసం 5% శాతం సమయం ఆంగ్ల వికీపీడియాలో పనిచేయాలి.
- నిర్వహణ సులభతరం - వీలైనంతగా ఆటోమేటిక్ పద్ధతులు స్థాపించి నిర్వహణను సులభతరం చెయ్యాలి. ({{సహాయం కావాలి}} మూసలాంటివి)
- సాంకేతికాసక్తి ఉన్న సభ్యులకు సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. మరింత మంది బాటులను వాడగల వాడుకరులను తయారుచెయ్యాలి. ఈ విధంగా చిన్నచిన్న మార్పులు వాడుకరులు చేత్తోచేసే పద్ధతిని వీడితే, మానవ వనరులను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చు.
- కృషి గుర్తింపు చర్యలు పునరుద్ధరించాలి. ప్రోత్సాహకచర్యలను పెంపొందించాలి
- 2016 వికీమేనియాకి కనిష్టం ఇద్దరు తెలుగు వికీపీడియన్లైనా పంపించే విధంగా కృషిచేయాలి.
వికీపీడియా అవగాహన
[మార్చు]- తెలుగు వికీపీడియా సోషల్ మీడియా వ్యూహం రూపొందించుకోవాలి. ఇప్పటి దాకా చెదురుమదురుగా చేసిన సోషల్ మీడియా ప్రయత్నాలను ఒకే తాటిపై తెచ్చి మరింత కేంద్రీకృత వ్యూహంతో పనిచేయాలి.
- తెలుగు బ్లాగర్లు, ఇతర అంతర్జాల తెలుగు ఔత్సాహికులను తిరిగి తెలుగు వికీపీడియా ప్రచారంలో క్రియాశీలకం చెయ్యాలి. వికీపీడియాలో తెలుగుపై ఆసక్తివున్న నిపుణులు, పరిశోధకులు ఇన్సైడర్లు కావడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఈమాట పత్రికలో అత్యంత ప్రామాణిక వ్యాసాలు రాసే సురేష్ కొలిచాల వంటివారు. ఐతే వారికి వ్యాసాలు రాసే వీలు లేనంతమాత్రాన వదలక, వారి సేవలను సోదర సమీక్ష వంటి వాటిలో వినియోగించుకుంటే ఎలా వుంటుందన్న కోణంలో చర్చలు చేయాలి.
- మీడియాతో అవినాభావ సంబంధాలు ఏర్పరచుకొని, ఆసక్తికరమైన వ్యక్తులు వికీలో పాల్గొనేట్టు చేయాలి. తెవికీ గురించి, అంతర్జాతీయంగా వికీపీడియా సాధిస్తున్న విషయాల గురించి సందర్భోచితంగా పత్రికల సంపాదకీయాల పేజీల్లోని వ్యాసాల స్థాయిలోనివి రాసి ప్రచురణకు పంపుతూండాలి. వికీలో జరుగుతున్న విశేషాల్లో ముఖ్యమైనవేవి పత్రికల్లో వార్తలుగా ఒదుగుతాయో చూసుకుని వాటీని పంపాలి. ఉదాహరణకు: నిర్మాణపరంగా వికీపీడియా ఓ గొప్ప ఫీట్. వందలమందిని ఇలా ఓ బంధంతో కట్టివుంచేందుకు, వారు నిస్వార్థమైన సేవ చేసేందుకు మూలకారణం ఏంటన్న విషయంపై కొంత మనమే మంచి వ్యాసాలు రాసి, వాటిని సంపాదకీయాలకు పంపవచ్చు.
- ఈ వారం వ్యాసం ఈమెయిలు పంపిణీని పునరుద్ధరించాలి. ఈ వారం వ్యాసాన్ని ఈమెయిలుగా పంపడం తెవికీని, వికేతర తెలుగు ఔత్సాహికులు వారం వారం గుర్తుంచుకొనేలా చేసింది. ఈ కార్యక్రమం కొనసాగిన కాలం నాటి పేజీ వీక్షణలను పరిశీలిస్తే అందులో చాలామటుకు ఇలా పంపిణీచేసిన వ్యాసాలుండటం అవగతమౌతుంది.
- వికీపీడియా సదస్సులను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలి. ఈ సంవత్సరం నవంబరు నెలకల్లా పుష్కరోత్సవం ప్రణాళికలు రూపొందించుకొని, నిధులు సమకూర్చుకోవాలి