లకంసాని చక్రధరరావు
లకంసాని చక్రధరరావు గారు (ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్). వీరి సంపాదకత్వంలో1978 నుండి 1995 వరకు "తెలుగు వ్యుత్పత్తి కోశం " తెలుగు నుండి తెలుగుకు 108,330 పదాలతో 8 సంపుటాలుగా యూనివర్శిటీ వారిచే ప్రచురించబడింది. ప్రస్తుతం వీరు తెలుగులో కలిసిపోయిన సంస్కృత పదాల నిఘంటు నిర్మాణంలో ఉన్నారు. అలాగే తెలుగు వ్యుత్పత్తి కోశం]ను ఆన్ లైన్ లో కూడా ఉంచటానికి ఆంధ్రా యూనివర్సిటీ సమాయత్తమౌతోంది.
జీవిత సంగ్రహం
[మార్చు]ఆచార్య లకంసాని చక్రధరరావుగారు 3-7-1939లో పశ్చిమగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, చివటం గ్రామంలో రైతుకుటుంబంలో సుబ్బాయమ్మ, సత్యనారాయణ మూర్తి దంపతులకు జన్మించారు. వీరి పాఠశాల విద్యాభ్యాసం స్వస్థలమైన తణుకులోనే సాగింది. తణుకు బహుళార్థ సాధక ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. (11వ తరగతి) వరకు చదివారు.
ఫిఫ్త్ ఫారమ్ (10వ తరగతి) నాటికే తెలుగు ఛందస్సును పూర్తిగా అధ్యయనం చేసి పద్యాల్ని రాయటం మొదలు పెట్టారు. 15 సంవత్సరాల వయస్సులోనే మొట్టమొదటి కంద పద్యాన్ని అందంగా వీరు రాశారు.
ఉన్నత పాఠశాల విద్యార్థిగా వున్నప్పుడే చక్రధరరావు తణుకులో వున్న కేశవస్వామి మీద భక్తితో కేశ శతకాన్ని రాశారు. ఇది శార్దూల, మత్తేభ వృత్తాలతో కూడిన 100 పద్యాల శతకం. ఈ శతకం 1956లో రాయబడినప్పటికీ 1957లో ప్రచురించబడింది.
ఇంటర్మీడియట్ ఎమ్.పి.సి గ్రూపును తీసుకొని పశ్చిమగోదావరి భీమవరం (నేటి డి.ఎన్.ఆర్) కళాశాలలో చదివి ఉత్తీర్ణులయ్యారు. తర్వాత రాజమండ్రి అర్ట్స్ కళాశాలలో స్పెషల్ తెలుగులో చేరి ఆంధ్రా యూనివర్సిటీ ఫస్ట్‌గా వచ్చి, శ్రీ జయంతి రామయ్య పంతులు గోల్డ్ మెడల్‌ను పొందారు. ఆ కాలంలోనే భారతీయ విద్యాభవన్ నుండి కోవిద సంస్కృత పట్టాను పొందారు. 1960-62 సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఎ.ను ప్రవేశపెట్టారు. అంతకు పూర్వం బి.ఎ. (ఆనర్స్) మాత్రమే వుండేది. వీరు ఎమ్.ఎ. (తెలుగు) ప్రథమ శ్రేణిలో పాసై ఆచార్య గంటి జోగి సోమయాజి వద్ద తెలుగు సాహిత్య శాసనాల్లోని ఉర్దూ, మరాఠీ పదాలు అనే అంశంపై పరిశోధన చేశారు. ఆచార్య కాకర్ల వెంకట నరసింహం గారి వద్ద తన పరిశోధనను కొనసాగించి 1967లో పి.హెచ్.డి పట్టాను ఆంధ్ర విశ్వకళాపరిషత్ నుండి పొందారు. ఆ తర్వాత 1967లో వీరికి యు.జి.సి., ఎస్.ఆర్.ఎఫ్ సంస్కృతంలోని ద్రావిడ భాషా పదాలు అనే పరిశోధనాంశానికి గానూ లభించింది. ఆర్ట్స్‌లో యు.జి.సి సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పొందిన వారిలో వీరే ప్రప్రథములు. వీరు ఆంధ్రా యూనివర్సిటీలో అసోసియేటెడ్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొంది తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి కల్పించారు.
రచనలు
[మార్చు]- భాషాశాస్త్ర వ్యాసములు
లకంసాని చక్రధరరావుగారు 10 భాషా శాస్త్ర వ్యాసాల్ని వివిధ పత్రికల్లో ప్రకటించారు. వీటిని భాషా శాస్త్ర వ్యాసములు అనే పేరుతో 1968లో ప్రచురించి నిర్వాహక ఉపకులపతులు డాక్టర్ పిన్నమనేని నరసింహారావు గారికి అంకితం ఇచ్చారు.
