లైకా
లైకా | |
---|---|
ఇతర నామం | Kudryavka |
జాతి | కానిస్ లూపస్ ఫెమిలియారిస్ |
బ్రీడ్ | సంకర శునకం, హస్కీ, టెర్రియర్ శునకాల |
లింగం | ఆడ |
జననం | c. 1954 మాస్కో, సోవియట్ యూనియన్ |
మరణం | నవంబరు 3, 1957 స్పుత్నిక్ 2, భూకేంద్రక కక్ష్య లో |
దేశం | సోవియట్ యూనియన్ |
క్రియాశీల సంవత్సరాలు | 1957 |
ప్రసిద్ధి | భూకక్ష్యకు మొదటి జంతువు |
యజమాని | సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ |
బరువు | 5 కిలోలు (11 పౌండ్లు) |
లైకా (1954 - 1957 నవంబరు 3) అనేది ఒక సోవియట్ యూనియన్ స్పేస్ కుక్క, ఇది అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి, భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు. లైకా మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక ఊరకుక్క. [1] దీనిని రష్యా వారు స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేసి, దానిని ఆ ఉపగ్రహంలో ఉంచి 1957 నవంబరు 3 న బాహ్య అంతరిక్షంలోకి ప్రయోగించారు. దానితో లైకా ప్రాణముండగా అంతరిక్షంలోకి ప్రవేశించిన జీవిగా చరిత్ర కెక్కింది.
ఈ ప్రయోగం జీవం ఉన్న ప్రయాణికుని కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని, అతను సూక్ష్మ గురుత్వాకర్షణను తట్టుకోగలడనే లక్ష్యాన్ని నిరూపించింది. అంతేకాక ఈ ప్రయోగం మానవ అంతరిక్ష మార్గాన్ని సుగమం చేసింది, అంతరిక్షయాన వాతావరణాలలో ప్రాణుల స్పందనలు ఎలా ఉంటాయనే మొదటి డేటాను శాస్త్రవేత్తలకు అందించింది. భూకక్ష్యకు చేరిన లైకా అధిక వేడి కారణంగా కొన్ని గంటలలోనే మరణించింది, బహుశా దానికి కారణం పేలోడ్ నుండి వేరుపడవలసిన కేంద్ర R-7 సస్టెయినర్ యొక్క వైఫల్యం అయిండవచ్చు.
లైకా ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది అనే అసలు విషయం 2002 వరకు బయటి ప్రపంచానికి తెలియదు. దానికి బదులుగా సోవియట్ ప్రభుత్వం ఆక్సిజన్ అయిపోవడం వలన లైకా ఆరోవ రోజున మరణించిందని విస్తృతంగా ప్రచారం చేసింది. కాని లైకా ప్రాణవాయువు తగ్గడానికి ముందే మరణించింది. రష్యా వారు రహస్యంగా ఉంచిన ఈ రహస్యం 2002 లో బట్టబయలయ్యింది.
2008 ఏప్రిల్ 11 న, రష్యన్ అధికారులు లైకాకు ఒక స్మారకాన్ని ఆవిష్కరించారు.