వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 30వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి రాజేంద్ర చోళుడు

రాజేంద్ర చోళుడు లేదా మొదటి రాజేంద్ర చోళుడు (1014−1044) ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన 11వ శతాబ్దానికి చెందిన చోళ చక్రవర్తి. ఈయనకు గంగైకొండ, కడారంకొండ, పండిత చోళ అనే బిరుదులు కూడా ఉన్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప పాలకులలో ఒకడిగా ఆయనను చరిత్రకారులు పరిగణిస్తారు. ఆయన తన తండ్రి రాజరాజ చోళుడి తర్వాత సా. శ 1014 లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గంగానది తీరం వరకు, హిందూ మహాసముద్రం దాటి పశ్చిమానికి, ఆగ్నేయ ఆసియా వైపుకి విస్తరించింది. అందుకనే ఇది ప్రాచీన భారతీయ రాజ్యాలలో బలమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈయన జైత్రయాత్రలో భాగంగా శ్రీలంక, మాల్దీవులు జయించాడు. అంతేకాక మలేషియాలోని శ్రీవిజయ, ఆగ్నేయ ఆసియాలోని దక్షిణ థాయి ల్యాండు, ఇండోనేషియా మీద కూడా దాడులు చేశాడు. థాయి ల్యాండు, కాంబోడియా రాజ్యానికి చెందిన ఖ్మేరు ప్రాంతాల నుంచి కప్పం వసూలు చేశాడు. ప్రస్తుతం బెంగాలు, బీహారు రాష్ట్రాలలో విస్తరించిన గౌడ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పాలవంశ రాజు మహిపాలుడిని ఓడించాడు. తన విజయాలకు గుర్తుగా గంగైకొండ చోళుడు (గంగానది ప్రాంతాన్ని జయించిన వాడు) అనే బిరుదు పొందాడు. గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని కూడా నిర్మించాడు. ఈయన తన కుమార్తె అమ్మాంగ దేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. అమ్మాంగ దేవి కుమారుడే కులుత్తోంగ చోళుడు(చాలుక్యుడు).
(ఇంకా…)