వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/ఖాతాను తెరవడం
వికీపీడియాలో ఖాతాను తెరవడం
వికీపీడియా సైటు తెరిచినపుడు కుడివైపు పైభాగంలో ‘‘ఖాతా సృష్టించుకోండి’’ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినపుడు, మరో పేజీ ఓపన్ అవుతుంది. అక్కడ మీరు వికీపీడియా ఖాతాను సృష్టించుకోవచ్చు. అంతకంటేముందు వికీపీడియాలో ఖాతాను తెరవడం అనేదానిపై కొన్ని సంగతులు తెలుసుకుందాం.
1. వికీలో ఖాతా లేకుండా దిద్దుబాట్లు చేయలేమా?
- వికీపీడియాలో ఖాతా లేకుండా కూడా దిద్దుబాట్లు చేయవచ్చు. అయితే, ఖాతా లేకుండా దిద్దుబాట్లు చేసినపుడు మీరు చేసే దిద్దుబాట్లు అన్నీ మీరు ఉపయోగిస్తున్న కంప్యూటర్ లేదా మొబైల్ ఐపి.అడ్రస్ తో కనిపిస్తాయి. అయితే, కొత్త వ్యాసాలు మొదలుపెట్టాలంటే తప్పనిసరిగా మీకు ఖాతా ఉండాలి.
2. వికీ ఖాతా తెరవడం వల్ల ఉపయోగం ఏమిటి?
- వికీపీడియాలో ఖాతా సృష్టించుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఖాతా లేకుండా దిద్దుబాట్లు చేస్తే మీరు దిద్దుబాట్లు చేస్తున్న ఆ కంప్యూటరు ఐ.పి.అడ్రసు ద్వారా మీ గురించి సమాచారాన్ని కనుక్కోగలిగే అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచి, లాగిన్ అయినపుడు మీ ఐ.పి.అడ్రసు బయటికి కనబడదు కాబట్టి, మీ గురించి గురించి సమాచారాన్ని కనుక్కునే అవకాశం ఉండదు. అంతేకాకుండా, ఈ ఐ.పి.అడ్రసులు తరచూ మారే అవకాశం ఉంటుంది కాబట్టి, వివిధ సమయాల్లో మీరు చేసిన దిద్దుబాట్లు అనేక ఐపీలకు చెంది మీకు గుర్తింపు లభించదు. చర్చలో పాల్గొన్నపుడు ఇతర సభ్యులు లాగిన్ అయి ఉన్న సభ్యునితో చర్చించేందుకు ఇష్టపడతారు గానీ, ఐ.పి.అడ్రసుతో చర్చించేందుకు అంతగా ఇష్టపడరు. ఖాతా ఉన్న సభ్యులకు మాత్రమే వికీపీడియా నిర్వాహకులయ్యే అవకాశం ఉంటుంది.
3. ఖాతాల పేర్ల ఎంపికకు ఏవైనా నియమాలు ఉన్నాయా?
- వివాదాస్పదమైన పేరు కాకుండా మీ అసలుపేరు, మీ ముద్దుపేరు లాంటివి వికీపీడియా ఖాతా పేర్లుగా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో వివిధ మతాలు, కులాలు, వర్గాలకు చెందిన వాడుకరులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి, మీరు ఎంచుకునే వాడుకరిపేరు వారెవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు.
4. ఖాతా తెరవడంలో ఈమెయిల్ ఉపయోగం ఏమిటి?
- ఖాతా తెరిచిన తరువాత మీ సభ్యనామాన్ని (యూజర్ నేమ్), మీ సంకేత పదాన్ని (పాస్ వర్డ్) మర్చిపోయనపుడు, అదే ఖాతాను తిరిగి పొందడానికి ఈమెయిల్ ఉపయోగపడుతుంది. కాబట్టి, ఖాతా తెరిచేపుడే మీ ఈమెయిలు అడ్రసు ఇచ్చి, ఆ తరువాత దాన్ని నిర్ధారిస్తే, మీరు సంకేతపదం మరిచిపోయినపుడు కొత్త సంకేతపదాన్ని ఈమెయిల్ ద్వారా పొందవచ్చు.
