Jump to content

రోడా మిస్త్రీ

వికీపీడియా నుండి
రోడా మిస్త్రీ
రోడా హోమీ మిస్త్రీ (1996, ఫిబ్రవరి 29న తీసిన వ్యక్తిగత చిత్రం)
రాజ్యసభ సభ్యురాలు
In office
1980–1986
నియోజకవర్గంఆంధ్రప్రదేశ్
మహిళా, శిశుసంక్షేమ శాఖా మంత్రి
ఆంధ్రప్రదేశ్
In office
1970లు
మహిళా, శిశుసంక్షేమ, పర్యాటక శాఖా మంత్రి
ఆంధ్రప్రదేశ్
In office
1978 -1980
వ్యక్తిగత వివరాలు
జననం(1928-10-16)1928 అక్టోబరు 16
సికింద్రాబాదు,భారతదేశం
మరణం2004 జూన్ 8(2004-06-08) (వయసు 75)
హైదరాబాదు, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి
హోమీ పి. మిస్త్రీ
(m. 1946; మరణం 2001)
సంతానం2

రోడా హోమీ మిస్త్రీ ( 1928 అక్టోబరు 16- 2004 జూన్ 8) సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయవేత్త మరియు భారతదేశంలోని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో రోడా మిస్త్రీ సామాజిక సేవ మరియు పరిశోధనా కేంద్రానికి స్థాపకురాలు.[1] ఆమె భారత జాతీయ కాంగ్రెస్ తరపున భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించారు.[2][3][4][5] ఆమె దీనికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసింది.[6][7][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రోడా మిస్త్రీ, 1928, అక్టోబరు 16న సికింద్రాబాదులో ధనిక పార్శీ కుటుంబంలో జన్మించింది.[8][9] ఈమె తండ్రి మంచర్ షా భారూచా. రోడా బాల్యం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సాగింది. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాదులో ఇటాలియన్ కాన్వెంటులో జరిగింది. ఇక్కడ యుద్ధంలో గాయపడి పట్టుబడిన ఇటాలియన్ సైనికులను తెచ్చి క్రైస్తవ సన్యాసినులకు అప్పగించేవారు. ఇక్కడ రోడా, తన తోటి విద్యార్థులతో పాటు ఈ క్షతగాత్రులకు సేవలందించేది.[5] రోడా విద్యాభ్యాసం అప్పట్లో సీనియర్ కేంబ్రిడ్జి వరకు సాగింది.[2] రోడాకు పదహారేళ్ళ వయసులో, 1946లో హోమీ మిస్త్రీతో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. పెళ్ళైన తర్వాత హోమీతో పాటు నాలుగేళ్లు బొంబాయిలో నివసించింది. పెళ్ళైన సంవత్సరంలోపే ఈమెకు ఒక కుమార్తె పుట్టింది.[5] ఈమెకు కుమార్తెతో పాటు, ఒక కుమారుడు సంతానం. ఉమ్మడి ధనిక కుటుంబంలో గృహిణిగా, మహిళా క్లబ్బుల్లో జూదము, గుర్రపు పందేలతో కూడిన విలాసవంతమైన సాంఘిక జీవనంతో సరిపెట్టుకోలేక, తన సొంతగా ఏదో ఒక పనిని చేపట్టాలనే అసహనంతో ఉండేది. నాలుగేళ్ల తర్వాత భర్తతో పాటు కుటుంబాన్ని స్వస్థలమైన హైదరాబాదుకు మార్చి, సామాజిక సేవారంగంలో అడుగుపెట్టింది. ఇంటి దగ్గర ఉంటే, అన్ని విధమైన సేవలతో గారాబంగా పెరుగుతారని పిల్లలని ఐదేళ్ల వయసునుండే ఊటీలోని గురుకుల పాఠశాలలో చదివింది. ఆ తర్వాత ఈమె కుమార్తె తెహ్మీనా మిస్త్రీ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్ళి అక్కడే స్థిరపడింది.[10] రోడా మనుమరాలు, లైలా మిస్త్రీ అల్ఫోన్స్, అమెరికాలో పాత్రికేయురాలు. ఆమె "ట్రయంఫ్ ఓవర్ డిస్క్రిమినేషన్: ది లైఫ్ స్టోరీ ఆఫ్ డాక్టర్ ఫర్హాంగ్ మెహర్" అనే పుస్తకాన్ని వ్రాసింది.[8][11]

