Jump to content

వాడుకరి:Arjunaraoc/2022 tewiki priorities - Arjunaraoc views

వికీపీడియా నుండి

విషయం ఖరారైన తేది: 2022-05-04
రచయిత: Arjunaraoc


200912, 201304, 2021లో అధిక వీక్షణల వ్యాస ప్రధాన వర్గాలు
200912, 201304, 2021లో అధిక వీక్షణల వ్యాస ప్రధాన వర్గాలు

2003 లో తెవికీ ప్రారంభమైనా, 2005 లో చురుకైన కృషి మొదలైందని నిర్వహణ గణాంకాల వలన తెలుస్తుంది. అంటే ఇప్పటికీ 17 సంవత్సరాలు చురుకైన కృషి నడిచింది. ఈ కాలంలో ఐదు సంవత్సరాలు తక్కువ క్రియాశీలంగా వున్నది తప్పిస్తే, మిగతా కాలంలో నిర్వహణలో మెరుగైన ఉపకరణాలు ప్రవేశపెట్టడం, ప్రచారం చేయడం, గణాంకాలు సేకరించడం, విశ్లేషించడం, తెవికీ పురోగతి దిశని ప్రభావించేదిశగా అభిప్రాయాలు వ్యక్తం చేశాను. ఈ సంవత్సరం కాస్త విస్తారంగా గణాంకాలు విశ్లేషించడంతో పాటు 2021 సమీక్ష, 2022 ప్రాధాన్యతలు పేజీలు తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాను. ఈ నేపథ్యంలో తెవికీ అభివృద్ధి కొరకు ప్రాధాన్యతలను ఈ వ్యాసం ద్వారా పంచుకొంటున్నాను.

