Jump to content

వజ్ఝల కాళిదాసు

వికీపీడియా నుండి

వజ్ఝల కాళిదాసు ప్రముఖ కవి,[1] [2] అవధాని, రచయిత, సంపాదకుడు, ప్రవాసాంధ్రుడు.

విశేషాలు

[మార్చు]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఇతడు 1909, మే 13వ తేదీకి సరియైన సౌమ్య నామ సంవత్సర వైశాఖ బహుళ అష్టమి తిథిలో విజయనగరం జిల్లా, బొబ్బిలి సమీపంలోని పాలతేరు గ్రామంలో వజ్ఝల శివశంకరశాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జన్మించాడు. ఇతడు తన మాతామహుని ఇంట విజయనగరంలో వాణిజ్యశాస్త్రంలో ఉన్నతవిద్యను అభ్యసించాడు. ఇతని వంశంలో అందరూ పండితులే. ఇతని ముత్తాత అన్నయ్య వేదవిద్యాపారంగతుడు, మహాకవి. అతడు "యాదవరాఘవపాండవీయం" అనే కావ్యాన్ని రచించాడు. ఇతని తాత సీతారామస్వామి కాళహస్తి సంస్థానంలో దీవాన్‌గా పనిచేశాడు. ఇతనికి వరుసకు తాతగారైన వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి కళాప్రపూర్ణ బిరుదాంకితుడు, కర్ణచరిత్ర, ఆంధ్ర వైయ్యాకరణ పారిజాతము ఇత్యాది గ్రంథ రచయిత. ఇతని మేనమామ కొల్లూరి ధర్మారావు "చాకిరేవు" అనే విమర్శనా గ్రంథరచయిత.[2]

జంటకవిత్వం

[మార్చు]

ఇతడు తన 12వ యేటనే తన సహాధ్యాయి వజ్ఝల వేంకటేశ్వర్లుతో కలిసి "వెంకటకాళిదాసు కవులు"గా జంటకవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఈ జంటకవుల రచనలు 1927 నుండి భారతి, గృహలక్ష్మి, ఆంధ్రభూమి, శారద మొదలైన పత్రికలలో వెలువడ్డాయి. వీరు జంటగా మధుర అనే నవల, నళిని, నివాళి, భాష్పబిందువు అనే కావ్యాలతో పాటు అనేక కథలు, గేయాలు, పద్యాలు మొదలైనవి రచించారు. ఈ జంట గురించి కురుగంటి సీతారామయ్య తన "నవ్యాంధ్ర సాహిత్యవీధులు" గ్రంథంలో ప్రస్తావించాడు.[2]

సినిమా రంగం

[మార్చు]

వజ్ఝల వేంకటేశ్వర్లు ఉద్యోగార్థమై దూరం కావడంతో వీరి జంటకవిత్వానికి తెరపడింది. చిత్తజల్లు పుల్లయ్య ఇతడిని పిలిపించి తన సావిత్రి సినిమాకు స్క్రిప్టు, మాటలు, కొన్ని పాటలు వ్రాయమని ప్రోత్సహించాడు. తరువాత లవకుశ (1934),దశావతారాలు (1937), పాశుపతాస్త్రం (1939) సినిమాలకు స్క్రిప్టు రచయితగా, గీత రచయితగా పనిచేశాడు. అయితే ఆ సినీ వాతావరణం, పద్ధతులు నచ్చక 1939లో సినిమా రంగాన్ని వదిలివేశాడు.[2]

ఉద్యోగం

[మార్చు]

ఇతడు 1940లో నాటి బీహార్ రాష్ట్రం (ప్రస్తుతం జార్‌ఖండ్ రాష్ట్రం) జెమ్‌షెడ్‌పూర్ సమీపంలోని టాటానగర్‌లో ఉద్యోగరీత్యా ప్రవేశించి స్టీల్ సిటీ ప్రెస్ అనే సంస్థలో ఉన్నత పదవిని అలంకరించి అక్కడే స్థిరపడ్డాడు.

సాహిత్య సేవ

[మార్చు]

ఇతడు జెమ్‌షెడ్‌పూర్‌లో నివసిస్తూ ప్రవాసాంధ్రులను సాహిత్యబాటలో నడిపించాడు. 1969-74ల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. మంజరి, ప్రవాసి పత్రికలకు సంపాదకుడిగా పనిచేశాడు. ఆంధ్ర విజ్ఞాన సమితి, ఆంధ్ర నాటక సాహిత్య సంఘాలను స్థాపించి వాటి ద్వారా గురజాడ అప్పారావు జయంతి, త్యాగరాజస్వామి జయంతులు ప్రతి యేటా నిర్వహించాడు.[2]

రచనలు

[మార్చు]
  • బిక్షావతి (కావ్యం)[3]
  • ఆంధ్రమహావిష్ణువు (ద్విపదకావ్యం).[4]
  • పంటవలతి (యక్షగాన నాటకం)
  • శాతవాహన సంభవం (కావ్యం)
  • తారామండలం (నాటిక)
  • శాంతిశ్రీ (నాటిక)

మూలాలు

[మార్చు]
  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2018-01-23.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 యడవల్లి, సుధాకర్ (16 March 1980). "చేయితిరిగిన వ్రాతగాడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 342. Archived from the original on 25 అక్టోబరు 2020. Retrieved 23 January 2018.
  3. ఆన్‌లైన్‌లో బిక్షావతి కావ్యం[permanent dead link]
  4. "Telugu Poetry in Twentieth Century". www.indianetzone.com. Retrieved 2018-01-23.