Jump to content

వికీపీడియా:తెవికీ వార్త/2011-12-09/భారత వికీ సమావేశం 2011

వికీపీడియా నుండి
తెవికీ వార్త
తెవికీ వార్త
భారత వికీ సమావేశం 2011

భారత వికీ సమావేశం 2011

భారత వికీ సమావేశం లో జిమ్మీ వేల్స్ ప్రారంభోపన్యాసం
ముంబాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ దర్బారు లో అతి పెద్దదైన వికీ సమావేశం
పొల్గొన్న కొంత మంది తెలుగు వికీపీడియన్లు

నవంబర్ 18,19,20 భారత వికీపీడియన్‌లకు, ఇవి పర్వదినాలు. ఎంతగానో ఎదురుచూసిన ఈరోజులు రానేవచ్చేశాయి. ఈనాటి వరకు, ఎవరికి వారుగా వికీపీడియాకు ఎన్నోకూర్పులు చేసిన ఎందరో వికీపీడియన్లు ఒకరికొకరు కలిసుకోగలిగే, మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. వందలకొద్ది వికీపేడియన్లు అందరూ భారతదేశ ఆర్ధికరాజధాని ముంబైలో కలుసుకున్నారు. అందరూ నిస్వార్దంగా, సేవే పరమోద్దేశంగా పనిచేస్తున్న కార్యకర్తలే. వాళ్ళుచేస్తున్న శ్రమకు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా రాదు. అయినా అలుపెరుగకుండా కష్టపడుతున్నవాళ్ళే. పోనీ ఊసుపోక చేస్తున్నారా అంటే, అదీకాదు. అందరూ ఊపిరిసలపలేనంత పనుల్లో ఉన్నవాళ్ళే. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఉన్నారు. రోజులో పట్టుమని 4 గంటలు సమయం నిద్రకి కేటాయించలేనివాళ్ళూఉన్నారు. 10నెలల్లో 10000 కూర్పులు చేసిన రాజశేఖర్‌గారి శ్రమను, దేనితో విలువకట్టగలం? ప్రొద్దున లేచిన దగ్గరనుండి, నిద్రపోయేవరకు రోగులకు సేవచేస్తూ, వీటికి ఎలా కూర్పులుచేయగలుగుతున్నారు? ఎంతో ధృడసంకల్పం ఉంటేకానీ అదిసాధ్యంకాదు కదా! మరి రూపాయికూడా రాని ఈ పనిని వీళ్ళందరూ ఎందుకుచేస్తున్నారా అనుకుంటున్నారా? వాళ్ళకి దీని విలువ తెలుసుకాబట్టి. ఇది విజ్ఞానసర్వస్వం కాబట్టి. భవిష్యత్తులో మన పిల్లలకు, మనవలకుకూడా ఉపయోగపడుతుంది. ఇది పంచుకుంటే తరిగిపొయే డబ్బుకాదు, పంచినకొద్దీ పెరిగే మేధస్సు. వీళ్ళు ఇంత కష్టపడిచేస్తున్నారుకాబట్టే, కోటికి ఒక్కళ్ళు చేస్తున్నా, నేడు ఈవిజ్ఞానసర్వస్వం ఇంతటి విషయపరిజ్ఞానాన్ని సంతరించుకోగలిగింది.

నిజమేనండీ, కోటికి ఒక్కళ్ళే చేస్తున్నారు. ఉదాహరణకు, హిందీ వికీపీడియాని తీసుకుందాం. 42.2 కోట్ల హిందీ మాట్లాడేవాళ్ళకుగాను, 56 మంది ఓత్సాహిక వికీపీడియన్లు (నెలలో కనీసం ఐదు మార్పులు చేసేవారు ) ఉన్నారు. అంటే దగ్గర దగ్గర కోటికి ఒక్కరే కదా? మన తెలుగులో మరికాస్త ఎక్కువేమరి. 8 కోట్లమంది తెలుగుభాష మాట్లాడేవారికిగాను, 31 మంది ఓత్సాహిక వికీపీడియన్లు ఉన్నారు. అంటే కోటికి నలుగురన్నమాట. మరింతమందిని దీనికి ప్రేరేపించడం అంత కష్టమేమీకాదు. ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన ఈ భరతఖండంలో సత్‌మనస్కులకు కరువేంలేదు. అందరికి దీనిగూర్చి అవగాహన కల్పించడమే తరువాయి.

