Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 38వ వారం

వికీపీడియా నుండి

నీలిమందు

నీలిమందు ఒక రంజనం లేదా అద్దకపు రంగు. నీలిమందుని మొదట్లో ఒక జాతి మొక్కలనుండి తయారు చేసేవారు. సంధాన రసాయనం బాగా పుంజుకున్న తరువాత దీనిని కృత్రిమంగా తయారు చెయ్యటం మొదలు పెట్టేరు. నీలిమందుకి భారతదేశానికీ చాలా గట్టి లంకె ఉంది. సింధు నాగరికత రోజులనుండి వృక్షసంపద నుండి రంగులు తీసి వాడటం భారతీయులకి తెలుసు. హరప్పా దగ్గర దొరకిన ఒక వెండి పాత్ర చుట్టూ చుట్టబెట్టిన అద్దకపు బట్టే దీనికి నిదర్శనం. అజంతా గుహలలో ఉన్న చిత్రాలలో మొక్కలనుండి తీసిన రంగులు కనిపిస్తున్నాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రం లో రంగుల ప్రస్తావన ఉంది. రంజనాలు మొక్కల నుండి తయారు చెయ్యటమే కాకుండా వాటిని బట్టలకి అద్దటంలో ఉన్న సాంకేతిక సూక్ష్మాలని కూడ కనిపెట్టేరు భారతీయులు. ఎనిమిదవ శతాబ్దం నాటికే మధ్య ఆసియాలోనూ, ఈజిప్ట్ లోనూ భారతదేశంలో చేసిన అద్దకం బట్టలు మంచి ప్రాచుర్యంలో ఉండేవి. పదమూడవ శతాబ్దంలో ఇండియా వచ్చిన మార్కోపోలో ఇండియాలో నీలిమందు వాడకం గురించి ప్రస్తావించేడు. అప్పటికి గ్రీకు దేశంలోనూ, రోములోనూ ఈ నీలిరంగు రంజనం వాడకంలో లేకపోలేదు. కాని ఈ రంగుకి 'ఇండిగో' అన్న పేరు రావటానికి మార్కోపోలో ఇండియాలో ఈ రంగుని చూడటమే అని అభిజ్ఞవర్గాల నమ్మకం. గ్రీకు భాషలో "ఇండికాన్" అన్నా లేటిన్ భాషలో "ఇండికమ్" అన్నా "ఇండియా నుండి వచ్చినది" అనే అర్థం.

(ఇంకా…)