వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 19వ వారం
స్వరూపం
చిలికా సరస్సు |
---|
చిలికా సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు. ఇది దయా నది ముఖద్వారం వద్ద, ఒడిశా రాష్ట్రం లోని పూరి, ఖుర్దా, గంజాం జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 1,100 చ.కి.మీ. పైచిలుకు ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంత సరస్సు. ది న్యూ కాలెడోనియన్ బారియర్ రీఫ్ తరువాత, ప్రపంచం లోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో ఇది రెండవది . దీన్ని తాత్కాలికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. వలస పక్షులకు భారత ఉపఖండంలో చిలికా అతిపెద్ద శీతాకాల స్థావరం. అంతరించి పోతున్న అనేక జాతుల మొక్కలు, జంతువులకు ఈ సరస్సు నిలయం. ఈ సరస్సు, పెద్ద ఎత్తున మత్స్య వనరులతో కూడుకుని ఉన్న పర్యావరణ వ్యవస్థ. దీని తీరం లోను, ద్వీపాల్లోనూ ఉన్న 132 గ్రామాల లోని 1,50,000 పైచిలుకు మత్స్యకారులకు ఇది జీవిక నిస్తోంది. వలస కాలంలో గరిష్ఠంగా 160 కి పైగా జాతుల పక్షులు ఈ సరస్సులోకి చేరతాయి. కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, అరల్ సీ ల నుండి,రష్యాలోని ఇతర మారుమూల ప్రాంతాల నుండీ, కజాకస్తాన్ కిర్గిజ్ స్టెప్పీలు, మధ్య, ఆగ్నేయాసియాల నుండి, లడఖ్, హిమాలయాల నుండీ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. (ఇంకా…) |