సమావేశ ముఖ్య విషయాలు

మరి ఇటీవల జరిగిన సమ్మేళనం (ఇంగ్లీషు వెబ్సైట్ )గూర్చి తెలుసుకుందాం. ఈ సమావేశాన్ని ముంబయి వికీమీడియా సముదాయం,భారత వికీమీడియా సంస్థ సహభాగిత్వంలో, వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇతర సంస్థలు అనుదానంతో ముంబై విశ్వవిద్యాలయం వారి ఫోర్ట్ ప్రాంగణంలో జరిగింది. ఇది మూడురోజులు కార్యక్రమం. దీనిలో మన దేశంలోని అన్ని ప్రాంతాలనుండి మరియు విదేశాల నుండి వికీ ప్రాజెక్టులపై పనిచేసేవారు, ఆసక్తివున్న వారు 600 పైగా పాల్గొన్నారు. వికీ ప్రాజెక్టులకు విశేషసేవలు అందించినవారికి, ఈ సమావేశంలో పాల్గొనటానికి ప్రోత్సాహకంగా, రానుపోను ప్రయాణఖర్చులు, ఉండటానికి వసతి కల్పించారు. ఇందుకుగాను, 7070 అప్లికేషన్లు రాగా, 100 మందికి చేయూతనందించగలిగారు.

వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ ఉపన్యాసంతో ఈసమ్మేళనం 18 నవంబర్ 2011, ముంబయి విశ్వవిద్యాలయం వారి ఫోర్ట్ ప్రాంగణంలో చారిత్రాత్మక పట్టాప్రదాన భవనం (కన్వోకేషన్ హాల్) లో మొదలైంది. జిమ్మీ వేల్స్ భారతీయ భాషలను వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ఇంగ్లీషు లోని విధానాలను, గుడ్డిగా అనుకరించవద్దని, వాటిని సరళీకృతం చేయాల్సిన అవసరముందని ప్రసంగించారు. వికీలో పనిచేసేవారు, స్థానికి చట్టాలను గౌరవించాలని అయితే భావస్వేచ్ఛకు భంగం కలిగించే చట్టాలయితే వాటికి వ్యతిరేకంగా జాగృతి కలిగించటానికి కృషి చేయాలని వికీపీడియన్లను కోరారు. వికీపీడియా వ్యాసాలు వివిధ ధృక్కోణాలనుండి సమాచారం అందించి, ప్రపంచ శాంతికి దోహదం చేస్తున్నదని వివరించారు.

అనుబంధంగా వున్న ఇతర రెండు ఉపన్యాస గదులలో తోపాటు ఒకేసారి వేరువేరు విషయాలమీద ప్రసంగాలు, చర్చలు జరిగాయి. కొత్తవారికి వికీపీడియాని పరిచయంచేయడంనుండి నుండి ఈవిషయంలో తలపండిన వారికి సంబందించిన చర్చలూ ఎన్నో జరిగాయి. దాదాపు అన్ని భారతీయభాషలలో పనిచేస్తున్న వారు వారి వారి భాషలలో జరుగుతున్న కృషిని వివరించారు. మళయాళవికీపీడియావాళ్ళు చేస్తున్న " సిడి లో వికీపీడియా" ప్రాజెక్టు చాలా చాలా బాగుంది. భారతభాషలలో టైపు చేయగలిగేందుకు నరయం ప్రాజెక్టు చాలా ఉపయోగకరం. దీనిని మరిన్ని భారతీయభాషలకోసం ఉపయోగించాలని ప్రతిపాదించారు. వికీపీడియాని మొబైల్ ఫోన్‌లో, డివిడి(DVD) ప్లేయర్లలో అందుబాటులోకి తేచ్చే మైక్రోసాఫ్ట్ రీసర్చ్ ప్రాజెక్టు అద్భుతం. దీనివల్ల, కంప్యూటర్ అందుబాటులోలేని ఎందరో భారతీయులకు ఈ విజ్ఞానసర్వస్వం చేరువవుతుంది. ఇందులోని విశేషమేమంటే, వాళ్ళు దీన్ని లాభాపేక్షలేకుండా, సమాజశ్రేయస్సుకై మాత్రమే చేయడం.

ఇక్కడ మనమొక విశేషంగూర్చి చెప్పుకోవాలి. భారతీయభాషల వికీపీడియాలకోసం, భారతీయులుమాత్రమే శ్రమించడంలేదు. అదేభాష మాట్లాడే విదేశీ వికీపీడియన్లూ శ్రమిస్తున్నారు. ఉదాహరణకు బెంగాల్ వికీపీడియాకోసం బంగ్లాదేశ్ వికీపీడియన్లూ, తమిళ్ వికీపీడియాకోసం శ్రీలంక వికీపీడియన్లూ శ్రమిస్తున్నారు.