ప్రారంభంలో ఆరామ్‌ఘర్ అనే వికలాంగుల గృహాన్ని నడిపించింది. ఆ తర్వాత మహిళా ఉపాధికల్పనలో కృషిచేసింది. స్వాతంత్ర్యం తర్వాత జమీందారీల రద్దుతో, అనేక జమీందారీ గృహాల్లో పనిచేస్తున్న మహిళలకు పనిలేకుండా పోయింది. అలాంటి నిర్వాసిత మహిళలతో సహకార సంస్థల ఆధ్వర్యంలో అనేక రెస్టారెంట్లను నడిపింది. పతాక స్థాయిలో ఇలాంటివి 45 దాకా రెస్టారెంట్లను నడిపించింది. అలా మహిళకు ఉపాధి కల్పించి రోడ్డున పడకుండా కాపాడింది. ఇప్పటికీ పదిదాకా రెస్టారెంట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఈ సంస్థ పురుషుల ఉపాధి కల్పనలో కూడా కృషిచేసింది.

1966లో సామాజిక సేవను బోధించడానికి ఒక కళాశాలను స్థాపించి కళాశాల స్థాయి డిప్లొమా కోర్సులను ప్రారభించింది. 1972లో ఉస్మానియా విశ్వవిద్యాలయపు అనుబంధ సంస్థగా గుర్తింపబడి, డిగ్రీలు ప్రదానం చేయగలిగే స్తోమతను పొందింది. 1982 నుండి మాస్టర్సు డిగ్రీని, 1992 నుండి డాక్టరేట్లు జారీచేసే స్థాయికి ఎదిగింది. రాజ్యసభ సభ్యురాలైన తర్వాత రోడా మిస్త్రీ మహిళకు న్యాయసహాయం అందించేందుకు కృషిచేసింది.

రోడా మిస్త్రీ 2004 డిసెంబరు 1న హైదరాబాద్లో మరణించింది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

రోడా మిస్త్రీ ప్రారంభంలో రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా, యాధృచ్ఛికంగా 25 ఏళ్ల వయసులోనే క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.

రోడా మిస్త్రీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అనే సాంఘిక సేవా సంస్థలో స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేసేది. ఈ సంస్థ, వియన్నాలో కేంద్రకార్యాలయం ఉన్న ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ యొక్క అనుబంధ సంస్థ.[5] ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్‌కు మెహదీ నవాజ్ జంగ్ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈయన అప్పట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. మెహదీ నవాజ్ జంగ్ 1959లో గుజరాత్ గవర్నరుగా నియమించబడి, తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[12] తన నియోజకవర్గమైన జూబ్లీ హిల్స్ నుండి తన తర్వాత రోడా మిస్త్రీ ప్రాతినిధ్యం వహించాలని భావించిన మెహదీ యావర్ జంగ్, అప్పటి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూకు లేఖ వ్రాసి, రోడా మిస్త్రీకి సీటు ఇప్పించాడు. ఈ తరుణంలో జరిగిన ఉప ఎన్నికలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంనుండి భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్థినిగా పోటీ చేసి, ముగ్గురు స్వతంత్ర అభ్యుర్ధులను ఓడించి గెలుపొందింది. 1962లో తిరిగి ఇదే నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికైంది. 1959 నుండి 1967 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలిగా, 1968 నుండి 1980 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా పనిచేసింది. ఈ తరుణంలో 1968 నుండి 1971 వరకు, మరలా 1978 నుండి 1980 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభ్యుత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసింది.[2]

1978 నుండి 1980 వరకు మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మహిళా సంక్షేమ, పర్యాటక శాఖా మంత్రిగా పనిచేసింది. ఈమె రాజకీయంగా కాంగ్రేసు పార్టీలో మర్రి చెన్నారెడ్డి మద్దతుగా ఉంది. మహిళా సంక్షేమ శాఖాగా మంత్రిగా, కట్నాలు ఇవ్వలేక స్థానికంగా వరుడు దొరకని పేద ముస్లిం కుటుంబాలు తమ కూతుళ్లను, ముదుసలి ధనిక అరబ్బులకు రెండవ భార్యగా పంపించడమే మంచిదని రోడా మిస్త్రీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రంలో పెద్ద దుమారం లేపాయి. ఈమెను మంత్రివర్గం నుండి సత్వరమే తీసివేయాలని, లేదా మహిళా సంక్షేమ శాఖామంత్రిగా తొలగించాలని చెన్నారెడ్దిపై ఒత్తిడి చేశారు. విద్యార్థినులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముందు ధర్నాలు చేశారు. రోడా మిస్త్రీ తన వ్యాఖ్యలను ఉద్దేశించి బేషరతుగా, ఎటువంటి సమర్ధన లేకుండా, క్షమాపణలను కోరింది. అయినా కూడా రోడా మిస్త్రీని మంత్రిగా తీసివేయాలన్న డిమాండు కొంతకాలం దాకా ఆగలేదు.[9]

