Jump to content

రాష్ట్రాల పునర్విభజన కమిషన్

వికీపీడియా నుండి
(రాష్ట్రాల పునర్విభజన కమీషనన్ నుండి దారిమార్పు చెందింది)

రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) లేదా ఫజల్ అలీ కమిషన్ డిసెంబర్ 29, 1953లో భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులను పున:సమీక్షించడంలో సలహా ఇచ్చేందుకు ఏర్పరిచింది.[1] దాదాపుగా రెండేళ్ళ తర్వాత, 1955లో భారతదేశంలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పరిచేలా సూచిస్తూ నివేదిక సమర్పించింది. పునర్విభజన కమీషన్లో ఫజల్ అలీ, కె.ఎం.పణిక్కర్, హెచ్.ఎం.కుంజ్రూలు ఉన్నారు. కమిషన్ చేసిన సలహాల్లో కొన్నిటిని కేంద్ర ప్రభుత్వం 1956 నాటి రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1956లో పరిగణనలోకి తీసుకుంది.

నేపథ్యం

[మార్చు]
భారతదేశం-రాష్ట్రాలు 1951 నాటి పటం

బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి 1947లో స్వాతంత్ర్యం పొందాకా భారతదేశం ఈ కింది వేర్వేరు కేటగిరీలుగా విభజించివుంది:[2][3]

కేటగిరీ వివరణ కార్య నిర్వాహకుడు రాష్ట్రాలు
పార్ట్ ఎ రాష్ట్రాలు పాత బ్రిటీష్ ఇండియా ప్రావిన్సులు ఎన్నుకున్న గవర్నర్, రాష్ట్ర శాసనసభ 9 రాష్ట్రాలు: అస్సాం, బీహార్, బొంబాయి, తూర్పు పంజాబ్, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్
పార్ట్ బి రాష్ట్రాలు గత సంస్థానాలు లేదా ఒప్పంద రాష్ట్రాల సమూహాలు రాజ్ ప్రముఖ్ (గత సంస్థానాధీశుడు) 9 రాష్ట్రాలు: హైదరాబాద్, జమ్ము అండ్ కాశ్మీర్, మధ్యభారత్, మైసూర్, పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ (పిఈపిఎస్‌యు), రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్-కొచ్చిన్, వింధ్య ప్రదేశ్
పార్ట్ సి గత సంస్థానాలు లేదా ప్రావిన్సులు ముఖ్య కమీషనర్ 10 రాష్ట్రాలు: అజ్మీర్, కూర్గ్, కూచ్-బీహార్, భోపాల్, బిలాస్ పూర్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర
పార్ట్ డి కేంద్రపాలిత ప్రాంతం భారత రాష్ట్రపతి నియమించిన గవర్నర్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు

ఈ రాష్ట్రాల సరిహద్దులు బ్రిటీష్ ఇండియా నుంచి పరంపరగా వచ్చాయి, పరిపాలనకు సులభమైనవి కావు. ఈ రాష్ట్రాల అంతర్గత ప్రావిన్సుల సరిహద్దులు చారిత్రిక ఘటనలు, బ్రిటీష్ వారి రాజకీయ, సైనిక, వ్యూహాత్మక ప్లానింగ్ కు ఫలితంగా ఏర్పడుతూ వచ్చాయి. ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులు పునర్విభజన చేయాలని అంగీకరించినా ఏ ప్రాతిపదికన అన్నది అప్పటికి నిర్ణయం కాలేదు.

