వికీపీడియా:తెవికీ వార్త/2010-07-26/వికీసముదాయ జాతర-వికీమేనియా 2010
వికీసముదాయ జాతర-వికీమేనియా 2010
వికీమేనియా 2010[1] పోలండ్‌లోని గదాన్స్క్ నగరంలో 9 నుండి 11 జులై వరకు జరిగింది. వివిధ భాషల వికీపీడియన్లు తమ ఆలోచనలు పంచుకోవడానికి, ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకోవటానికి, భవిష్యత్ కార్యక్రమాలు చర్చించటానికి 2005 నుండి ప్రతి సంవత్సరం జరుగుతున్న జాతరే వికీమేనియా.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3d/2010-07-09-gdansk-by-RalfR-029.jpg/220px-2010-07-09-gdansk-by-RalfR-029.jpg)
నేను 2007 నుండి తెలుగు వికీపీడియాలో పనిచేస్తున్నా, దీని గురించిన అవగాహన అంతగా వుండేది కాదు. క్రిందటి సంవత్సరం బ్యూనిస్ ఎయిర్స్ లో జరిగిన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తోటి వికీపీడియన్లతో మాట్లాడిన తరువాత ఈ కార్యక్రమంపై ఆసక్తి కలిగింది. అయినా ఈ సంవత్సరం వెళదామని అనుకోలేదు. వికీపీడియా విద్యార్థి వేతనాల ప్రకటన విడుదలైన తరువాత, శ్రీనివాస్ ప్రోద్బలంతో అభ్యర్థన పంపించాను. నేను తెవికీకి చేసిన కృషి, సమావేశంలో ప్రాజెక్టు నిర్వహణలోమంచి పద్ధతుల అనే ఉపన్యాసం ఇతివృత్తం అభ్యర్థనలో రాశాను. నాకు విద్యార్థి వేతనం మంజూరు అయింది. పర్యటనలో మనదేశంలో అయ్యే ఖర్చు మనం పెట్టుకుంటే, విమాన ఛార్జీలు, అక్కడి వసతి,ఆహారం ఖర్చులు సమావేశపు ఫీజు, వారు భరిస్తారు. అవసరమైతే మనదేశపు ఖర్చులను కూడా ఇస్తామని చెప్పారు. ఆ తరువాత వీసా కోసం ప్రయత్నించితే, వివిధ ఇబ్బందులవలన, చివరిరోజు దాకా వీసా మంజూరు అవుతుందా లేదా అన్న బెంగతో గడపాల్సి వచ్చింది. జులై 8 న వీసా స్టాంపు తో పాస్‌పోర్టు చేతికి రావటంతో కాస్త ఊపిరి పీల్చుకొని, విమానం ఎక్కేశాను. ప్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో దిగి, ఆ తరువాత గదాన్స్క్ కి ఇంకొక విమానంలో చేరుకున్నాము. మన దేశంనుండి వచ్చిన ఇంకా ఐదుగురుతో విడిదికి వెళితే, అక్కడ మాకు వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి వసతి గృహాలలో వసతి కల్పించారు. మాకు ఇంగ్లీషు-పోలిష్ అనువాదకుల సహాయం లభించింది.
వికీమీడియా ప్రణాళిక
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bc/Wikimedia_Foundation_board_of_trustees_at_Wikimania_2010_no._4.jpg/220px-Wikimedia_Foundation_board_of_trustees_at_Wikimania_2010_no._4.jpg)
మొదటి రోజు, మొదటి అంశంగా వికీమీడియా ఫౌండేషన్ కార్యకాలిక నిర్వాహకి అయిన సూ గార్డెనర్ వికీమీడియా ప్రణాళికా వ్యూహాలపై ఉపన్యసించింది. జులై 2009 నుండి 1000 పైగా ఔత్సాహికులు 2300కి పైగా చర్చాపేజీలలో పాల్గొని దీని తయారీకి తోడ్పడ్డారు. దీని ముఖ్యాంశాలు
- 2010-2015 లక్ష్యాలు
- చదువరుల సంఖ్యలో ధృఢమైన, ఏకరూప పెరుగుదల సాధించటం.
