Jump to content

రాహుల్ సాంకృత్యాయన్

వికీపీడియా నుండి
రాహుల్ సాంకృత్యాయన్
రాహుల్ సాంకృత్యాయన్
రాహుల్ సాంకృత్యాయన్ శిల్పం
పుట్టిన తేదీ, స్థలం(1893-04-09)1893 ఏప్రిల్ 9
పందహా గ్రామం, ఆజంగఢ్ జిల్లా, ఉత్తర ప్రదేశ్, బ్రిటీష్ ఇండియా
మరణం1963 ఏప్రిల్ 14(1963-04-14) (వయసు 70)
డార్జిలింగ్, పశ్చిమబెంగాల్, భారతదేశం.
వృత్తిరచయిత, వ్యాసకర్త, పండితుడు, భారత జాతీయవాది, చారిత్రికుడు
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం
రచనా రంగంయాత్రా సాహిత్యం, ఆత్మకథ, చారిత్రాత్మక నవలలు, చరిత్ర గ్రంథాలు, నిఘంటువులు, వ్యాకరణం
సాహిత్య ఉద్యమంబౌద్ధం, మార్క్సిజం, సోషలిజం
గుర్తింపునిచ్చిన రచనలుఓల్గా నుంచి గంగకు
పురస్కారాలు1958: సాహిత్య అకాడమీ పురస్కారం
1963: పద్మ భూషణ్

రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 – 1963 ఏప్రిల్ 14) హిందీ యాత్రాసాహిత్య పితామహుడిగా సుప్రసిద్ధులు. ఆయన బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి, వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారిగా పేరుపొందారు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలలోనే గడిపారు[1]. లోతైన తాత్త్విక చింతన కలిగిన సాంకృత్యాయన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బౌద్ధ భిక్షువుగా మారి అనంతరం మార్క్సిస్ట్ సోషలిస్టుగా పరివర్తన చెందారు[1]. సాంకృత్యాయన్ భారత జాతీయోద్యమంలో కూడా కృషిచేశారు. జాతీయోద్యమానికి అనుకూలంగా, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించారు[1]. విస్తృతమైన అభిరుచులు, లోతైన చింతన, విపరీతమైన సంచార జీవనం వెరసి అపురూపమైన సాహిత్యాన్ని రచించారాయన. 1940వ దశకం ప్రారంభంలో ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి, కమ్యూనిస్ట్‌ పార్టీలో సభ్యునిగా చేరి, జీవితాంతం కమ్యూనిస్ట్‌గా ఉన్నారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్‌లో ఓ రైతు ఉద్యమంలో జరిగిన లాఠీఛార్జిలో ఆయనకు తలపై బలమైన దెబ్బ తగిలిగింది. రాహుల్జీ ఏక సందాగ్రాహి అని, ఆయన టిబెట్‌ భాషనుండి సంస్కృతానికి అత్యంత వేగంగా అనువాదం చెయ్యగలిగేవారనీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు వివరించారు. ఆయన చేసిన రచనలలో, అనువాదాలలో చాలాభాగం ఇప్పటికీ ప్రచురణ కాలేదు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి, వాటిని అనువాదం చేసి, ప్రపంచానికి తెలియపరచటంలో రాహుల్జీ అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైనదిగా గుర్తించారు. ఒక్క భారతదేశంలోనే కాక యావత్‌ ప్రపంచ చరిత్రలోనే అంత ప్రతిభాశీలి, స్వయంకృషితో మహాపండితుడైన వ్యక్తి మరొకరులేరని అనేకులు వ్యాఖ్యానించారు. ఆయన రచనాశైలి సరళంగానూ, సామాన్య పాఠకులకు తాను చెప్పదలచుకున్నది సుళువుగా అర్ధం అయ్యేటట్లుగానూ ఉంటుంది.

బాల్యం

[మార్చు]

బ్రిటిష్‌ పాలనలో, యునై టెడ్‌ ప్రావిన్సెస్‌ (యూపీ) రాష్ట్రంలోని అజామ్‌గఢ్‌ జిల్లాలో 1893 ఏప్రిల్ 9లో సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణ కుటుంబంలో కేదార్‌నాథ్‌ పాండే జన్మించాడు[2].బౌద్ధాన్ని తనలో ఇంకించుకున్నవాడుగా తర్వాత తన పేరును రాహుల్ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నారు. ప్రాథమిక విద్య ఉర్దూ మాధ్య మంలో చదివాడు. చిన్న తనంలోనే తల్లిదండ్రులు మరణిం చటంతో అమ్మమ్మ, తాతల వద్ద పెరిగాడు. తన 11వ ఏట ఒక ఫకీరు పాడిన గేయాన్ని విని, తన మొత్తం జీవితాన్ని ఒక కొత్తదారిలో నడిపానని ఆయన తన ఆత్మకథలో రాసుకున్నాడు.

దునియాకి సైర్‌ కర్‌ కాఫిర్‌

జిందగానీ ఫిర్‌ కహాు

జిందగీ గర్‌ కుచ్‌ రహీతో

నౌజవానీ ఫిర్‌ కహు

(ప్రపంచ పర్యటన చేయరా, మూర్ఖుడా,

జీవితం ఒకేసారి లభిస్తుంది.

ఆ జీవితంలో, యవ్వనం అతి చిన్నది)

గేయం విన్నతరువాత తన రెండు కాళ్లూ ఎప్పుడూ ఒకచోట నిలుపలేదంటాడు ఆయన. కాశీ విద్యాపీఠ్‌లో సంస్కృతం నేర్చుకున్నాడు. ఆర్యసమాజంలో చేరి హిందూమత వ్యాప్తికి కొన్నాళ్లు కృషి చేశాడు. ఆ సమయంలోనే చక్కటి ఉపన్యాసాలు ఇవ్వటం, కొత్త విషయాలు తెలుసుకోవటానికి గ్రంథాలు చదవటం ప్రారంభించాడు.

