వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 08వ వారం
మాయలోకం గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం. గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, సి.ఎస్.ఆర్, శాంతకుమారి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, గిడుగు సీతాపతి, లంక సత్యం, టి.జి.కమలాదేవి మొదలైన భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి సంభాషణలు త్రిపురనేని గోపీచంద్ రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని సమకూర్చారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన రెండవ చిత్రం. చిత్రంలోని ఏడుగురు చిన్న రాజకుమారులలో మొదటి వానిగా బాలనటుడు బి.పద్మనాభం నటించారు. వరుస పరాజయాలతో ఆర్థికంగా దెబ్బతిన్న సారధి పిక్చర్స్‌ను గట్టెక్కించడానికి తనకు స్వతాహాగా సరిపడకున్నా ప్రేక్షకులు మెచ్చే జానపద ఫక్కీలో ఈ సినిమాని తీశాడు గూడవల్లి రామబ్రహ్మం. భారీ పెట్టుబడితో మంచి నిర్మాణ విలువలతో నిర్మించినా మాయలు, మంత్రాలు, దేవతలు, రాక్షసులతో కూడిన సినిమా తీసినందుకు రామబ్రహ్మం అపరాధ భావనతో సిగ్గుపడ్డాడు. అయితే సినిమా మాత్రం ఆశించిన విధంగా ప్రజాదరణ సాధించి, ఆర్థికంగా ఘనవిజయం చెందింది. అనంతర కాలంలో ఈ చిత్రం శోభన్ బాబు కథానాయకుడుగా కాంభోజ రాజు కథ పేరుతో పునర్నిర్మించారు.
(ఇంకా…)