భాషా శాస్త్ర వ్యాసములు అనే గ్రంథంలో మొట్టమొదటి వ్యాసం ప్రాచీనతమ ద్రావిడభాష అనే వ్యాసం. కొందరు తమిళం ప్రాచీన తమ ద్రావిడ భాష అని భావించగా శ్రీ కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు తెలుగునే ప్రాచీనతమంగా తెలిపారు. ఈ అభిప్రాయాలు సరికావని ప్రతి ద్రావిడ భాషలోనూ కొన్ని మూలద్రావిడ భాషా లక్షణాలుంటాయని, ద్రావిడ భాషలన్నీ సోదర భాషలని ఏ ద్రావిడ భాషకూ అగ్రత్వాన్ని అంటగట్టవలసిన అవసరం లేదని ఆచార్య లకంసాని చక్రధరరావుగారు ఇందులో సోదాహరణంగా నిరూపించారు.
రెండవ వ్యాసం ద్రావిడ భాషా కుటుంబమున తెలుగు స్థానం అనే వ్యాసం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి వెర్బల్ బేసిస్ అనే సిద్ధాంత గ్రంథంలోని డిప్లేస్ ఆఫ్ తెలుగు ఇన్ ది ద్రావిడియన్ ఫ్యామిలీస్ అనే వ్యాసానికి అనువాదం. తెలుగు, ద్రావిడ భాషా ఉపకుటుంబాల్లో మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని దీనిలో నిరూపించబడింది.
ధ్వనుల మార్పులు వారి మూడవ వ్యాసం. దీనిలో వర్ణ సమీకరణం, వర్ణ విభేదం, అను నాసిక్యం, శ్వాసత-నాదత, సామ్యం, లోప దీర్ఘతలు మొదలైన ధ్వనుల మార్పులు సోదాహరణంగా నిరూపించబడ్డాయి.
ధ్వని సూత్రములు-అపవాదములు అనేది నాల్గవ వ్యాసం. ఈ వ్యాసంలో ధ్వని సూత్రాలకు అపవాదాలు లేవని నిరూపించారు. గ్రిమ్, గ్రాస్‌మన్ 'లా' లతోపాటు ద్రావిడ భాషల్లోని తాలవ్యీకరణ సూత్రాల్ని వీరు వివరించారు. మూల ద్రావిడ భాషలోని కకారం తాలవ్యాచ్చులకు పూర్వం వున్నప్పుడు ఆంధ్ర, తమిళ వ్యవహర్తల ప్రాంతంలో చకారంగా క్రీ.పూ 300 సంవత్సర ప్రాంతంలో మారిందని సోదాహరణంగా నిరూపించి తాలవ్యీకరణ సూత్రానికి పరిపూర్ణతను చక్రధరరావుగారు కల్పించారు. ' ఇక 'యూరత్- ఆల్టాయిక్ భాషా కుటుంబం వీరి తొమ్మిదవ వ్యాసం. ఈ వ్యాసంలో యూరల్' పర్వత ప్రాంతానికి చెందినవారు ఈ పర్వత ప్రాంతమున నివసించిన జనులను 'ఆల్టై' పర్వత ప్రాంతమున నివసించు ప్రజలను పూర్వం వ్యహరించిన భాషా ప్రభేదములే ఈ యూరల్- ఆల్టాయిక్ భాషలు, ఈ భాష వ్యవహర్తలు పూర్వం ఖండంత దేశ భాషలన్నియు ప్రథమమున ఒకే భాషా కుటుంబానికి చెందినవి అని ఇప్పుడు చాలా భాషలయ్యాయని నిరూపించారు.
భాషా శాస్త్రము-సారస్వతము వారి పదవ వ్యాసం. ఈ వ్యాసంలో భాషాశాస్త్రం సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి ఏవిధంగా ఉపయోగ పడుతుందో లకంసాని తెలిపారు. ఈ పది వ్యాసాలు పలువురి ప్రశంసల్ని, మన్నల్ని అందుకున్నాయి.
- కవితా సంకలనం
నన్నయ్య నుండి వీరేశలింగం పంతులుగారి వరకు గల 50 మంది కవుల కవితల్ని కవితా సంకలంగా ఆచార్య చక్రధరరావుగారు రూపొందించి ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ద్వారా 1977లో ప్రకటించారు.