- 2015 నాటికి 680 మిలియన్లు (2010 లో 388 మిలియన్లు). ఉత్తరార్ధ గోళంలో 4 శాతం. దక్షిణార్ధ గోళంలో 12 శాతం పెరుగుదల.
- ప్రపంచంలో అన్ని భాగాలలో వికీ సముదాయాన్ని అరోగ్యకరమైన అభివృద్ధి చేయడం.
- 1,20,000 కన్నా తక్కువ వ్యాసాలుగల చిన్న వికీపీడియాల త్వరిత పెరుగుదల.
- వికీపీడియా అందుబాటు వుండటానికి, మూలసౌకర్యాలు సురక్షితంగా,చాలినంతగా, స్థిరంగా వుండేటట్లుచేయటం.
- సృజనాత్మకను రగిలించి, ప్రయోగాలలో ముఖ్యమైన వాటిని వికీపీడియా లో భాగంగాచేయటం.
- 2010 లక్ష్యాలు
- వికీమీడియా వెబ్ సైట్ల అందుబాటుతనాన్ని పెంచటం
- మొబైల్ /అంతర్జాల సంపర్కం లేని వాడుకరుల అనుభవాన్ని మెరుగుపర్చటం.
- ఔత్సాహికుల పని, స్ట్రాటెజిక్ ప్రణాళికకి అనుగుణంగా ప్రోత్సహించడం.
- ముఖ్యమైన భూభాగాలలో సముదాయపు కార్యక్రమాలకు తోడ్పడటం (భారతదేశంలో కార్యాలయంనెలకొల్పి కొత్త సంపాదకులను చేర్చటం,సంపాదకులను సంస్థాగతం చేయటం)
- 44 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకొనడం. వీటిలో 36మంది సాంకేతిక లేక సముదాయం తోటి పనిచేసే స్థానాలు.
- ఆరోగ్యకరమైన ఉద్యోగుల సంస్కృతిని పెంచడం.
- US$20.4 మిలియన్ల ధన సేకరణ.
- వికీలో, స్థానాలు, బాధ్యతలు నిర్వచించడం లేక మెరుగుచేయడం.
మనం చేస్తున్న పని ఇంతకుముందు ఎవరూ చేయలేదు. ఖచ్ఛితత్వాన్ని మనం కోరుకోలేం, ఎందుకంటేఅదిఇంకా లేదు కాబట్టి.మనం ప్రయోగాలు చేస్తూ, వాటిలో తప్పులనుండి నేర్చుకుంటూ ముందుకుపోదాం అని ముగించారు. ఆ తరువాత వికీమీడియా బోర్డు సభ్యులతో వికీ సముదాయ చర్చ జరిగింది.
మన భవిష్యత్తునుండి గొంతులు: చిన్న వికీపీడియాలు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/2010-07-11-gdansk-by-RalfR-001.jpg/220px-2010-07-11-gdansk-by-RalfR-001.jpg)
మూడవ రోజు జిమ్మి వేల్స్ ప్రధానోపన్యాసం చేశారు. దీని శీర్షిక "మన భవిష్యత్తునుండి గొంతులు: చిన్న వికీపీడియాలు" చిన్న వికీపీడియా సభ్యులతో జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా దీనిని తయారుచేశారు. ఆఫ్రికాలో మారుమూల గ్రామంలో, ఒఎల్టిపి (ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌టాప్) ప్రాజెక్టు వలన పిల్లలు వికీపీడియా ద్వారా విషయాలను నేర్చుకుంటున్న విషయంపై డాక్యుమెంటరీ, వికీసభ్యుల ఇంటర్వ్యూలు (శ్రీలంక, మాసిడోనియా, స్వాహిలి) చూపించారు. మళయాళం వికీ పీడియన్లు రూపొందించిన 500 వ్యాసాల ఆఫ్‌లైన్ సిడి ఆవిష్కరించారు. సాంకేతిక సమస్యల నిర్మూలన, చాప్టర్ ఆర్థిక సహాయం పథకం, అనుభవాలు పంచుకోవడం, ఉత్సాహపరచడం ద్వారా పెద్ద వికీ సభ్యులు తోడ్పడాలని పేర్కొన్నారు.