కాదేదీ కవితకనర్హం అన్నచందంగా, వీళ్ళకు భోజనవిరామాలల్లో కూడా సమయం వృధాగాపోలేదు. ఒకరినొకరు పరిచయంచేసుకునే పరిచయ కార్యక్రమాలు కొనసాగించారు. ఉదాహరణకు సంస్కృతభారతి సుమనగారు, సంస్కృత వికీపీడియాకొరకు పరిశ్రమిస్తున్నారు. వీరికి కంప్యూటర్ వాడటంలో, సంస్కృత వికీపీడియా వాడుటలో సహాయం కావాలి. తనకి అదే బెంగళూరులో నివసించే సంస్కృతం నేర్చుకోవాలని అభిలాషించే కంప్యూటర్ ఇంజనీరుతో పరిచయమయ్యింది. ఇద్దరికి ఒకరికొకరు సహాయం చేసుకోగలిగే అవకాశం కలిగింది. చీమలుకూడా వీళ్ళనుండి నేర్చుకోవలసిందేనన్నట్లు చేస్తున్న వీరి కృషినిచూసి ముగ్ధులై అక్కడికక్కడ 70 మంది పైగా భారత వికీమీడియా లో సభ్యత్వం తీసుకున్నారు.

దీనిలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులలో యునైటెడ్ కింగ్డమ్ లో గీతాంజలి బహభాషా సాహిత్య సంస్థకి చెంది భారతీయ భాషలకొరకు విశేష కృషి చేసిన ఫ్రొపెసర్ కృష్ణకుమార్, టైమ్స్ నౌ ఛానల్ నుండి ఆర్నబ్ గోస్వామి, సూపర్30 ఆనంద్ కుమార్, వికీమీడియా ఫౌండేషన్ ప్రపంచ ప్రాజెక్టుఅభివృద్ధి అధికారి బేరీ న్యూస్టెడ్ వున్నారు. వారందరు వికీపీడియన్ల శ్రమని అభినందించారు. ఈ విజ్ఞానసర్వస్వం అందరికి చాలా ఉపగయోగమన్నారు.

తెలుగు వికీ ప్రాజెక్టుల ప్రసంగం

వికిలో తెలుగు వ్యాసాల స్థితి పై ప్రసంగిస్తున్న సి.భాస్కర రావు

సి భాస్కర్ రావు గారుతెలుగు వికీపీడియా అభివృద్ధి (వికీ స్థితిగతులు (ఇంగ్లీషులో స్లైడు పేజీలు 95-103))గురించి వివరించారు. దీనికి ఇ-తెలుగు సంస్థ చేసిన కార్యకలాపాలను, వివిధ వికీపీడియన్ల సేవలను కొనియాడారు. రహ్మనుద్దీన్ తెలుగు వికీపీడియాలో మొలక వ్యాసాలను గురించి ప్రసంగించారు. ప్రతి గ్రామం పేరుతో ప్రారంభించిన మొలక వ్యాసాలు చాలా వరకు మొలకలాగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి , ఈనాడు ముంబయి సంచికలు ఈకార్యక్రమానికి సంబంధించిన వార్తలను ప్రచురించాయి.

చాప్టర్ విభాగం

చాప్టర్ వివరణ

భారత వికీమీడియా చాప్టర్ అధ్యక్షుడు అర్జునరావు చాప్టర్ స్థాపనకి పూర్వ పనుల, స్థాపన తర్వాత జరుగుతున్న కృషిని ( ఇంగ్లీషులో ప్రదర్శనపత్రాలు) వివరించారు. మొబైల్ ఫోన్లలో భారతీయ భాషల తోడ్పాటు ప్రారంభంకావడంతో, భారతీయ భాషలు ఇంగ్లీషు స్థాయికి సమానంగా చేరుకోటానికి, ప్రజల సమాచార అవసరాలు వారి వారి భాషలలో తీర్చటానికి గల అవకాశాలను వివరించారు.దీనిని సాకారం చేయటానికి, భారత వికీపీడియన్లు భారత వికీమీడియాలో సభ్యులుగా చేరి, అవగాహనను పెంపొందించటానికి, వ్యాసాల నాణ్యతను పెంచడానికి కృషి చేయాలని కోరారు.

