వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 12వ వారం
స్వరూపం
పాంపే |
---|
పాంపే ఒక ప్రాచీన రోమన్ నగరం. ఇటలీ లోని, కంపానియా ప్రాంతంలో నేపుల్స్ నగరం దగ్గరలోని ఆధునిక పాంపీ వద్ద ఉంది. సా.శ 79 లో విసూవియస్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినపుడు దాని బూడిద కింద 4 నుండి 6 మీటర్ల లోతున సమాధి అయిపోయిన నగరం ఇది. దీనితో పాటు చుట్టుపక్కల ఉన్న హెర్క్యులేనియమ్ వంటి గ్రామాలు కూడా ఆ బూడిదలో సమాధై పోయాయి. బూడిదతో కప్పి ఉండటం చేత నగరం చాలావరకు నాశనం కాకుండా సురక్షితంగా ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడిన విశేషాలు, ఆనాటి రోమన్ ప్రజల జీవితాన్ని అసాధారణమైన వివరాలతో చూపిస్తున్నాయి. ఇది ఒక సంపన్న నగరం. ఇక్కడ చాలా చక్కని ప్రభుత్వ భవనాలు, విలాసవంతమైన ప్రైవేట్ ఇళ్ళు, విలాసవంతమైన అలంకరణలు, కళాకృతులూ ఉన్నాయి. తవ్వకాల తొలినాళ్లలో ఇవి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. చెక్క వస్తువులు, మానవ శరీరాల వంటి సేంద్రియ అవశేషాలు విస్ఫోటనం వెదజల్లిన బూడిదలో సమాధి అయిపోయాయి. తదనంతర కాలంలో అవి కృశించి నశించి పోయి అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను అచ్చులుగా వాడి అప్పటి ప్రజల ఆఖరి భీతావహ క్షణాలను పోత పోయవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు గ్రహించారు. (ఇంకా…) |