5. వేర్వేరు భాషల వికీలకు వేర్వేరు ఖాతా తెరవాలా? ఒకటే వాడవచ్చా?
- అవసరం లేదు. వికీపీడియాలో ఒక భాషలో మీరు ఖాతా తెరిచిన తరువాత అన్ని భాషల వికీపీడియాలలో అదే ఖాతాతో దిద్దుబాట్లు చేయవచ్చు.
6. ఖాతా పేరు, పాస్వర్డ్ మరిచిపోతే ఎలా రాబట్టాలి?
- ఖాతా తెరిచేపుడు మీ ఈమెయిలు అడ్రసు ఇచ్చి, ఆ తరువాత దాన్ని నిర్ధారిస్తే, మీ సభ్యనామాన్ని (యూజర్ నేమ్) , మీ సంకేత పదాన్ని (పాస్ వర్డ్) మీరు సంకేతపదం మరిచిపోయినపుడు ఈమెయిల్ ద్వారా రాబట్టవచ్చు.
7. ఖాతా పేరును ఇతర భాషలలోకి మార్చుకోవచ్చా? మార్చుకోవాలంటే ఏం చేయాలి?
- మార్చుకోవచ్చు. వాడుకరిపేరు మార్చుకోవాలనుకుంటే సార్వత్రిక పేరుమార్పు అభ్యర్ధన పేజీలో పేరు మార్పుకోసం అభ్యర్ధన చేయాలి. అలా పంపిన అభ్యర్ధనలన్నీ పేరు మార్చగలిగే అనుమతులున్న వాడుకరులకు చేరుతాయి. పేరుమార్పు పని పూర్తి కాగానే ఈమెయిలు ద్వారా మీకు తెలియజేస్తారు. మీ పాత మార్పుచేర్పులన్నీ ఈ కొత్త వాడుకరిపేరుకు వచ్చేస్తాయి.
8. నా ఖాతాను డిలీట్ చేయవచ్చా?
- వికీమీడియాలోని ఖాతాలను డిలీట్ చేయడం సాధ్యం కాదు. మీరు అకౌంటును ప్రారంభించిన తరవాత మీరు అజ్ఞాతంగా వుండదలిస్తే, మీరు మీ అకౌంటు పేరు మార్చుకోవచ్చు.
ఇక వికీపీడియాలో ఖాతాను సృష్టించుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
- వికీపీడియా సైటు తెరిచినపుడు కుడివైపు పైభాగంలో ‘‘ఖాతా సృష్టించుకోండి’’ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినపుడు, మరో పేజీ ఓపన్ అవుతుంది. అందులో వాడుకరి పేరు (యూజర్ నేమ్), సంకేతపదం (పాస్ వర్డ్), ఈమెయిలు చిరునామా, క్యాప్చా భద్రతా తనిఖీ మొదలైనవి నింపి, వాటి కింద నీలిరంగు బాక్స్ లో ఉన్న ఖాతా సృష్టించుకోండి అనేది నొక్కితే, ఖాతా సృష్టించబడుతుంది.
వీడియో పాఠ్యం
[మార్చు]వికీపీడియాలో రాయాలంటే ఖాతా ఉండాలని, అదేనండీ యూజర్ అకౌంట్ ఉండాలని మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ అకౌంట్ ను ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసినంత ఈజీగా వికీపీడియాలో అకౌంట్ క్రియేట్ చేయవచ్చు. తెలుగు వికీపీడియా సైటు ఓపన్ చేసినపుడు రైట్ సైడ్ పైభాగంలో ‘‘ఖాతా సృష్టించుకోండి’’ అనే లింకు మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినపుడు, మరో పేజీ ఓపన్ అవుతుంది. అక్కడ మీరు వికీపీడియా అకౌంట్ ను సృష్టించుకోవచ్చు.