పురస్కారాలు

వికీప్రాజెక్టులకు విశేషసేవలందించినవారికి విశిష్ట వికీమీడియన్ గుర్తింపు 2011 (NWR2011) గుర్తింపు (గుర్తింపు ప్రదర్శన పత్రం (ఇంగ్లీషులో) )సత్కారాలందించారు. ఇవి అందుకున్న కొందరి ప్రముఖులగూర్చి తెలుసుకుందాం. మన తెలుగు వికీపీడియాకి సంబంధించి అత్యధిక మార్పులు చేసి తెలుగు వికీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వృత్తిరీత్యా వైద్యుడైన డా:రాజశేఖర్ గారికి, విక్షనరీ మరియు వికీపీడియాలో విశేషంగా కృషిచేసిన గృహిణి, టి సుజాత గారికి, భారత వికీమీడియా సంస్థ వారి విశిష్ట వికీమీడియన్ గుర్తింపు లభించింది. ఇక న్యాయ నిర్ణేతల ప్రత్యేక మన్ననలు పొందిని వారి లో కొందరిని గురించి తెలుసుకుందాం. అంధుడైన అనిరుధ్ గత రెండు సంవత్సరాలలో 8500 కూర్పులు చేసి, హిందీలో 8వ అత్యంత ఓత్సాహిక వికీపీడియన్‌గా నిలిచాడు. 76 సంవత్సరాల వృద్ధుడైన సెంగై పొదువన్, అన్నంతినటానికి ఒకరి సహాయం తీసుకొనవలసిన స్థితిలోఉండికూడా, తమిళ్ వికీపీడియాకు 8800 కూర్పులుచేసి 8వ అత్యంత ఓత్సాహిక తమిళ వికీపీడియన్ అయ్యారు. 5 సంవత్సరాలకింద కంప్యూటర్ కొని, దాన్ని నేర్చుకొని, గత 15 నెలల్లో ఇన్ని కూర్పులు చేసి, మనందరికి స్ఫూర్తిగానిలిచారు.

ఆట విడుపు

సాయంత్రపు నృత్య హేల లో ద్రాక్షారసం మరియు భోజనాల లో పాల్గొన్న కొందరు తెలుగు వికిపిడియన్లు

విఘ్నాలుకలుగకుండా, విఘ్నరాజును ప్రార్ధించినట్లులేరు. మరి విఘ్నాలను నిలువరించేదెవ్వరు? భారతదేశపట విషయంగా విఘ్నాలు రానే వచ్చాయి. మొదటి రోజు జిమ్మీ వేల్స్ ని,భారత వికీపీడియా ఛైర్మన్ ని నిర్భందించాలని ఒక రాజకీయ పార్టీ యువ కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకోబోయారు. నిస్వార్దంగా ఈ విజ్ఞానసర్వస్వంకోసం అహర్నిశలు కష్టపడుతున్నవారిని నిర్భందించమనడం కడుశోచనీయం.అయితే ముంబై పోలీసుల సహకారంతో కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది.

మొద్దుబారితే గొడ్డలికి సాన అవసరమని వీరికిబాగా తెలుసండోయ్. అందుకే, పొల్గొన్న వారి ఆహ్లదం కోసం మొదటి రోజు రాత్రి పార్టీని, చివరి రోజున, ముంబై విహార ( హెరిటేజ్) యాత్రని ఏర్పాటు చేశారు.

ఇంతపెద్ద సమ్మేళనాలను నిర్వహించడానికి, పెద్ద పెద్ద కంపనీలకు కూడా చాలా కష్టమయిన పని. చాలా పెద్ద ప్రణాళిక, అమలు చేయగల దక్షత కావాలి. మరి అటువంటి దానిని, భారత వికీమీడియన్లు ముంబయి సముదాయం వారి నాయకత్వంలో , భారత వికీమీడియా వారి సహభాగిత్వంతో, వికీమీడియా ఫొండేషన్ మరియు ఇతర సంస్థల అనుదానంతో చక్కగా చేయగలిగారు . ఈ కృషిలో పాలు పంచుకున్న వారందరికి అభివందనలు. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని వికీ ప్రాజెక్టులను అభివృద్ధిపరచడానికి తోడ్పడాలని కోరుకుందాం.

ఇతర వివరాలు

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
వ్యాఖ్యలు లేవు. మీరే మొదటి వ్యాఖ్య చేయవచ్చు.!