తెవికీ అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాల ధోరణులు

[మార్చు]
  • తెలుగు రాష్ట్రాలలో పాఠశాలవిద్యలో బోధనాభాషగా బలహీనమవుతున్నది.
  • పదేళ్ల క్రిందటి నా అనుభవాలలో తెలుగు భాషా నైపుణ్యతలు విద్యార్ధులలో కూడా గణనీయంగా తగ్గాయి. ఇటీవలి కాలంలో తెలుగుకు సంబంధించి ప్రోత్సాహం తగ్గుతుండడంతో మరింతగా తగ్గివుంటాయనిపిస్తుంది.
  • తెలుగు వికీ పేజీ వీక్షణలు మార్చి 2020 లో 11.5 మిలియన్లు అధికానికి చేరి (కొంత దోషమున్నదనిపించిన ఇతర నెలల గణాంకాలు పరిగణించలేదు), 2021 డిసెంబరుకు 8.3 మిలియన్లగా వున్నాయి.[1] ఈ స్థితిలో కొంచెం ఎక్కువ తక్కువలుగా కొన్నాళ్లుండి ఆ తదుపరి తగ్గటం ప్రారంభిస్తాయి
  • తెలుగు వికీ వీక్షణలు పొందుతున్న పరికరాలు ఆగష్టు 2019 లో 1.5 మిలియన్లు దాటి, తరువాత తగ్గి, మరల 2021 డిసెంబరుకు 1.5మి కు చేరుకున్నాయి. 2020 లో భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వాడుకదారుల శాతం 53 శాతం కాగా, 2040 లో 96 శాతం చేరవచ్చునని స్టాటిస్టా సంస్థ అంచనా వేసింది. [2] 90శాతం పైగా వీక్షణలు మొబైల్ నుండి (డిసెంబరు 2021 లో మొబైల్ 1.3మి, డెస్క్టప్ 0.142మి) కావున, గత రెండేళ్లలో మొబైల్ ఫోన్ వాడుకరులు 7 శాతం పెరిగితే వీక్షణ పరికరాలు 9 శాతం పెరిగాయి (1.3 మి నుండి 1.4మి) అయితే ఈ పెరుగుదల ముందుకాలంలో ఇంకా తక్కువగా వుంటుందని నా అభిప్రాయం.
  • క్రియాశీలక సభ్యులు అధికంగా 2014 జూన్ లో 114 నమోదవగా 2021 డిసెంబరు లో 69 స్థాయిలో వుంది. కంప్యూటర్, మొబైల్ ఫోన్లు ఎక్కువమందికి అందుబాటులోకి రావటం, తెలుగు చూడడం, వాడడంలో సమస్యలు 2015 ప్రాంతానికే తగ్గిపోవడంవలన, ఎన్నో విధాల ప్రచారం చేసినా క్రియాశీలక సభ్యుల సంఖ్యలో పురోగతి లేదు. తెవికీ సముదాయం ప్రాధాన్యతలలో ఏకాభిప్రాయం కుదరడం కష్టమవుతున్నందున, తెవికీలో పనిచేయడం సంతోషాన్ని కలిగించే పని కావడం తగ్గిపోతుంది. ఈ సంఖ్య ఇలానే ఇంకొక ఐదు సంవత్సరాలుండి తగ్గడం మొదలవుతుంది.
  • సెప్టెంబరు 2015 లో 5-24 సవరణలు జరిగిన పేజీలు 3408 కాగా, డిసెంబరు 2021 లో 662 స్థాయిలో వున్నాయి. కొత్త పేజీలు సృష్టించటానికి ఇస్తున్న ప్రాధాన్యం ఇప్పటికే వున్న పేజీల నాణ్యతను పెంచడానికి ఇవ్వనందున, ఎక్కువమంది వీక్షించే పేజీల తాజాపడక, వికీ నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయినా వికీ, ప్రపంచంలో ఒకే ఒక్క ప్రత్యేకమైన ప్రాజెక్టు కనుక, ప్రాధాన్యత కొన్నాళ్లు కొనసాగుతుంది. కృత్రిమ మేధ అభివృద్ధి చెంది ఇంకో ఇరవై ఏళ్లలో అలెక్సా లాంటి పరికరాలు, కోరినప్పుడు నిర్మించి అందించే వ్యాసాల లాంటివి లేక ఆబ్స్ట్రాక్ట్ వికీపీడియా (ఆంగ్లవికీపీడియా వ్యాసం) వలన డేటాబేస్ నుండి ఏ భాషలో నైనా వ్యాసం సృష్టించే సాంకేతికాలు సాధారణమవుతాయి.
  • భారతదేశంలో ఆంగ్ల భాషా ప్రభావం ఇంకాపెరిగి, తెలుగు ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు కృషి చేసే సభ్యులు ఆంగ్లవికీలో ఎక్కువ కావచ్చు. ఇప్పటికే తెలుగువికీలో పనిచేసేవారు కూడా, ఆంగ్లవికీలో తమ కృషి పెంచుకొనే అవకాశం వుంది.
  • అధిక వీక్షణల పేజీల ప్రధాన వర్గాల ధోరణి ప్రకారం, భాష & సంస్కృతి వర్గ పేజీల వీక్షణల శాతం 20.92%(200912) నుండి 50.81% (2021) కు పెరగగా మిగతా వర్గాల వీక్షణలు తగ్గాయి. దీనిని బట్టి తెలుగు వికీని సందర్శించేవారు మిగతా అంశాలకు ప్రధానంగా ఆంగ్లవికీని లేక ఇతర వనరులను వాడుతున్నట్లు అనుకోవచ్చు.
  • 2021 లో చేరి, 5 సవరణలు చేసిన 130 సభ్యులలో 56% సవరణలకు మొబైల్ వాడుతున్నారు. అలాగే 56% విజువల్ ఎడిటర్ వాడారు. కేవలం వికీటెక్స్ట్ వాడేవారు 6% మాత్రమే.
  • 2021లో అధిక సమష్టి కృషి జరిగిన నాలుగు వ్యాసాలలో 33 మంది పాల్గొన్నారు. వీరిలో నలుగురు దుశ్చర్యలను ఎదుర్కొనే ఇతర భాషవారు అయివుంటారు.
  • వికీపీడియా తొలి రోజులలో సవరణల సంఖ్యే వికీపీడియా కృషికి కొలబద్ద అనే అకర్షణ ఎక్కువగా వుండి, తరువాత అనుభవాల వలన 2013 నాటికి తగ్గినా, తరువాత కొద్దికాలానికే మరల ఎక్కువైంది.
  • వికీపీడియా లో ఎవరైనా ఏ విషయంపైనా రాయవచ్చు అనేదానికే ప్రాధాన్యత పెరిగి, తెలుగు వారికి మరింతగా ఉపయోగపడే విజ్ఞానసర్వస్వాన్ని, సహకారంతో అభివృద్ధి చేయడమే వికీపీడియా మూల ఉద్దేశ్యమనే దానికి ప్రాధాన్యత తక్కువైంది.
  • సాంకేతిక అంశాలపై కృషి చేయగలిగేవారు ఒకరు ఇద్దరు మాత్రమే వున్నారు. కొంతమంది కృషిలో భాగంగా దోషాలు దొర్లినవని తెలిసినతరువాత కూడా వాటిని సవరించడానికి కృషి చేయలేదు లేక సహకరించలేదు.

