వంకాయల నరసింహం
వంకాయల నరసింహం | |
---|---|
జననం | వంకాయల నరసింహం 1931 , నవంబరు 14 విజయనగరం |
వృత్తి | విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో 1975 నుండి 16 ఏళ్ళపాటు ఆర్టిస్టు |
ప్రసిద్ధి | మృదంగ కళాకారుడు |
తండ్రి | లక్ష్మణస్వామి |
తల్లి | వెంకటలక్ష్మి |
వంకాయల నరసింహం విజయనగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. మన రాష్ట్రంలోని ప్రథమశ్రేణి మృదంగ నిపుణుడు మృదంగ కోవిదుడు, ఆదర్శ ఉపాధ్యాయుడుకూడా. విజ్జల నగరం (విద్య) గా పిలువబడే విజయనగరంలో వంకాయల నరసింహం 1931 నవంబరు 14 న, వెంకటలక్ష్మి, లక్ష్మణస్వామి పుణ్యదంపతులకు జన్మించాడు. స్థానిక యం.ఆర్. కాలేజీలో బియస్సీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఇడి చేసి విజయనగరం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా 22 ఏళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు.
సంగీత విద్య
[మార్చు]సంగీత విద్యాభ్యాసం శ్రీపాద సన్యాసిరావు వద్ద, అనంతరం గురుకుల పద్ధతిలో నేర్చింది మృదంగ నిపుణుడు కీ.శే. ముళ్ళపూడి లక్ష్మణరావు వద్ద. ఈ ఉభయుల శిక్షణలో కళల కాణాచియైన విజయనగరంలో వంకాయల నరసింహం మృదంగ వాదనం లేని కచేరి ఉండేది కాదనవచ్చు. రెండు దశాబ్దాల కాలంలో అంతటి పేరు గడించాడు. సంగీతంలో ఎన్నో మెళకువలు నేర్చిన మృదంగ మార్తాండుడనవచ్చు.
ఆకాశావాణి కేంద్రంలో
[మార్చు]సంగీతానురక్తితో ఉపాధ్యాయ వృత్తి విడచి, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో 1975 నుండి 16 ఏళ్ళపాటు స్టాఫ్ ఆర్టిస్టుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, అచటనే 1991లో పదవీ విరమణ పొందాడు. ఆకాశవాణిలో ఉండగా భక్తిరంజని కార్యక్రమంలో వాగ్గేయకారుడైన సంతూరు కృష్ణమచాచార్యులు, తూము నరసింహదాసు, ఆదిభట్ల నారాయణదాసు, ఉపద్రష్ట శ్రీ రామదాసు మొదలైన ‘అపూర్వ వాగ్గేయకారుల’ కార్యక్రమం బహుళ ప్రచారం చేశారు. అంతేగాక ప్రత్యేక సందర్భాలలో అనేక పట్టణాలలో ఆంధ్ర దేశమంతటా వాగ్గేయకారుల కీర్తనలు గానం చేసిన మనస్వి వంకాయల.
సంగీత సేవ
[మార్చు]తన ఏడు దశాబ్దాల విశేషమైన సంగీత ప్రయాణంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు డి.కె.పట్టమ్మాళ్, ఈమని శంకరశాస్త్రి, ద్వారం వెంకటస్వామి నాయుడు, నేదునూరి తదితర సంగీత స్రష్టలకు మృదంగ సహకారం అందించి వారందరి, సంగీత విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రజ్ఞాధురీణుడు. ఉద్యోగరీత్యా పదవీ విరమణనొందినా, 1992 నుండి నేటివరకు గుడి....... (విశాఖపట్నం) భారత్ కళావిహార్ సంగీత పాఠశాల, ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ భారతదేశంలో నలుమూలలనుండి వచ్చే విద్యార్థులకు (మణిపురి, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల) భక్తి సంగీతం, మృదంగంపై శిక్షణనిచ్చి దాక్షిణాత్య సంగీతానికి ఉత్తర, పశ్చిమంలో చక్కని గుర్తింపు తెచ్చిన ప్రయత్నం కూడా అభినందనీయమే గదా! అంతేగాక సంగీతమే తపస్సుగా తనకు తెలిసిన మృదంగ విద్యను ‘రాపిడెక్స్’ అనే వినూత్న పద్ధతిని రూపొందించి, గ్రంథస్థం కూడా చేసి, విద్యార్థులకు సుబోధకం చేయటం సర్వత్రా ప్రశంసనీయం.
ఇటీవల ఆకాశవాణి ప్రవేశపెట్టిన టాప్‌గ్రేడెడ్ ఆర్టిస్టుగా గుర్తించబడటమేగాక విజయవాడ, శ్రీకాకుళం, జమ్‌షెడ్‌పూర్, ఖర్గపూర్, బరంపురం, బొంబాయిలలో అనేక ప్రసిద్ధ సంగీత సంస్థల్లో కీబోర్డుపైన, విడిగా వాగ్గేయకార వైభవాన్ని గానం చేసిన ప్రజ్ఞాశాలి వంకాయల నరసింహం.
బిరుదులు, సత్కారాలు
[మార్చు]ఈయనను వరించిన బిరుదులు కొన్ని- మృదంగ- ప్రవీణ, సింహ, తపసిరా, విశారద, నాదసుధానిధి. అలాగే భీమిలికి చెందిన ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ ద్వారా ‘సంగీత విద్యానిధి’ బిరుదూ సద్గురు శివానందమూర్తి చేతుల మీదుగా అందుకొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ‘హంస అవార్డు’తో కూడా ఆయనను సత్కరించింది..
ప్రఖ్యాతులైన శిష్యులు
[మార్చు]అన్నింటిని మించి ప్రపంచ ప్రఖ్యాతులైన వంకాయల వెంకట రమణమూర్తి (కుమారుడు), పత్రి సతీష్‌కుమార్, గురువు వంకాయల నరసింహం శిష్యులుగా మృదంగ విద్యలో యువ విద్వాంసులుగా రాణించటం మెచ్చదగిన విషయం. ఇంకా యువ మృదంగ విద్వాంసులు బి.వి.యస్.ప్రసాద్, సద్గురు చరణ్, అనంత్, మండపాక రవి సుమారు 50 మంది శిష్యపరంపర, మరో 50 మంది ప్రశిష్య పరంపర వంకాయల సొంతమనవచ్చు. వీరిలో కొందరు మృదంగం వృత్తిగా స్వీకరించి ఆకాశవాణిలో ఏ గ్రేడ్ ఆర్టిస్టులుగా ప్రవర్థమానమవడం హర్షణీయమైన విషయం.
నరసింహం నిగర్వి, సిసలైన ఉపాధ్యాయుడు, సౌమ్యుడు, ధనార్జనకు, కీర్తి ప్రతిష్ఠలకు ప్రాకులాడడు, ఆశ్రయించే తత్వం కాదు. ఆత్మీయ సంగీతానుబంధమే వారిది. నిత్య విద్యార్థి, నిత్య పరిశోధకునిగా మనుగడ సాగిస్తున్న ఋషి తుల్యుడనవచ్చు.