Jump to content

రెండవ ప్రపంచ యుద్ధం - ఐరోపాలో పూర్వరంగం

వికీపీడియా నుండి

ఫ్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ యుద్ధం

దస్త్రం:Hitlermusso2 edit.jpg
ముసోలినీ (ఎడమ), హిట్లర్

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దాదాపు ఎనభయ్యేళ్లుగా జెర్మనీ, ఫ్రాన్స్ ల మధ్య ఐరోపాలో తమ ప్రాబల్యం పెంచుకోవటానికి పోటీ పడుతూ ఉండేవి. ఈ మధ్య కాలంలో ఆ రెండు దేశాలు రెండుసార్లు యుద్ధానికి దిగాయి. మొదటిది 1870-71 మధ్య జరిగిన ఫ్రాన్స్-ప్రష్యా యుద్ధం, కాగా రెండవది 1914-18 మధ్య నాటి మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగింది.

1917నాటి రష్యన్ విప్లవం తరువాత ఐరోపా అంతటా కమ్యూనిస్టు ఉద్యమం విస్తరించటం మొదలు పెట్టింది. నెమ్మదిగా హంగరీ, బవేరియా వంటి దేశాలు కమ్యూనిస్టు పాలనలోకి జారుకున్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎదుర్కొనే నెపంతో ఐరోపాలోని కొన్ని దేశాల్లో జాత్యహంకార ధోరణులతో కూడిన రాజకీయ పక్షాలు పుట్టుకొచ్చాయి. 1922లో ఫాసిస్టు నియంత బెనిటో ముసోలినీ నాయకత్వంలోని జాత్యహంకార జాతీయ ఫాసిస్టు పార్టీ ఇటలీలో అధికారం చేజిక్కించుకుంది. ముసోలినీ స్ఫూర్తితో 1934లో జెర్మనీలో మరో జాత్యహంకార నాజీ పార్టీ నేత అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకొచ్చాడు. జెర్మనీలో అప్పట్లో నెలకొని ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితులు కూడా హిట్లర్ అధికార పీఠమలంకరించటానికి తోడ్పడ్డాయి. ఈ నియంతలిరువురూ తమ తమ దేశాల్లో విపరీతమైన సైనికీకరణ జరపడంద్వారా ఐరోపాలో ప్రమాదఘంటికలు మోగించారు. ఈ క్రమంలో, మొదటి ప్రపంచ యుద్ధానంతరం జెర్మనీ నిరాయుధీకరణనుద్దేశించి అమల్లోకి తెచ్చిన వెర్సైల్స్ ఒప్పందాన్ని హిట్లర్ ఉల్లంఘించాడు. కాగా, ముసోలినీ తొలుత ఆఫ్రికా దేశమయిన అబిసినియా, వెనువెంటనే తోటి ఐరోపా దేశమయిన అల్బేనియాలో కొంతభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ నియంతలిరువురూ స్పెయిన్లో సోవియెట్ యూనియన్ మద్దతుతో కొనసాగుతున్న జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జాత్యహంకార ఫాలాంగే పార్టీ నాయకుడు ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి అండదండలు అందించసాగారు.

1938 మార్చి నెలలో హిట్లర్ ఆస్ట్రియాను ఆక్రమించి జెర్మనీలో విలీనం చేసుకున్నాడు. ఐతే, నెవిల్ చాంబర్లేన్ నేతృత్వంలోని బ్రిటిష్ ప్రభుత్వం హిట్లర్ కన్నా జోసెఫ్ స్టాలిన్ పాలిత సోవియెట్ యూనియన్ నే ఐరోపాకు ఎక్కువ ప్రమాదకారకంగా భావించింది. సోవియెట్ల కమ్యూనిస్టు భావజాల విస్తరణ నిరోధించటానికి జెర్మనీని ప్రోత్సహించటమే సరైనదన్న అంచనాతో జెర్మనీతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్నే మ్యూనిక్ ఒప్పందం అంటారు. ఇందులో ఇంగ్లాండ్, జెర్మనీలతో పాటు ఫ్రాన్స్, ఇటలీ కూడా పాలుపంచుకున్నాయి. దీని ప్రకారం ఐరోపాలో జెర్మనీ, ఇటలీలు ఆక్రమించుకున్న భూభాగాలపై యధాతధ స్థితిని కొనసాగించవచ్చు కానీ ఇక ముందు ఆక్రమణలకు పాల్పడకూడదు. కానీ 1939 మార్చిలో ఇటలీ అల్బేనియానీ, జెర్మనీ చెకొస్లవేకియాలో మిగిలిన భాగాన్నీ ఆక్రమించటం ద్వారా మ్యూనిక్ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. దానితో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లు యుద్ధ సన్నాహకాలు మొదలు పెట్టాయి. ఆ దిశగా ఈ రెండు దేశాలూ అదే ఏడాది వేసవి కాలంలో పోలాండ్తో అవసరమైన పక్షంలో ఒకరికొకరు సైన్య సహాయం అందించుకోవాలనే అవగాహనకు వచ్చాయి.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జెర్మనీకి సముద్ర మార్గంద్వారా చమురు, నిత్యావసర వస్తువుల సరఫరా జరగకుండా ఇంగ్లాడ్ అడ్డుకుంది. ఆ యుద్ధంలో జెర్మనీ ఓటమికి అదీ ఒక కారణం. దాన్ని దృష్టిలో ఉంచుకుని 1939 ఆగస్టు నెలలో హిట్లర్ సోవియెట్ యూనియన్ తో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం జెర్మనీకి అవసరమైన చమురు, నిత్యావసర వస్తువులను సోవియెట్లు సరఫరా చేస్తారు. ఇదే ఒప్పందంలో భాగంగా మధ్య ఐరోపాను జెర్మనీ, సోవియెట్ యూనియన్ లు ఉమ్మడిగా ఆక్రమించి పంచుకుంటాయి.

తరువాత: పాశ్చాత్య మిత్ర రాజ్యాలతో జెర్మనీ యుద్ధం