అకౌంట్ లేకుండా వికీలో ఎడిట్లు చేయలేమా అని కొందరికి డౌట్ రావచ్చు. అకౌంట్ లేకుండా కూడా వికీలో రాయోచ్చు. అయితే, అకౌంట్ లేకుండా ఎడిట్లు చేసినపుడు ఆ ఎడిట్లన్నీ మీరు ఉపయోగిస్తున్న కంప్యూటర్ లేదా మొబైల్ ఐపి.అడ్రస్ తో కనిపిస్తాయి. అయితే, కొత్త వ్యాసాలు మొదలుపెట్టాలంటే మాత్రం తప్పనిసరిగా మీకు అకౌంట్ ఉండాలి.
వికీపీడియా అకౌంట్ వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అకౌంట్ ద్వారా వికీపీడియాలో రాస్తున్నపుడు మీ ఐ.పి.అడ్రసు బయటికి కనబడదు కాబట్టి, మీ గురించి సమాచారాన్ని కనుక్కునే అవకాశం ఉండదు. మీరు చేసిన ఎడిట్లన్నీ మీ అకౌంట్ లో చేరిపోతాయి. ఇతర వికీపీడియన్లతో చర్చల్లో కూడా పాల్గొనవచ్చు. అకౌంట్ ఉన్న వికీపీడియన్లకు మాత్రమే వికీపీడియా నిర్వాహకులయ్యే అవకాశం ఉంటుంది. ఇక, మన అకౌంట్ వివరాలు మరిచిపోయినపుడు వాటిని తిరిగి పొందడానికి ఈమెయిల్ ఉపయోగపడుతుంది.
ఇక వికీపీడియాలో ఖాతాను సృష్టించుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తపేజీ ఓపన్ అయిన తరువాత మొదటి బాక్స్ లో వాడుకరి పేరు, అంటే యూజర్ నేమ్... రెండవ బాక్స్ లో సంకేతపదం, అంటే పాస్ వర్డ్... మూడవ బాక్స్ లో పాస్ వర్డ్ నిర్ధారణ, నాలుగవ బాక్స్ లో ఈమెయిలు చిరునామా, ఆ కింది బాక్స్ లో క్యాప్చా భద్రతా తనిఖీ మొదలైనవి రాసి, వాటికింద బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న ఖాతా సృష్టించుకోండి అనేది నొక్కితే, అకౌంట్ సృష్టించబడుతుంది. ఆ తరువాత మీరు వికీపీడియాలో చేరినట్టు మీరు ఒక అలర్ట్ కూడా వస్తుంది. వికీపీడియా సైటు పైభాగంలో మీరు క్రియేట్ చేసిన అకౌంట్ పేరు రెడ్ కలర్ లో మీకు కనిపిస్తుంది. ఇక మీరు వికీపీడియాలో మీ అకౌంట్ తో ఎడిట్లు చేయోచ్చన్నమాట.
వికీపీడియా సైటునుండి లాగౌట్ అవడంగానీ, మీ బ్రౌజర్ క్లోజ్ చేయడంగాని జరిగినపుడు, వికీపీడియాలో రాయడానికి మళ్ళీ కొత్త అకౌంట్ ఓపన్ చేయాల్సినవసరంలేదు. వికీపీడియా సైటు ఓపన్ చేసి కుడివైపు పైభాగంలో చివరన ‘‘లాగినవండి’’ అనే లింకు మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినపుడు, మరో పేజీలో లాగిన్ వివరాలు ఓపన్ అవుతాయి. అక్కడ మీ అకౌంట్ పేరు, పాస్ వర్డ్ రాసి వాటికింద బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న లాగినవండి అనేది నొక్కితే, లాగిన్ అవుతంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకే వికీపీడియా అకౌంట్ తో అన్ని భాషల వికీపీడియాల్లో లాగాన్ అవ్వోచ్చు.
ఇదండీ, వికీపీడియాలో అకౌంట్ ఓపన్ చేసే విధానం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వికీపీడియాలో అకౌంట్ ఓపన్ చేసి, చకచకా మీకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో రాసేయండి మరి.