నేను పాల్గొన్న కార్యక్రమాల ముఖ్యాంశాలు
సమావేశాన్ని సముదాయ రంగం, విజ్ఞాన రంగం, మూలసౌకర్యాల రంగాలుగా విభజించి ఏకకాలంలో నాలుగు సమావేశ హాలులో జరిగేటట్లురూపొందించారు. వీటిలో ఉపన్యాసాలు, వర్క్ షాపులు, ట్యుటోరియల్స్, చర్చలు వున్నాయి. వివిధ రకాలైన సమావేశాలు ఏకకాలంలో జరుగుతుండటంతో, ఒక్కొక్కదానిని గూర్చి 20-30 సెకండ్లలో ప్రకటన విధానాన్ని (వికీ మాడ్నెస్ అనగా వికీ పిచ్చి అనే శీర్షిక) ప్రతి రోజు ఉదయం జరిపారు. నేను పాల్గొన్న కార్యక్రమాల ముఖ్యాంశాలు
- వికీమీడియా ఆసియా ప్రాజెక్టు ద్వారా వికీ అభివృద్ధికి కృషి పై పానెల్ చర్చ
- పీడియాప్రెస్ ద్వారా వికీపీడియా వ్యాసాలను పుస్తకరూపంలో చేయటం. ఈ విధంగా చేయటంవలన ప్రస్తుత వ్యాసాలలో లోటుపాట్లు బయటపడడంతో వ్యాసాలనుమెరుగుచేయటానికి వీలవుతుంది. ఇది ఇంకా భారతీయభాషలకు అమలుచేయవలనివుంది.
- "వికీపీడియాని సిద్ధాంతీకరంచలేము, అనుభవంలోనే పనిచేస్తుంది. నిర్దిష్ట నియమాలు అమలుచేస్తే అవాంఛిత ప్రవర్తనలు బయటపడతాయి" వికీపీడియా ఉపన్యాసాలు (అంగ్లం) ఆధారంగా, కిమ్ బ్రూనింగ్ ఉపన్యాసం.
- గూగుల్ అనువాద పరికరం ద్వారా ఇండిక్ భాషలలో 1000కి పైగా వ్యాసాలతో 10 మిలియన్ పదాలు చేర్చారు. గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉపన్యాసం మరియు "అనువాద వ్యాసాల పై తమిళ వికీ అనుభవాలు" ఉపన్యాసం [2] మరిన్ని వివరాలకు గూగుల్ అనువాద వ్యాసాలు అనే వ్యాసం చూడండి.
- వికీమీడియా ప్రాజెక్టుల గురించి ఎరిక్ ముల్లర్ విశ్లేషణ[3] . పెరుగుదల అవకాశం, కష్టం అనే రెండు లక్షణాలను విశ్లేషించి, పెరుగుదలకి ఏంచేయాలో తెలిపారు.
- అంతర్గత వికీని అమెరికా దౌత్య కార్యాలయాల్లో వాడుతున్నారు. దీనిని డిప్లోపీడియాగా వ్యవహరిస్తున్నారు.
- "చదివేవారు ఉచితంగా దొరికితే తీసుకొనేవారుకాదు, చదవటం కూడా వికీపీడియాలో పాల్గొనటమే". చైనా వికీపీడియాని నిషేధించినపుడు, 46 శాతం సంపాదకులు తగ్గిపోయారు. చదువరులుతగ్గితే వికీపీడియా నిర్మాణం చురుకుగా సాగదు.
- కాటలాన్ వికీపీడియాలో వ్యాసాలకోసం మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఇందులో 13 ఉపాధ్యాయులు,160 విద్యార్థులు పాల్గొన్నారు. సమాంతర వికీని నడిపారు. మొత్తం 601 వ్యాసాలు తయారవగా, వాటిలో 472 వ్యాసాలు నాణ్యత పరంగా బాగున్నాయి. వీటిలో బృందాలకు, వ్యక్తిగతంగా బహుమతులు ప్రధానం చేశారు. దీనిని ఇతర యూరోపియన్ దేశాలలో చేయటానికి ప్రయత్నిస్తున్నారు.
