Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 39వ వారం

వికీపీడియా నుండి
పాపం పసివాడు

పాపం పసివాడు వి. రామచంద్రరావు దర్శకత్వంలో 1972 సెప్టెంబరు 29న విడుదలైన చిత్రం. ఇందులో ఎస్. వి. రంగారావు, దేవిక, మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అట్లూరి శేషగిరిరావు శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, చిత్రానువాదం, మాటలు గొల్లపూడి మారుతీరావు అందించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం దర్శకత్వం వహించాడు. అమ్మా చూడాలీ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఎం. కన్నప్ప ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. బాలు ఎడిటర్ గా పనిచేశాడు.

1969లో దక్షిణాఫ్రికా చలన చిత్రమైన లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం. విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.

ఈ చిత్ర నిర్మాత ముందు సినిమా మోసగాళ్ళకు మోసగాడు ఎడారి నేపథ్యంలో తీశాడు. మరో సినిమా అదే వాతావరణంలో తీయాలనుకుని గొల్లపూడి మారుతీరావు చేత లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ అనుసరించి కథను తయారు చేయించుకున్నాడు. 1972 మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం సుమారు 27 రోజులపాటు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా ప్రచారం కోసం వినూత్నంగా హెలికాప్టరు ద్వారా కరపత్రాలు పంచి పెట్టారు. ఈ చిత్రం వ్యాపారాత్మకంగా విజయం సాధించింది.
(ఇంకా…)