Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 50వ వారం

వికీపీడియా నుండి
రజినీకాంత్

రజినీకాంత్ సినిమా నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ సినీ రంగంలో పనిచేస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. సినిమాల్లో ఆయన పలికే సంభాషణలు, ప్రత్యేకమైన స్టైలు దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి సుమారు 160 కి పైగా సినిమాల్లో నటించాడు.

1975 లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా ఘన విజయం సాధించి రజినీకాంత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007 లో వచ్చిన శివాజీ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010 లో వచ్చిన రోబో, 2018 లో వచ్చిన 2.0 సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

సినిమా రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారంతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నాడు.
(ఇంకా…)