Jump to content

వల్లభాపురం జనార్ధన

వికీపీడియా నుండి
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల కవిసమ్మేళనంలో కవితాగానం చేస్తున్న వల్లభాపురం జనార్దన
వల్లభాపురం జనార్ధన్ పుస్తకాలు

వల్లభాపురం జనార్ధన అభ్యుదయ కవి. వివిధ ఛందస్సులలో అనేక పద్యాలు కూడా రాశారు. తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. పాలమూరు జిల్లా కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు పహారా కాస్తున్న రాత్రి అను కవితా సంకలనాన్ని వెలువరించారు. శ్రీశ్రీ మీద ఉన్న అభిమానంతో ' యుగ పతాక ' పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు[1]గా పనిచేస్తూ, వివిధ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రచనలు

[మార్చు]
  1. పహారా కాస్తున్న రాత్రి(వచన కవితా సంకలనం)[2]
  2. యుగ పతాక శ్రీశ్రీ (దీర్ఘకవిత)[3]
  3. విషకౌగిలి 123 అణుబంధ నానీలు[4]
  4. విజయక్రాంతి (సంగీత రూపకం)[5]

అతని రచనల నుండి...

[మార్చు]

సీస పద్యం:

తెలగాణ తెలుగున వెలుగులు చూపించి
ప్రాంతీయ ప్రతిభను పంచినాడు
తెలగాణ నేలలో తెలివికి చీకటి జాడయే లేదని చాటినాడు
మరియాదలను వీడి మాటతూలినవారి
గర్వమ్ము దించగా కదలినాడు
తెలగాణ తెలుగులో తీయందనాలను
చూడని నాల్కకు చూపినాడు
వైతాళికుండుగా జాతిరాగము పాడి
తెలగాణ ధిషణను తెలిపినాడు
తే:గీ:
మిట్టమధ్యాహ్న సూర్యుడై మెలగినాడు
ఆంధ్ర గర్వము చెండాడియలరినాడు
ప్రాంత తెలగాణ నడవడి పట్టిచూపి
రచనలందున రత్నాల రశ్మి చూపి
సురవరము జాతి మర్యాద చూపినాడు
కందం:
ప్రతిభా మంజూష తెరిచి
శ్రుతి చేసెను తెలుగుబాస చిన్నెల లయలన్
మతిమంతుడు జనహిత వరి
స్తుతికే స్తుతియయి నిలిచెను సురవర మతియై
కందం:
సేద్యము కవితా సేద్యము
వేద్యత పరిశోధకత్వ విద్వచ్చవియై
హృద్యపు రచనలు చేసెను
ఖాద్యములుగ బుద్ధికిడగ ఘన సురవరమే
కందం:
స్థిరుడై భాషా రతుడై
సురుచిరమగు గ్రామ్యభాష సొబగులు తెలిపీ
సురభాష కన్న మిన్నని
పరిచయమొనరించె భువికి భాసుర వరమే
ఉత్పలమాల:
బాలిశులైనయాంధ్రుల సవాలుకునిచ్చె జవాబు దీటుగా
సాలగ గోలకొండ కవి సంచిక నిల్పి చరిత్ర సాక్షిగా
గాలికి తూలిపోదు తెలగాణ యశమ్మని చాటి చెప్పెరా
చాలిన స్వాభిమాన జవసత్వపు దుర్భిణి చూడు సాహితిన్
శా ర్దూల వృత్తం:
శ్రీ రామాయణ కావ్యగాథగల రాశీభూతమౌ కల్పనల్
సారాంశమ్మున విశ్వసించుటకు సాక్ష్యాధారముల్ లేవనెన్
చారిత్రాత్మక గీటురాయిపయి సంచాలించి చూపించెరా
ధీరుండౌ పరిశోధకుండు ప్రతిభా ధీ రశ్మి మార్తాండుడే
తేటగీతి:
ఆంధ్ర తెలగాణ జీవన వ్యాకరణము
సంస్కృతీ నాగరికతల సౌరభాల
తెలుగు వెలుగుల చీకటి తీరులన్ని
గరిమనాంధ్రుల సాంఘిక చరిత రాసి
కొత్త పరిశోధనకు దారులెత్తి చూపె
తేటగీతి:
భాష సౌందర్య రూపము పరిమళించ
లిపికి సంస్కరణమ్ముల ప్రాపు వలయు
ననుచు చర్చించి నవ సూత్రమునులిఖించె
సురవరమ్ము భాషాశాస్త్ర పరిమళమ్ము

  • పాలమూరు కరువు[6]గురించి...

పాలమూరు పల్లెలు
బే చిరాగ్‌లుగా మారుతున్నయి
పొలాలు బీళ్ళవుతున్నయి
బీటలు వారుతున్నయి
సమాధులవుతున్నయి
ఇది ప్రకృతి ప్రకటించిన కోపమా!
వికటించిన ప్రజా ప్రభుత్వద్యేయమా!
...
ఆనకట్టలతో అన్నం పెడుతున్న పాలమూరు కూలీ
మెతుకు దూరమై
గొంతు పొలమారిపోయి
గటుక్కుమంటుండడు
దత్తత మంత్రపుష్పాలు
దగాల దడి కడ్తున్నయి
ఆకలి చావులపై మంత్రుల సుభాషితాలు
మనిషితనాన్ని తలదించుకొనేలా చేస్తున్నయి
పొలం పొలంగా మిగలని పాలమూరు
పటంలో గూడా ఊరుగా
మిగలకుండా పోయే రోజొస్తుంది
మనం మేల్కొనకుంటే.

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మట్టిపొరల్లోకివెళ్లిచూసినప్పుడే..సాహిత్యానికిసార్థకత dailyhunt.in
  2. ప్రజాసాహిత్య వేదిక ప్రచురణ, మహబూబ్ నగర్, మార్చి,2000
  3. సాహితీ స్రవంతి ప్రచురణ, మహబూబ్ నగర్, ఏప్రిల్, 2010
  4. సాహితీ స్రవంతి ప్రచురణ, మహబూబ్ నగర్, ఏప్రిల్, 2008
  5. నవోదయ సాహితీ సమితి ప్రచురణ, కొల్లాపూరం, ఆగస్ట్,1974
  6. 'రగులుతున్న పాలమూరు', పాలమూరు గోస,సం. ప్రొ.హరగోపాల్, కరువువ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా, జూలై,2004, పుట-159.