వడ్డెపాటి నిరంజనశాస్త్రి
వడ్డెపాటి నిరంజనశాస్త్రి 1877, అక్టోబరు 14వ తేదీకి సరియైన ఈశ్వర నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ అష్టమి, ఆదివారం నాడు గుంటూరు జిల్లా, దుగ్గిరాల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి భద్రమ్మ, తండ్రి కోటయ్య. చిన్నతనంలో తండ్రి వద్ద విద్యను అభ్యసించాడు. ఇతడు గురుముఖంగా కావ్యాలు, నాటకాలు పఠించాడు. అలంకార, వ్యాకరణ శాస్త్రాలను అభ్యసించాడు. శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రము, జ్యోతిష శాస్త్రములలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాడు. బందరులో పర్వతము నరసింహశాస్త్రి వద్ద అవధాన పంచకము, శ్రౌత, గృహ్య, ధర్మసూత్రాలు, వైదిక క్రియా విధానము నేర్చుకున్నాడు. ఇతడు 15 సంవత్సరాలు దుగ్గిరాలలోని ఉన్నతపాఠశాలలో ప్రధానాంధ్రోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతని జీవితచరిత్రను కొండూరు వీరరాఘవాచార్యులు నిరంజన విజయము అనేపేరుతో వ్రాశాడు.
సంఘసేవ
[మార్చు]ఇతడు కొండపర్తి వీరభద్రాచార్యులు (తత్వానందస్వామి)తో కలిసి 1908లో కృష్ణా-గుంటూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘాన్ని నెలకొల్పి దాని ద్వారా విశ్వబ్రాహ్మణులకు అపారమైన సేవచేశాడు. 1907లో ప్రబోధిని అనే కుల పత్రికను స్థాపించి దాని ద్వారా నీతి, మత, భాషా, శిల్ప, సాంఘిక రంగాలలో విశ్వబ్రాహ్మణుల పురోగతికి పాటుపడ్డాడు. గుంటూరు జిల్లాలో ప్రారంభమైన మొదటి పత్రిక ఇదే.
రచనలు
[మార్చు]- కల్యంధకౌముది
- కుమారాభ్యుదయము
- బ్రహ్మానందలీలలు
- పౌరుషేయాన్వయ మహాపురుష రత్నమాల
- భీష్మోదయము
- ధర్మపాల విజయము
- సూర్యశతకము
- తారావళి
- మాఘమహాత్మ్యము
- విశ్వకర్మ బ్రాహ్మణవంశాగమము మొదలైనవి.
బిరుదములు
[మార్చు]- ఇతనికి కవిశేఖర అనే బిరుదు ఉంది.
మరణం
[మార్చు]ఇతడు 1937, అక్టోబరు 17వ తేదీన మరణించాడు.
మూలాలు
[మార్చు]- విశ్వబ్రాహ్మణ సర్వస్వము - రాపాక ఏకాంబరాచార్యులు - పేజీలు 192-193
- ఆంధ్ర రచయితలు - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - పేజీలు 387-391