వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 13వ వారం
యాగంటి కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రము. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.
(ఇంకా…)