చదువు

[మార్చు]

తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్. 8వ తరగతి తోనే అతని చదువు ఆగిపోయింది. వేలాది కిలోమీటర్లు కాలినడకన చుట్టివచ్చారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యా... ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూ లాంటి ముప్పైకి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడా అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు.అందుకే ఆయన్ని మహాపండిత్ అనేవారు.

యాత్రా జీవనం

[మార్చు]

ఆయన నిత్యసంచారిగా తన జీవితంలో సగానికి పైగా కాలాన్ని ఇంటికి సుదూరమైన ప్రాంతాలను సందర్శిస్తూ గడిపారు. ఆయన భ్రమణకాంక్ష భారతదేశంలోని లడఖ్, కిన్నౌర్, కాశ్మీర్ వంటి వైవిధ్యభరితమైన ప్రాంతాలకు, విదేశాలైన నేపాల్, టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, ఆనాటి సోవియట్ రష్యా వంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళింది. ఎన్నో ఏళ్ళపాటు బీహార్ రాష్ట్రానికి చెందిన శరణ్ జిల్లాలోని పర్శ గధ్ గ్రామంలో గడిపారు. దానికి గుర్తుగా ఆ గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామ ద్వారానికి రాహుల్ గేట్ అని పేరుపెట్టారు. ప్రయాణించేప్పుడు వీలున్నంత వరకూ ఉపరితల రవాణాపైనే ఆధారపడ్డారు. ఆయన పలు ప్రదేశాల గురించి తెలుసుకునే జిజ్ఞాసతో ప్రయాణించారు. పదమూడో శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచివుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే, ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు. సాంకృత్యాయన్ వాటికోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కాశ్మీర్, లడఖ్, కార్గిల్ మీదుగా టిబెట్ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయిగానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోటి భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు. మరో మూడుసార్లు టిబెట్ వెళ్లారు. టిబెటన్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమేకాదు దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు. టిబెటన్-హిందీ నిఘంటువు కూర్చారు. నాటి సోవియట్‌ యూనియన్‌లోని అనేక రిపబ్లిక్కులలో ఆయన విస్తృతంగా పర్యటించి, సంస్కృతం, పాళీ భాషలో లిఖించబడిన అనేక శాసనాలను, రాతిఫలకాలనూ కనుగొన్నాడు. భారతదేశంలోనూ, నేపాల్‌, హిమాలయ సానువులలోనూ, టిబెట్‌ లోనే కాకుండా ఆయన మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్‌ ఆదిగా అనేక దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. తన యాత్రలో భాగంగా అరుదైన ”కాన్జూర్, టాన్జూర్, గ్రంథాలను కొన్నాడు 130 వర్ణ చిత్రాలు 1600 కు పైగా వ్రాత ప్రతులు సేకరించారు. యాత్రికుడు యుఁవాన్‌ త్స్యాంగ్‌ తర్వాత ఇంత భారీగా సేకరించిన వారెవరు లేరని చరిత్ర కారుల అంచనా.

రచనలు

[మార్చు]

రాహుల్జీ 20 ఏళ్ల ప్రాయం నుంచే ప్రారంభించి సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్సు మీద చరమదశ వరకు 150 పుస్తకాలు రాశాడు. బౌద్ధం మీద లెక్కలేనన్ని పరిశోధనలు చేసిన గొప్ప పరిశోధకుడు.

లాంటివి అందులో కొన్ని.ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం ఓల్గా సే గంగలో క్రీస్తు పూర్వం ఆరువేల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 1942 వరకు ఇండో యూరోపియన్ మానవ సమాజ వికాసాన్ని ఇరవై కథల ద్వారా చిత్రీకరించారు. ఓల్గా సే గంగ, జయ యౌధేయ వంటివి తెలుగులోకి అనువదించారు.

బహుమతులు

[మార్చు]

1958లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1963లో పద్మభూషణ్‌ బిరుదులు లభించాయి[3].

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయనకు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగినా, నిత్య సంచారి అయిన తాను తన భార్యను చాలాఏళ్ల తరువాత ఒకసారి చూసానని తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆయన లెనిన్‌ గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అక్కడి ఇండో-టిబెటన్ విభాగంలో పనిచేస్తూ ఉండిన లోలా (Elena Narvertorna) అనే రష్యన్ యువతి ఆయనను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు ఆమెను భారతదేశంలో స్థిరపడటానికి సోవియట్‌ ప్రభుత్వం ఒప్పుకోకపోవటంతో వారు విడిపోయారు.లోలా వల్ల రాహుల్ జీ కలిగిన కుమారుడు ఇగోర్. ఆ తరువాత 1950 లో ఆయన కమల పెరియార్ అనే నేపాలీ స్త్రీని వివాహమాడి డార్జిలింగ్‌లో స్థిర పడ్డారు.

మరణం

[మార్చు]

1963 ఏప్రిల్ 14లో శ్రీలంకలో ఆచార్యుడుగా పనిచేస్తూ, ఆయన అంతిమ శ్వాస విడిచారు. రిఫరెన్సు పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఈ మహావిజ్ఞాని చివరిరోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోయారు. ఆయన స్మృతి చిహ్నం డార్జిలింగ్‌ నగరంలో బౌద్ధమత పద్ధతిలో నిర్మించబడింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sharma, R.S. (2009). Rethinking India's Past. Oxford University Press. ISBN 978-0-19-569787-2.
  2. Prabhakar Machwe (1 January 1998). Rahul Sankrityayan (Hindi Writer). Sahitya Akademi. pp. 12–. ISBN 978-81-7201-845-0.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.

వనరులు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]