Jump to content

రొమ్ము పన్ను

వికీపీడియా నుండి

రొమ్ము పన్ను (ఆంగ్లం: Breast tax) అనేది కేరళ ట్రావెన్‌కోర్ పాలించిన రాజులు స్త్రీల రొమ్ములపై విధించిన పన్ను. స్థానికంగా ముళకరం అని పిలిచే ఈ పన్ను నాడార్, ఈజావా, ఇతర దిగువ తరగతి మహిళలు తమ రొమ్ములను వస్త్రం కప్పుకుంటే వారిపై విధించబడుతుంది. దీనికి సంబంధించి ఏ చారిత్రక ఆధారాలు లేకపోయినా 1859 వరకు మహిళలు బహిరంగ ప్రదేశాలలో పై వస్త్రాలు ధరించడానికి అనుమతించబడలేదు.[1]

చరిత్ర

[మార్చు]

18వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ రాజ్యం, ప్రస్తుత తిరువనంతపురంను పాలించిన రాజులు విధించిన పన్నులు చాలా దారుణంగా ఉండేవి. మహారాజు మార్తాండవర్మ పరిపాలిస్తున్న రోజులలో తలక్కారం, ముళకరం అనే పన్నులు ఉండేవి.

తలక్కారం అనే పన్ను పురుషుల గడ్డాలు, మీసాలపై విధించేవారు. అంతేకాదు స్త్రీలకు ముళకరం పన్ను కట్టాల్సివచ్చేది. అంటే వారు వక్షోజాలపై వస్త్రం ధరిస్తే పన్ను, వక్షోజాల పరిమాణం బట్టీ కూడా పన్ను అన్నమాట. అలాగే మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించాలన్నా పన్ను చెల్లించి రాజుగారి అనుమతి పొందాల్సిందే.

నంగేలి ధిక్కరణ

[మార్చు]

ట్రావెన్‌కోర్ రాజ్యంలో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే పై దుస్తులు ధరించాలి. బడుగు, బలహీన వర్గాల మహిళలకు లోన రవికె వేసుకుని, పైన చీరకొంగు కప్పుకునే అర్హత ఉండేది కాదు. ఈ నిబంధనలు నచ్చని నంగేలి, రాజు ఆజ్ఞను ధిక్కరించింది. పన్ను కట్టి అనుమతి తీసుకోకుండానే ఒకరోజు ఆమె పూర్తి వస్త్రాలను ధరించి పొలం పనులకు వెళ్లింది.

ఈ విషయం తెలిసిన మహారాజు మార్తాండవర్మ కోపం కట్టలుతెచ్చుకుంది. వెంటనే ప్రవతియార్(పన్ను వసూలుదారు)ను పిలిపించి మందలించాడు. దీంతో పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటివద్దకు వెళ్లి, రాజు అనుమతి లేకుండా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ఎలా ధరిస్తావు అంటూ మండిపడ్డాడు. ఇప్పుడే పన్నుకట్టితీరాల్సిందే అని పట్టుబట్టాడు. అసలే ఈ దురాచారంపై రగిలిపోతున్న నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలితో కోసేసుకుని పన్నుకు బదులుగా సమర్పించింది. ఆమె రక్తపుమడుగులో వీరమరణం చెందింది. భార్య మరణం జీర్ణించుకోలేని ఆమె భర్త కండప్పన్ కూడా ఆమె దహన సంస్కారాల సమయంలో చితిలోకి దూకేసి దహనమయ్యాడు. దీంతో ట్రావెన్ కోర్ రాజ్యంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఆ రాజ్యంలో ముళకరం, తలక్కారం పన్నులను రద్దుచేశారు. అయితే ఇప్పటికీ కేరళ చరిత్రలో నంగేలి దంపతులు సజీవంగానే నిలిచిపోయారు. వారి ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆ గ్రామానికి ములచ్చి పురంబు అనే పేరు వచ్చింది.[2][3]

మీడియా

[మార్చు]

మహిళల శరీర భాగాలపై వేసిన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నంగేలి ప్రతిఘటన ఆధారంగా రూపొందించిన పులి(Puli: The 19th Century) చిత్రం 2023 ఏప్రిల్ 15న విడుదలయింది.[4]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The woman who cut off her breasts to protest a tax" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2016-07-28. Retrieved 2020-01-19.
  2. "breast tax, పన్ను కట్టమంటే రొమ్ములు కోసిచ్చింది.. ఈ వనిత కథ గుండె బరువెక్కిస్తుంది - nangeli the woman who cut off her breasts to protest a tax - Samayam Telugu". web.archive.org. 2023-05-09. Archived from the original on 2023-05-09. Retrieved 2023-05-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "The woman who cut off her breasts to protest a tax - BBC News". web.archive.org. 2023-05-09. Archived from the original on 2023-05-09. Retrieved 2023-05-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "రొమ్ములపై పన్నులను వ్యతిరేకించిన 'పులి' చిత్ర ప్రదర్శన  | Prajasakti". web.archive.org. 2023-05-08. Archived from the original on 2023-05-08. Retrieved 2023-05-08. {{cite web}}: no-break space character in |title= at position 55 (help)CS1 maint: bot: original URL status unknown (link)