Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 16వ వారం

వికీపీడియా నుండి

పూరీ జగన్నాథ దేవాలయం, ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం గంగ వంశానికి చిందిన కళింగ ప్రభువైన అనంత వర్మ చోడగంగ ( క్రీ.శ 1078—1148) ప్రారంభించాడు. ప్రస్తుతం ఉన్న చాలా నిర్మాణాలు మాత్రం అనంగ భీమదేవుడిచే క్రీ.శ. 1174 లో నిర్మించబడ్డాయి, ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ప్రాణప్రతిష్ట క్రీ.శ 1198 లో జరిగింది.

ఈ ఆలయం 4,00000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైనా ప్రాకారం కలిగి ఉంది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యం, సాంప్రదాయిక ఒరిస్సా ఆలయ శిల్పకళతో ఈ ఆలయం భారతదేశంలో అతి పురాతమైన కట్టడాల్లో ఒకటి. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది.

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

పురాణాల ప్రకారం స్వయంగా మాహాలక్ష్మి వచ్చి ఇక్కడి వంటలను పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ వంటలన్నీ హిందూ ధర్మ శాస్త్రాలకనుగుణంగానే జరుగుతాయి. వంట చేయడానికి కేవలం మట్టి పాత్రలను మాత్రమే వాడతారు. అలాగే వంటకు అవసరమయ్యే నీటిని దగ్గర్లో గల గంగ, జమున అనే రెండు ప్రత్యేకమైన బావుల్లోంచి మాత్రమే సేకరిస్తారు. జగన్నాథునికి నైవేద్యం సమర్పించాక మిగతా ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి