వాడుకరి:నాగులవంచ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంక్షిప్త లిపి లేఖనం - సర్ ఐజాక్ పిట్మన్

అధునికతను ఆహ్వానిస్తూనే ప్రాచీనతను పరిరక్షించుకోవడం విజ్ఞుల లక్షణం. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధిచెందినా కొన్ని విషయాలలో ప్రాచీన పద్ధతులను అనుసరించక తప్పదు. తనకున్న అతి తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ పనులు చక్కబెట్టుకోవాలనేదే ఆధునిక మానవుని ఆరాటం. రోజు రోజుకు తగాదాలు ఎక్కువైన కారణంగా వాటి పరిష్కారానికై అధిక సంఖ్యలో న్యాయస్థానాలను ఏర్పాటుచేసి, త్వరితగతిన కేసులను పరిష్కరించవలసిన అగత్యం ఏర్పడింది. అందుకోసమై ప్రతి న్యాయస్థానంలోను, న్యాయవాదుల వద్ద సంక్షిప్త లిపి లేఖకుని అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర శాసన సభ, శాసన పరిషత్తులలో ఇంగ్లీష్, తెలుగు రిపోర్టర్ల పాత్ర గణనీయమైనది. పత్రికా విలేకరులకు అత్యంత ప్రాముఖ్యమైనదీ విద్య. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు అత్యంత వేగంగా జరుపుటకు సంక్షిప్త లిపి లేఖకుల పాత్ర గణనీయమైనది.

మనం మాట్లాడే భాషను ఒక ప్రత్యేక సంక్షిప్త రూప గుర్తులతో అత్యంత వేగంగా రాసే పద్ధతిని సంక్షిప్త లిపి (షార్ట్ హ్యాండ్) అంటారు. స్టెనోగ్రఫీ అనే పదం గ్రీకు భాష నుండి వచ్చినది. ఐతే రెండువేల సంవత్సరాలకు పైగా వందలాది సంక్షిప్త లిపి పద్ధతులలో ప్రయోగాలు జరుపబడుచున్నవి. పూర్వకాలంలో సంక్షిప్త లిపిని అనేక విధాలుగా ఉపయోగించేవారు. రోమన్ సెనేటర్లు చేసే ప్రసంగాలు, మతకర్తలు చెప్పే దైవ భాషణలు ఈ పద్ధతిలో లిఖించేవారు. జార్జ్ బెర్నార్డ్ షా తన పూర్తి రచనా వ్యాసంగాన్ని సంక్షిప్త లిపి రూపంలో రాసేవాడు. పురాతన కాలంలో రామాయణ, మహాభారతాలు, కాళిదాసు మరియు తమిళ రచయితల రచనల ఆధారంగా పురాతన కాలం నుండి సంక్షిప్త లిపి వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రపంచంలోనే అత్యధిక శాతం గుర్తింపు పొందిన ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ (సంక్షిప్త లిపి)ని సర్ ఐజాక్ పిట్మన్ 1837 లో మొట్టమొదటి సారిగా ఫొనెటిక్ పద్ధతిలో ప్రచురించారు. 1829 లో శామ్యూల్ టేలర్స్ సంక్షిప్త లిపి పద్ధతిని పిట్మన్ అనుసరించాడు. తన స్వంత ప్రచురణాలయంలో అనేక రకాల సంక్షిప్త లిపి పత్రికలను, పుస్తకాలను ప్రచురించి పంచిపెట్టారు. వీరి సంక్షిప్త లిపి పద్ధతి 12 భాషల్లోకి అనుకరించబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిచే ఉపయోగించబడింది. పిట్ మాన్ సంక్షిప్త లిపి పద్ధతి అమెరికా సం యుక్త రాష్ట్రాలకు స్టెఫెన్ పి. ఆండ్రూస్ మరియు పిట్మన్ సోదరుడైన బెన్ పిట్మన్ చే 1852 లో పరిచయం చేయబడింది. సిన్సినాటిలో ఫోనోగ్రాఫిక్ శిక్షణాలయాన్ని స్థాపించి, సంక్షిప్త లిపిలో శిక్షణనిచ్చి ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. ఇంగ్లీష్ భాషలోని స్పెల్లింగ్ సంస్కరణల కోసం ఎన్నో కర పత్రాలను, పత్రికలను ప్రచురించి, పంచిపెట్టిన త్యాగశీలి. "కాలాన్ని పొదుపు చేయడం ద్వారా జీవితాన్ని పండించు కోవాలి" అనేది వీరి జీవిత సందేశం.

సర్ ఐజాక్ పిట్మన్ 1813 జనవరి 4వ తేదీన ఇంగ్లాండ్ లోని ట్రోబ్రిడ్జి, విల్ షైర్ లో జన్మించారు. స్థానిక గ్రామర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం బట్టల కర్మాగారంలో పనిచేస్తూ జీవితం ప్రారంభించారు. 1831లో లండన్ లోని 'నార్మల్ కాలేజ్ ఆఫ్ ది బ్రిటిష్ ఫారిన్ స్కూల్' కు చదువుకోసం పంపబడ్డాడు. 1832-39 మధ్య కాలంలో అనేక డిగ్రీలు పొందినప్పటికీ, స్వెడెన్ బర్గియన్ కావడంతో అధికారులు ఆ విద్యా సంస్థ నుండి పిట్మన్ ను తొలగించారు. 1839 నుండి 1843 వరకు బాత్ లో తన వ్యక్తిగత విద్యా సంస్థను నడిపారు.

పిట్మన్ గొప్ప వేదాంతి, మానవతా విలువలుగల మహనీయుడు. ఇమాన్యుయెల్ స్వెడెన్ బర్గ్ రచనలను ప్రతి రోజూ చదివి, ప్రపంచ ప్రజలకు బోధించేవాడు. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురించి, ప్రజలకు పంచిపెట్టేవారు. 1841లో ఏర్పడిన 'స్థానిక న్యూ చర్చ్ సమాజం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా ఉంటూ చాలా చురుకుగా పనిచేశారు. 1887 నుండి 1897లో మరణించేంత వరకు ఈ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ చర్చ్ కు వీరు చేసిన సేవలకు గుర్తింపుగా వీరి పేరున స్మారక ఫలకాన్ని బాత్ అబ్బేలోని ఉత్తరగోడపై ఏర్పాటు చేశారు. దానిపై " వీరి ఆశయాలు స్థిరమైనవి, స్వయం మేధాశక్తి గలవాడు, ప్రపంచం గుర్తించే అద్భుతమైన కర్మ వీరుడు, దేవుని సేవకు, మానవ విధులకు అంకితమైన త్యాగశీలి" అని పొందుపరిచారు. వీరి గౌరవార్థం మొదటి శతాబ్ధం సందర్భంగా 1913 లో తపాలా బిళ్ళను కూడా విడుదల చేశారు.

జన్మత: క్రైస్తవుడైన పిట్మన్ 1837 లో మద్యపానాన్ని మానివేశారు. 1838లో మాంసాహారం మానివేసి పూర్తిగా శాకాహారిగా మారిపోయారు. తన శ్రేష్ఠమైన ఆరోగ్యానికి, ఎక్కువ గంటలు పనిచేయగల సామర్థ్యానికి శాకాహారమే ప్రబల కారణమని లండన్ లోని "ది టైంస్" పత్రికకు స్వయంగా ఉత్తరం శారు. వీరు వెజెటేరియన్ సొసైటీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. సర్ ఐజాక్ పిట్ మాన్ తన 84వ యేట 22-01-1897లో ఇంగ్లాండ్ లోని సోమర్ సెట్ లో పరమపదించారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, వారి జీవితాలలో వెలుగులు నింపిన చిరస్మరణీయుని ప్రతి యేట వారి జన్మ దినమైన జనవరి 4వ తేదీన స్మరించుకోవడం ప్రతి సంక్షిప్త లేఖకుని కర్తవ్యం, కనీస బాధ్యత.

సంక్షిప్త లిపి లేఖనంలో అనేక పద్ధతులున్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని.

పిట్మన్ సంక్షిప్త లిపి: సర్. ఐజాక్ పిట్మన్ తన సంక్షిప్తలిపిని 1837లో ప్రచురించారు. తదుపరి కాలంలో భారతదేశ ప్రాచీన భాషయైన సంస్కృతాన్ని ఆధారం చేసుకొని శబ్ధ ఉచ్చారణకు అనుగుణంగా తయారుచేశారు. ఈ పద్ధతి పిట్మన్ సంక్షిప్తలిపిగా పిలువబడుచున్నది. అంతకు ముందు ఒక్క ఇంగ్లాండ్ లోనే 460 ఇంగ్లీష్ సంక్షిప్తలిపి పద్ధతులపై ప్రయోగాలు జరుపబడినవి! అచ్చులను హల్లులనుండి విడగొట్టి రాయడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత. ఇది భారతదేశ భాషా పద్ధతులపై ఆధారపడి ఉన్నందున ఎక్కువ శాతం భారత దేశ మరియు ప్రపంచ భాషలు పిట్మన్ షార్ట్ హ్యాండ్ పద్ధతిని అనుసరించాయి.

స్లోన్ డుప్లోయన్ సంక్షిప్త లిపి:

పారిస్ దేశస్థుడైన శ్రీ జె.ఎం. స్లోన్ 1884 లో ఈ పద్ధతిని వెలుగులోకి తెచ్చారు. ఆపై ఈ పద్ధతి వారి పేరున పిలువబడుచున్నది. ఈ పద్ధతిలో అచ్చులు హల్లులతో జతచేయబడినవి. పిట్మన్ షార్ట్ హ్యాండ్ పద్ధతిని ఎక్కువ శాతం ప్రజలు ఆదరిస్తున్నందున ఈ పద్ధతి ఎక్కువ ప్రజాదరణ పొందలేకపోయింది.

గ్రెగ్ సంక్షిప్త లిపి:

డా. జాన్ రాబర్ట్ గ్రెగ్ 1888 లో ఇంగ్లీష్ అక్షరాల ఆధారంగా తనదైన శైలిలో సంక్షిప్తలిపిని ప్రచురించారు. ఈ పద్ధతి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రసిద్ధి గాంచింది. దట్టము, తేలిక గీతలు లేకపోవడం, పొజీషన్ రైటింగ్ లేకపోవడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత. భారత దేశ భాషలకు వైరుధ్యంగా ఉన్నందున ఈ పద్ధతి మన దేశంలో ఆదరణకు నోచుకోలేదు.

సింపుల్ సంక్షిప్త లిపి:

అధునాతన సింపుల్ షార్ట్ హ్యాండ్ పద్ధతి 1987 లో ప్రచురించబడింది. డా. గోపాల్ దత్ బిష్ట్ గత 40 సంవత్సరాలుగా సంక్షిప్త లిపి లేఖన రంగంలో చేసిన సృజనాత్మక కృషి ఫలితంగా వీలైనంత తక్కువ సమయంలో అత్యధిక వేగంగా రాయగల సామర్థ్యాన్ని సాధించి ఈ రంగంలో విప్లవాత్మకమైన విజయాన్ని సాధించారు. పిట్మన్ షార్ట్ హ్యాండ్ లోని లోపాలు ఈ పద్ధతిలో సవరించబడ్డాయి. "విశిష్ట్ ఆశులిపి" పేరున ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందినది. భారత దేశంలోని లోక్ సభ, రాజ్య సభలలో ఈ పద్ధతిలో అత్యధిక వేగంగా వ్రాసే సంక్షిప్త లిపి లేఖకులు అనేకులున్నారు.

సంక్షిప్త లిపి (షార్ట్ హ్యాండ్) లో నిమిషానికి 250 పదాలు రాసి మొట్టమొదటిసారిగా డాక్టరేట్ పట్టాను, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన ఘనత డాక్టర్ గోపాల్ దత్ బిష్ట్ కు దక్కింది. పార్లమెంటరి రిపోర్టింగ్ లో వీరు ప్రసిద్ధి గాంచారు. ఇంగ్లీష్, హిందీ సంక్షిప్త లిపిలో 30 పైగా పుస్తకాలను రచించిన వీరికి భారత దేశంలో వేలాదిమంది అనుయాయులున్నారు. వీరి వద్ద సంక్షిప్త లిపిని నేర్చుకున్న విద్యార్థులు పార్లమెంటరి రిపోర్టర్లుగా జాయింట్ సెక్రెటరీ, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు మరియు డెప్యూటీ డైరెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

డా. బిష్ట్ మొదట సంక్షిప్త లిపిలో అత్యధిక వేగంగా రాయడంలో రికార్డు సాధించి, తదుపరి వారి పరిశోధనా వ్యాసాలను విద్యార్థులకు ఉపకరించే విధంగా పుస్తక రూపంలో ముద్రింప జేశారు. లోక్ సభ సెక్రెటేరియట్ లో జాయింట్ డైరెక్టరుగా పనిచేస్తున్న అతని కుమారుడు మరియు శిష్యుడైన శ్రీ హరీశ్ చంద్ర బిష్ట్ 22 సం.ల అతి పిన్న వయసులో నిమిషానికి 260 పదాలు తప్పులు లేకుండా రాసి ఎదురులేని రికార్డు సాధించాడు. వీరి కుమార్తె కూడా సంక్షిప్త లిపి విద్యలో ప్రావీణ్యతను సాధించి, కొత్త ఢిల్లీలో పార్లమెంటరీ రిపోర్టరుగా పనిచేస్తున్నది.


డా. గోపాల్ దత్ బిష్ట్ డెహ్రాడూన్ లోని అంధుల జాతీయ సంస్థకు బ్రెయిలీ సంక్షిప్త లిపి కోడ్ ను హిందీలో రూపొందించుటకు ఎంతగానో సహకరించారు. అధిక శాతం మంది విద్యార్థులు సంక్షిప్తలిపిలో విజయం సాధించడానికి ఈ కోడ్ చాలా ఉపయోగపడింది. సంస్కృత సంక్షిప్త లిపి లేఖనాన్ని స్వయంగా ప్రదర్శించి భారత దేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖచే "శ్రీ గణేశ" అవార్డును గెలుచుకున్నారు. భారత దేశంలోని అనేక రాష్ట్రాలలోగల వృత్తి విద్యా కళాశాలలలో శిక్షణా తరగతులను నిర్వహించి, హిందీ, ఇంగ్లీష్ భాషలలో సంక్షిప్త లిపిని లిఖించడంలో తాను జరిపిన పరిశోధనలలో తేలిన సృజనాత్మక ఉపాయాలు, మెలకువలను వివరించారు. వీరి పరిశోధనా గ్రంథం "ఎ హిస్టారికల్, లింగ్విస్టిక్ అండ్ కంపారిటివ్ స్టడి ఆఫ్ స్టెనోగ్రఫి" పేరున, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో హిందీలో ప్రచురింపబడింది. భారత దేశంలోని అనేక భాషలలోని సంక్షిప్త లిపులలో గల లోటుపాట్లు వీరి పరిశోధనా గ్రంథం ద్వారా సవరించబడినవి. సృజనాత్మకతకు, స్వయం అభ్యాస ఉపాయములు దండిగాగల వీరి పరిశోధనా గ్రంథం అట్టడుగు వర్గాలలోని విద్యార్థులకు ఉపాధిని కల్పించడంలో ఎంతగానో ఉపకరించింది. సంక్షిప్త లిపిలో వీరు సాధించిన విజయం ప్రస్తుత సమాజంలోని సాధారణ విద్యార్థులకు కష్టించి పనిచేసే తత్త్వాన్ని బోధించి, జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కోవడానికి మిక్కిలి మార్గదర్శకంగా నిలిచింది. ఈ రంగంలో వీరు చేసిన కృషి నిరుపమానం, నిత్య స్మరణీయం.

సంక్షిప్త లిపి నేడు రిపోర్టర్లచే, ఇంటర్వ్యూలు నిర్వహించే వారిచే, కళాశాల విద్యార్థులచే, రచయితలచే, సంపాదకులచే మరియు న్యాయవాదులచే ఉపయోగించబడుచున్నది. శాసన సభలలో జరిగే చర్చలను, న్యాయస్థానాలలో విచారించే కేసులను, సారస్వత వ్యాసాంగాలను, వ్యాపార లావాదేవీలను, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలగువాటిని సంక్షిప్త లిపిలో విధిగా రాస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక పరంగా మానవుడు ఎంత అభివృద్ధిని సాధించినా మానవ మేధస్సుకు మర యంత్రములు ఏనాటికి సరితూగలేవన్నది జగమెరిగిన సత్యం. వారు సాధించిన వేగ శాతాన్నిబట్టి పి.ఎ,, పి.ఎస్., టీచర్, లెక్చరర్, అసెంబ్లీ, పార్లమెంటరీ రిపోర్టర్లుగా అనేక రంగాలలో ఉద్యోగాలు పొందే అవకాశం గలదు.

సంక్షిప్త లిపి విద్యపై నేటి విద్యార్థి, నిరుద్యోగ లోకంలో కొన్ని అపోహలు గలవు. కమ్యూనికషన్ రంగంలో నేడు మానవుడు సాధించిన అద్భుతమైన ప్రగతి ఆధారంగా ఎన్నో బోధనోపకరణములు అందుబాటులోకి వచ్చాయి. సమర్థవంతమైన బోధకుడు లభించి, కష్టపడే తత్త్వం, సాధించాలన్న తపన విద్యార్థులలో ఉన్నచో ఈ విద్యను నేర్చుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సంక్షిప్త లేఖకుల కొరత తీవ్రంగా ఉంది. కష్టపడి ఈ విద్యను నేర్చుకుంటే అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగావకాశాలు మెండుగాగలవు. కాబట్టి ఈ విద్యను విరివిగా నేర్చుకొని మనం దేనిలోనూ తీసిపోమని నిరూపిద్దాం. తెలంగాణ ముద్దు బిడ్డలమని గర్వంగా చెప్పుకుందాం.

వ్యాసకర్త:నాగులవంచ వసంతరావు,

          త్రిభాషా సంక్షిప్త లిపి లేఖకులు (ఇంగ్లీష్, తెలుగు, హిందీ)
          తెలంగాణ ముఖ్యమంత్రిగారి ఆంతరంగిక కార్యదర్శి,
          సెల్ నెం. 95025 23402