రెండవ విక్రమాదిత్యుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెండవ విక్రమాదిత్యుడు (సా.శ 733 - 744) చాళుక్య రాజైన విజయాదిత్యుని కుమారుడు. ఇతని తండ్రి తర్వాత బాదామి చాళుక్యుల సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ సమాచారం సా.శ 735 లో లక్ష్మేశ్వర్ వేయించిన కన్నడ శాసనాలలో ఉంది.[1] ఈ శాసనాల ప్రకారం రెండవ విక్రమాదిత్యుడు తన పట్టాభిషేకానికి ముందే తమ దీర్ఘకాల శత్రువులైన కాంచీపురం పల్లవుల మీద జైత్రయాత్రలు చేశాడు. అతని అత్యంత ముఖ్యమైన విజయాలు మొదటి సారి యువరాజుగా, రెండవసారి చక్రవర్తిగా మరియు మూడవసారి అతని కుమారుడు, యువరాజు రెండవ కీర్తివర్మ నాయకత్వంలో మూడు పర్యాయాలు కాంచీపురాన్ని పట్టుకోవడం. ఇది విరూపాక్ష దేవాలయ శాసనం అని పిలువబడే మరొక కన్నడ శాసనం ద్వారా ధృవీకరించబడింది. ఇది మూడు సందర్భాలలో చక్రవర్తి కంచిని జయించినట్లు సూచిస్తుంది. పట్టదకల్లులో అతని పట్టపురాణులు లోకాదేవి, త్రిలోకాదేవి ద్వారా ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయం (లోకేశ్వరాలయం), మల్లికార్జున దేవాలయం (త్రిలోకేశ్వరాలయం) ప్రతిష్ఠించబడడం మరొక ముఖ్యమైన విజయం.[2] ఈ రెండు స్మారక చిహ్నాలు పట్టదకల్ వద్ద యునెస్కో ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నాలలో ప్రధాన భాగం. ఈయన శక్తివంతమైన పాలకుడు, 40 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. శాంతిని కాపాడటానికి అతను రాష్ట్రకూటులతో వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నాడు.[3]

పల్లవులతో యుద్ధం

[మార్చు]

రెండవ విక్రమాదిత్యుని శాసనాలు, నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన, శాంతియుత పాలనలో వృద్ధాప్యం వరకు పాలించిన రాజు విజయాదిత్య వలె కాకుండా, యుద్ధం పట్ల అతనికున్న దుడుకుతనాన్ని తెలియజేస్తున్నాయి. ఒక శతాబ్దం క్రితం, కాంచీపురం పల్లవులు మొదటి నరసింహవర్మ నాయకత్వంలో, చాళుక్యులను ఓడించి, వారి రాజధాని బాదామిని ఆక్రమించుకున్నారు. దాని ఫలితంగా రెండవ పులకేశి అద్భుతమైన పాలన ముగిసింది. ఇది చాళుక్య రాజకుటుంబానికి అవమానం కలిగించింది. ఈ సంఘటనలు రెండవ విక్రమాదిత్యునిలో ప్రతీకారేచ్ఛను పెంచి పోషించినట్లు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. పల్లవులను పూర్తిగా నాశనం చేస్తే గానీ తమ వంశానికి జరిగిన అవమానానికి ప్రతీకారం నెరవేరదని ఈయన అభిప్రాయం. అదే ఉత్సాహంతోనే ఈయన ఆయుధాలు చేతబూని పల్లవులపై దండెత్తాడు.[4]

ఇతను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంచీపురంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఒక అవకాశాన్ని చూశాడు. రెండవ నందివర్మకి వ్యతిరేకంగా చిత్రమయుడిని సమర్ధించాడు.[2] ఈయన పల్లవులతో అనేక యుద్ధాలు చేశాడు. మూడు ముఖ్యమైన విజయాలు సాధించి కాంచీపురాన్ని ఆక్రమించాడు. చాళుక్య యువరాజుగా 730 ప్రాంతంలో, పశ్చిమ గంగా రాజవంశ యువరాజు ఎరేయప్ప సహాయంతో పల్లవ రాజు రెండవ పరమేశ్వరవర్మపై దాడి చేశాడు. పల్లవ రాజు తన రాజ్యానికి చాలా ఆర్థిక నష్టం కలిగి శాంతిని కోరాల్సి వచ్చింది. దీని తర్వాత పల్లవులు గంగా వంశానికి మిత్రుడైన శ్రీపురుష (731)పై ఎదురుదాడికి ప్రయత్నించాడు. కానీ ఆ యుద్ధంలో మరణించాడు. శ్రీపురుష రాజ చిహ్నాలను, ఛత్రాన్ని స్వాధీనం చేసుకుని పెర్మనాడి అనే బిరుదును పొందాడు.[5] చాళుక్యులు పొందిన ఈ విజయం విజయాదిత్య పాలనలో జరిగినప్పటికీ, చాళుక్య చక్రవర్తుల రికార్డులు రెండవ విక్రమాదిత్యుని ఈ విజయాన్ని ఆపాదించాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ramesh (1984), p.156
  2. 2.0 2.1 Kamath (2001), p.63
  3. Nath sen, Sailendra (1999). Ancient Indian History and Civilization. Routledge. p. 395.
  4. Ramesh (1984), p.157
  5. Sastri (1955), p.139

ఆధార గ్రంథాలు

[మార్చు]