భారతదేశంలోని భాషల ప్రాతిపదికన పునర్విభజన జరగాలన్నది ప్రతిపాదనల్లో ఒకటి. ఇది పరిపాలనను సులభం చేయడమే కాక కుల మత ఆధారిత గుర్తింపుల్ని కొంత తక్కువ వివాదాస్పదమైన భాషతో మార్చగలదు. 1920 నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ప్రావిన్సులను భాష ప్రాతిపదికన ఏర్పాటుచేయడానికి కట్టుబడివుంది. 1920ల నుంచి ఏర్పాటుచేసిన కాంగ్రెస్ స్థానిక శాఖలను బ్రిటీష్ ఇండియా పరిపాలనా విభాగాల ప్రాతిపదికన కాక భాషా ప్రాతిపదికనే ఏర్పాటుచేశారు. భారతదేశానికి స్వరాజ్యం లేక స్వాతంత్ర్యం వచ్చాకా రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్విభజిస్తామన్నది కాంగ్రెస్ లక్ష్యాల్లో ఒకటి. ఇది 1945-46 ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీల్లో కూడా చేరింది. ఐతే మతం ప్రాతిపదికన దేశం విభజన కావడం, విభజన సమయంలో మత వైషమ్యాలతో విపరీతమైన రక్తపాతం, హింస చోటుచేసుకోవడం వంటివి భారతదేశపు తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి ఉపప్రధాని, గృహమంత్రి వల్లభ్ భాయి పటేల్ మొదలైన వారిలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుపై వైఖరిలో మార్పు తీసుకువచ్చింది. 1935లో మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటుచేయడాన్ని ఉపేక్షించడంతో చీలిక పెరుగుతూ వచ్చి చివరకు దేశ విభజనకీ, తద్వారీ విపరీతమైన రక్తపాతానికి కారణమైందనీ మరో ప్రత్యేకత అయిన భాష ప్రాతిపదికను ఇప్పుడు అంగీకరిస్తే భారత దేశ ఐక్యతకు మరో సమస్యను తీసుకువచ్చినట్టు అవుతుందనీ వారు దీన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు.[4]
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన అంశాన్ని పరిశీలించమని 1948లో రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఎస్.కె.దార్ (అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి), జె.ఎన్.లాల్ (న్యాయవాది), పన్నాలాల్ (విశ్రాంత భారత సివిల్ సర్వీసెస్ అధికారి)లతో దార్ కమిషన్ ఏర్పాటుచేశారు. కమిషన్ తన నివేదికను సమర్పిస్తూ పూర్తిగా కానీ, ప్రధానంగా కానీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయడం దేశ విస్తృత ప్రయోజనాలకు అనుగుణమైనది కాదన్నారు.[5] రాష్ట్రాలను భౌగోళిక సాన్నిహిత్యం, ఆర్థిక స్వయంసమృద్ధి, పరిపాలనా పరమైన సౌలభ్యం ప్రాతిపదికలుగా పునర్విభజించాలని సూచించారు. జైపూర్ కాంగ్రెస్ లో దార్ కమిషన్ సూచనలను అధ్యయనం చేయడానికి జవహర్లాల్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో జేవీపీ కమిటీ వేశారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు ప్రస్తుతం సరైన సమయం కాదనీ, ఐతే ఒకవేళ ప్రజల సెంటిమెంట్ సమర్థిస్తూ, విపరీతంగా ఉన్నట్టైతే ప్రజాస్వామ్యవాదులుగా దానికి దేశ విస్తృత ప్రయోజనాలకు ఇబ్బందికరం కాని సర్దుబాట్లతోనైనా కట్టుబడాలని తేల్చారు.[6]

మూలాలు

[మార్చు]
  1. పి.పి., రావు (1 January 2001). సామల, రమేష్ బాబు (ed.). "ఏబదేళ్ళ భాషా ప్రయుక్త రాష్ట్రాల సమాఖ్య భారత రాజకీయ వ్యవస్థ సంస్కరణ". నడుస్తున్న చరిత్ర. 9 (1). విజయవాడ: 21, 22.
  2. Showick Thorpe Edgar Thorpe (2009). The Pearson General Studies Manual (1 ed.). Pearson Education India. pp. 3.12–3.13. ISBN 978-81-317-2133-9.
  3. https://web.archive.org/web/20131203013102/http://164.100.47.134/intranet/CAI/E.pdf
  4. గుహ, రామచంద్ర. గాంధీ అనంతర భారతదేశం (in తెలుగు (అనువాదం)). విజయవాడ: ఎమెస్కో బుక్స్.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  5. Virendra Kumar (1976). Committees And Commissions In India Vol. 1 : 1947-54. Concept. pp. 70–71. ISBN 978-81-7022-196-8.
  6. AG Noorani (10–23 April 2010). "Linguism trap". Frontline. 27 (8). = The Hindu. Retrieved 2012-01-03.{{cite journal}}: CS1 maint: extra punctuation (link)