Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 25వ వారం

వికీపీడియా నుండి

గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 - అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది. 1902 వ సం.లో కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య - బాపమ్మ లకు కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు. రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు.

(ఇంకా…)