తెవికీ అభివృద్ధికి మార్గాలు

[మార్చు]
  • సభ్యుల ప్రాధాన్యత, వీక్షణలు ఎక్కువగా గల పేజీలు మెరుగు పరచడానికి, ఎక్కువ ఆసక్తి వుండే అంశాల కొత్త పేజీలు సృష్టించడానికివ్వాలి.
  • మొదటి పేజీ నిర్వహణలో 2021లో కనీసం 5 సవరణలు చేసినవారు ఎనిమిదిమంది వున్నా బాగా చురుకుగా వున్నవారు ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే. ఇంకా ఎక్కువమంది మరింత చురుకుగా పాల్గొనాలి.
  • వికీపీడియా అభివృద్ధికి సంబంధించిన చర్చలలో అభిప్రాయాలు చురుకుగా పంచుకోవాలి.
  • ప్రామాణిక ప్రాజెక్టు నిర్వహణలకు సముదాయ బలంగా లేనందున, ప్రత్యామ్నాయ నిర్వహణ పనులలో పాల్గొనాలి.
  • కొత్త నిర్వాహకుల ఎంపికకు, పై అంశాలలో గణనీయంగా కృషి చేయటం అర్హతగా నిర్ణయించాలి.
  • మూసల పేర్లు ఆంగ్లంలోనే వాడుకోవాలి. తెలుగు పేర్లకు మార్చితే వాటిని ఆంగ్ల మూసలతో అనుసంధానించి తాజాగా వుంచడం మరికొంత కష్టం. అనువాదాలు చేయడానికి, మూసలను తాజా పరచినపుడు అనువాదం తాజా పరచడానికి, తెవికీ సముదాయం బలంగా లేదు. మూసలను అనువాదం చేయకపోయినా వాడుకోవాలి. తెలుగు సముదాయం చాలావరకు రెండు భాషలు చదవగలదు. సమాచారపెట్టెలో వున్న వివరం, వ్యాసంలో తెలుగులో వ్రాసుకుంటే సరిపోతుంది.
  • వికీపీడియా సమర్ధవంతంగా సుస్థిరమైన నాణ్యతతో కొనసాగాలంటే, వికీపీడియా సాంకేతికాలతోపాటు, వికీడేటా, OSM సాంకేతికాలు తెలిసినవారి సంఖ్య, కృషి, సహకారం పెరగాలి.


ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Total pageviews -monthly". wikimedia. 2022-03-10. Retrieved 2022-03-10.
  2. Keelery, Sandhya (2021-08-24). "Mobile internet user penetration India 2010-2040". statista. Retrieved 2022-03-10.