Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 26వ వారం

వికీపీడియా నుండి
చంద్రయాన్-3

చంద్రయాన్-3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్ర యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది. ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. చంద్రయాన్ 2023 ప్రయోగం 3 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ 2023 ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో 2023 ఆగష్టు 26న దేశ ప్రధాని నరేంద్రమోడి బెంగళూరుకు చేరుకుని పీణ్యలోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయడంతో పాటు ఇకపై ప్రతియేటా ఈ రోజు (ఆగష్టు 23)ని జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు.
(ఇంకా…)