- అర్జెంటీనా విశ్యవిద్యాలయంలో, స్లొవేనియాలో కూడా విద్యార్థుల బోధనలో వికీపీడియాతో ప్రయోగాలు జరుగుతున్నాయి. యువజనులు ఇంటర్నెట్ వాడటానికి ఆసక్తి చూపుతారు కాబట్టి, వికీపీడీయా అనువుగా ఉంటుంది.
- పోలిష్ వికీపీడీయాలో నియమాలు ఇంగ్లీషుకంటే భిన్నంగా వున్నాయి.వ్యాసంలో ఎక్కువ మార్పులు చేయవద్దు అనే నియమం పాటిస్తున్నారు. చర్చాపేజీలని ఓ రకమైన ఆన్‌లైన్ ఆటగా వర్ణించి, వాటి వాడకాన్ని తగ్గించారు.
- స్త్రీలు తక్కువ సంఖ్యలో వికీలో పాల్గొనటం గురించిన స్పానిష్ వికీపీడియన్ల ఉపన్యాసంలో, పురుష వికీపీడియన్లతో ఎక్కువ కాలం వాదన పొడిగించటానికి ఇష్టంలేకపోవడం అన్నారు. వారు పాలుపంచుకోక పోవడంతో, ఒక దృక్కోణం వెలుగులోకి రాక విషయం అసంపూర్ణమవుతున్నదని అన్నారు.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0f/Wikimania_2010-07-09_Gdansk_--by-RaBoe-113.jpg/220px-Wikimania_2010-07-09_Gdansk_--by-RaBoe-113.jpg)
సాంస్కృతిక కార్యక్రమాలు
మొదటి రోజు రాత్రి, పేరుగాంచిన పోలిష్ పియాన్ వాద్యకారుడు,సంగీత రచయిత వ్లాడిస్లావ్ స్పిల్మన్ స్మరణగా సంగీత ప్రదర్శన జరిగింది. వ్లాడిస్లావ్ స్పిల్మన్ జీవితంపై పియానిస్ట్ అనే ఆంగ్ల చిత్రం తీయబడినది . దీనికి ఆస్కార్ అవార్డులు వచ్చాయి. రెండవ రోజు రాత్రి సంఖ్యాబలంలో నిజం? వికీపీడియా కథ [4] అనే డాక్యుమెంటరీ చిత్ర తొలి ప్రదర్శన జరిగింది.మే 2010 లో 6 వ ప్రజాదరణ సైటుగా పేరొందిన వికీపీడియా గొప్పదనాన్ని, దీనిపై విమర్శలను తెరకెక్కించారు. ఇంకొన్ని నెలలలో డివిడి రూపంలో అందరికి అందుబాటులో రానుంది. వారణాసిలో జిమీవేల్స్ ఒక ఇంటర్నెట్ వాడుకరి చేత వారణాసి హిందీ వ్యాసంలో 1000 కు బదులుగా 5000 సంవత్సరాల పురాతనమైనదన్న మార్పు చేయించటం మొదటి ప్రధాన దృశ్యం. సినిమా ప్రదర్శన తర్వాత చిత్ర దర్శకులు, జిమ్మీ వేల్స్ పాల్గొన్న గోష్ఠి జరిగింది. ఆతరువాత గదాన్స్క్ ఓడరేవులో పార్టీజరిగింది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f5/GdanskRoyalRoute2.jpg/220px-GdanskRoyalRoute2.jpg)
భారత ఉపఖండంనుండి వచ్చిన ప్రతినిధులు, బారీ న్యూస్టెడ్, ఫౌండేషన్ యొక్క ముఖ్య ప్రపంచ అభివృద్ధి అధికారి, ఇతర భారతీయ భాషాభిమానులతో సమావేశమై, వికీ ప్రగతికి తీసుకోవలసిన చర్యలను చర్చించాము. ఆ తరువాత కొంతమందిమి ఫొటో దిగాము.