- దేశికవిత
ఆచార్య లకంసాని చక్రధరరావుగారు దేశికవిత అనే గ్రంథంలో 'దేశికవిత'ను నిర్వచించి సోదాహరణంగా వివరించారు. భాష, ఛందస్సు, ఇతివృత్తం దేశీయంగా ఉండాలనేది 'దేశికవిత' ప్రధాన లక్షణాలని వారు విశదపరిచారు. దీనిని ఎలకూచి బాలసరస్వతి ప్రణీతమైన చంద్రికా పరిణయంలోని, జూపల్లి పద్మనాయకుల చరిత్రను అప్పారాయ గ్రంథమాల ఉపాధ్యక్షులైన చక్రధరరావుగారు పరిష్కరించగా 1980లో అప్పారాయ గ్రంథమాల వారు ప్రచురించారు.
- భోగినీ దండకం
లకంసాని రచించిన పోతన రాసిన భోగినీ దండకంను 1980లో చక్రధరరావుగారు యధాస్థితి దండాన్వయసహితంగా అప్పారాయ గ్రంథమాల, నూజివీడు వారు ప్రచురించారు. యథాస్థిత దండాన్వయ మనేది చక్రధరరావుగారి స్వకపోలకల్పిత ప్రక్రియ. ఇందులో దండకంలోని పదక్రమం తప్పకుండా అర్థం వుంటుంది.
1978లో తెలుగు అకాడమీ వారు ప్రచురించిన ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు తయారీలో ఆచార్య లకంసాని చక్రధరరావు గారికి ప్రముఖస్థానముంది.
ఆచార్య లకంసాని చక్రధరరావుగారి బృహద్రచన తెలుగు వ్యుత్పత్తి కోశం. ఇది ప్రపంచ నిఘంటు నిర్మాణ చరిత్రలో మొట్టమొదట వ్యుత్పత్తి కోశాలే రూపొందాయి. కీ.పూ 6వ శతాబ్దికి చెందిన యాస్కాచార్యులు వ్యుత్పత్తుల ప్రాశస్త్యాన్ని దాని ఆవశ్యకతను వివరించారు. వ్యుత్పత్తి విహీన పదంలేదని వారు విశదీకరించారు. ప్రపంచంలో వారి నిరుక్తమే అత్యంత ప్రాచీన కోశం. భాషల్లోని పదాలకు వాస్తవ వివరణ ఇవ్వటమే వ్యుత్పత్తికోశాల యొక్క ప్రయోజనం సంస్కృత భాషలోని పదాలకూ, ఆంగ్లభాషా పదాలకూ ఆయా భాషా కోశాల ద్వారా వ్యుత్పత్తులు ప్రదర్శించబడ్డాయి. ఆంధ్రాయూని వర్శిటీ వారి సాటిలేని మేటి ప్రచురణ ఇది.
తెలుగు వ్యుత్పత్తి కోశంలో అర్థవిపరిణామం పొందని సంస్కృత సమాలు లేవు. ఈ శబ్దరాశి సంఖ్య సుమారు 50,000. ఈ సంఖ్యను ఉపేక్షించలేము. అగ్ని అనిలము, కాలము, ఛత్రము, తరువు, వయస్సు, విద్య, హలము మొదలైన సంస్కృత సమపదాలకు ఈ కోశంలో స్థానం లభించితేనే ఇది సమగ్రమవుతుంది. ఈ లోపాన్ని గుర్తించిన ఆచార్య లకంసాని చక్రధరరావుగారు లోపాన్ని సవరించే ప్రయత్నం చేశారు.
పెద్దల ప్రశంసలు
[మార్చు]'చక్రధరరావు సంస్కృతాంధ్రాంగ్లములలో మంచి పాండిత్యమును, హిందీ, ఉర్దూ మొదలగు భాషలతో విశేష పరిచయమును సంపాదించి యున్నారు. అందుకే ఆయన కృషికి, అటు విద్యార్థులను, ఇటు పండితులను కూడా ఆకర్షింపగలదని ఆశింతునని ఆచార్య కాకర్ల వేంకటరామనర్సింహంగారు 'ఆమోదము'లో తెలపగా, 'ఆముఖము'లో ఆచార్య దోణప్పగారు చక్రధరరావు పది వ్యాసాలు శాస్త్ర విద్యార్థులకు, తత్త్వ జిజ్ఞాసువులకును బహు ఉపయోగకారులుగా కాగలవని నా నమ్మకము అని ప్రశంసించారు.
అలాగే ప్రముఖుల భాషావేత్తలు అనే గ్రంథములో ఆచార్య వెలమల సిమ్మన్న గారు. విశ్వవిద్యాలయాచార్యులుగా, శాఖాధ్యక్షులుగా, విశిష్టబోధనానుభవం గడించడమేకాక, పరిశోధకులుగా, పర్యవేక్షకులుగా ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్తగా ఆచార్య లకంసాని చక్రధరరావుగారి ప్రతిభకు, భాషా కృషికి, పరిశ్రమకు వారి కృషికి నిదర్శనమని ప్రశంసించారు.