Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 48వ వారం

వికీపీడియా నుండి

శోభారాజు

శోభారాజు ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది. స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది. 2010 లో కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1983 లో అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలో స్థలం మంజూరు చేసింది. దీన్ని అన్నమయ్యపురం అనే ప్రాంగణంగా అభివృద్ధి చేసి సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శోభారాజు 1957, నవంబర్ 30 న చిత్తూరు జిల్లా వాయల్పాడులో జన్మించింది. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తండ్రి ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకుంది. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు. ఆమె తాత కూడా వయొలిన్ వాయించేవాడు. ఆమె మావయ్యలకు కూడా సంగీత పరిజ్ఞానం ఉండేది. వాళ్ళు హరికథకులు కూడా. నాలుగేళ్ళ వయసునుంచే స్వంతంగా కూడా పాటలు సాధన చేయడం ప్రారంభించింది.

(ఇంకా…)