తెవికీ సభ్యుల ప్రసంగాలు
ప్రాజెక్టు నిర్వహణలో మంచి పద్ధతులు (ఆంగ్లం) అనే అంశంపై నేను ఉపన్యసించాను. వికీప్రాజెక్టుల లక్ష్యం వ్యాసాల నాణ్యతని పెంచటం. ప్రాజెక్టు మేనేజిమెంట్ ఇన్‌స్టిట్యూట్ వారి ప్రాజెక్టు మేనేజిమెంట్ విజ్ఞాన పుస్తకం ప్రకారం నియమిత కాల అవధి లేకపోతే ప్రాజెక్టు అనిపించుకోదు. అందుకని నియమిత కాల వ్యవధితో, విషయాలకు నిర్దిష్ట పరిధి నిర్ణయించుకొని, ఎజైల్ పద్ధతులు అనగా చేయపోయే పనిని ఎంచుకొనటంలో స్వేచ్ఛ లాంటి పద్ధతులని పాటిస్తూ నిర్వహిస్తే సమర్ధవంతంగా వుంటుందనేది నా ప్రసంగ సారాంశం. ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా వికీప్రాజెక్టు విద్య, ఉపాధి లో నిర్వహిస్తున్నాను. మీరు పాలుపంచుకోండి.
శ్రీనివాస్ తన "అన్ని వికీపీడియాలు సరిసమానం కావు (ఆంగ్లం)" అనే ప్రసంగంలో, చాప్టర్ల వైపు కాకుండా ప్రత్యేక ఆసక్తి గుంపులను ప్రోత్సహించాలని సూచించారు. వికీమీడియా ఆసియా ప్రాజెక్టు ద్వారా వికీ అభివృద్ధికి కృషి పై పానెల్ చర్చలో పాల్గొని భారతదేశ ప్రాధాన్యాన్ని వివరించారు.
ఉపసంహారం
ఈ మూడు రోజులు ఒక కొత్త ప్రపంచంలో కి అడుగుబెట్టినట్లయింది. ఎవరైనా మార్చగల విజ్ఞాన సర్వస్వం అనే చిన్నఅలోచన పెద్ద వటవృక్షమై, సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే శక్తిగా అవతరించిందని తెలిసింది. వచ్చే సంవత్సరం, హైఫా, ఇజ్రాయిల్లో జరగబోయే వికీమేనియాకి మన తెలుగు వికీపీడియన్లు ఎక్కువ మంది పాల్గొని మన తెలుగు వికీ పెరుగుదలకి కృషి చేస్తారని ఆశిస్తాను .
వనరులు
బయటి లంకె
- 18-07-2010 నాటి బెంగళూరు మిర్రర్ లో వికీమేనియా 2010 పై శ్రీనివాస్ ఆంగ్ల వ్యాసం
- పోలండ్‌లో జరిగిన వికీ పీడియా సమావేశం గురించిన వార్త ఆసక్తి కరంగా ఉంది. శ్రీనివాస్్‌గారికి అభినందనలు.
మంథా భానుమతి.
- నివేదిక సమగ్రంగా ఉంది. పంచుకున్నందుకు నెనర్లు. — వీవెన్ 07:23, 26 జూలై 2010 (UTC)
- నివేదిక చాలా బాగుంది. చక్కగా వివరణ ఇచ్చిన అర్జున రావు గారికి నెనర్లు --t.sujatha 04:09, 27 జూలై 2010 (UTC)
- వికీమేనియా 2011 ఫేస్ బుక్ పేజీ --అర్జున 04:15, 28 జూలై 2010 (UTC)
- పనుల ఒత్తిడి కారణంగా ఈ నివేదికను ఈ రోజే చదివాను. అర్జునరావుగారి కృషికి అభినందనలు. --కాసుబాబు 08:44, 15 ఆగష్టు 2010 (UTC)