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు, ఆమెతో పాలసీ పరంగా విభేదింది రోడా, కాంగ్రేసు పార్టీకి రాజీనామా చేసింది. రాజకీయాలనుండి విరమించి సామాజిక సేవపై దృష్టిసారించింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వ హాయాములో రాజ్యసభకు నియమించబడి పార్లమెంటు సభ్యురాలైంది.[5] రాజ్యసభలో పార్టీలతో అనుబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగానే ఉంది. 1980, ఏప్రిల్ 3 నుండి 1986 ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేంది. 1977లో కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రేసు కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యత వహించింది.[2]

సామాజిక సేవ

[మార్చు]

క్రియాశీల రాజకీయాలనుండి విరమించినా, రోడా మేస్త్రీ సామాజిక సేవారంగంలో కృషి కొనసాగించింది. ఈమె స్థాపించిన సాంఘిక సేవా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

2001లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ (ఐ.సి.ఎస్.డబ్ల్యూ) సంస్థ పిల్లలను దేశాంతర దత్తతులకు పంపించడానికి "ప్రెషియస్ మూమెంట్స్" అనే గుర్తింపబడని అనాథ శరణాలయం నుండి శిశువులను, పిల్లలను స్వీకరించిందనే ఆరోపణతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సంస్థ యొక్క అధ్యక్షురాలిగా రోడా మిస్త్రీని అరెస్టు చేశారు. ఆ సంవత్సరం ఏప్రిల్‌లో ఈ ఉదంతం బయల్పడిన తర్వాత రోడా మిస్త్రీ 2001 మే నెలలో సంస్థ అనాథ శరణాలయం యొక్క లైసెన్సు త్యజించినా, కేంద్ర దత్తత వనరుల ఏజెన్సీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్‌ యొక్క రిజిష్ట్రేషన్ను రద్దు చేసింది. [13] [14][15]

మూలాలు

[మార్చు]
  1. "RMCSW :: HOME". cswhyd.org. Retrieved 2019-11-15.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 – 2003" (PDF). Rajya Sabha. Retrieved 22 November 2017.
  3. "Women Members of Rajya Sabha" (PDF). Rajya Sabha. p. 147. Retrieved 22 November 2017.
  4. Lok Sabha Debates. Lok Sabha Secretariat. 7 April 1986. pp. 69–70. Retrieved 22 November 2017.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Olivia Cox-Fill (1996). For Our Daughters: How Outstanding Women Worldwide Have Balanced Home and Career. Greenwood Publishing Group. pp. 110–. ISBN 978-0-275-95199-3. Retrieved 22 November 2017.
  6. Not Available (1984). India Whos Who 1984.
  7. "Andhra Pradesh: Angry protests". India Today. 31 October 1978. Retrieved 22 November 2017.
  8. 8.0 8.1 8.2 Wecker, Menachem (2016-03-27). "What It's Like to Have to Date Someone of Your Religion to Save It From Extinction". The Atlantic (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-01-04.
  9. 9.0 9.1 "Andhra minister Roda Mistry creates a storm with her poor Hyderabadi girls comment". India Today. 13 March 2014. Retrieved 5 July 2024.
  10. "Tehmina Mistry Alphonse". centraljersey.com. Archived from the original on 13 జూలై 2024. Retrieved 13 July 2024.
  11. "Fezana Journal Winter 2003 Edition" (PDF). fezana.org. Retrieved 13 July 2024.
  12. Civic Affairs - Volume 8. P.C. Kapoor at the Citizen Press. 1960. p. 116. Retrieved 5 July 2024.
  13. Jafri, Syed Amin (29 August 2001). "Child adoption racket: Roda Mistry surrenders". rediff.com. Retrieved 5 July 2024.
  14. "54 children rescued in Andhra adoption racket bust". The TIime Of India. 27 April 2001. Retrieved 5 July 2024.
  15. "Roda Mistry's ICSW to surrender adoption right". poundpuplegacy.org. Retrieved 5 July 2024.