రాణీ దుర్గావతి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
రాణీ దుర్గావతి Rani Durgavati | |
---|---|
గోండుల రాణి | |
జననం | అక్టోబరు 5, 1524 Banda, ఉత్తర ప్రదేశ్ |
మరణం | జూన్ 24, 1564 Narai Nala, జబల్పూర్, మధ్య ప్రదేశ్ India |
Spouse | దల్‌పత్ షా |
మతం | గోండు |
పదునారవ శతాబ్దమునకు చెందిన బుందేల్‌ఖండు సంస్థానములో ప్రసిద్ధికెక్కిన రాజులలో మొదటివాడైన చందవేల్ గోండ్ రాజుగారి కుమార్తె దుర్గావతి[1] (జ: 1524 - మ: 1564).
వివాహము
[మార్చు]రాణి దుర్గావతి 1524 అక్టోబరు 5న ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలోని కలింజర్ కోటలో జన్మించింది. ఆమె తండ్రి పేరు రాజ కీరత్ రాయ్, తల్లి పేరు కమలవతి (అగర్వాల్, 1990; మిశ్రా, 2008a) కొందరు చరిత్రకారులు దుర్గావతి తండ్రి రహత్‌ఘర్‌కు చెందిన మహారాజా సల్భన్ (శాలివాహన్) అని చెప్తారు, అతను చాలా శక్తివంతమైన గోండ్ రాజు. మధ్య భారతంలో సుదీర్ఘకాలం పాలించారు. నేటికీ రాహత్ ఘర్ కోట యొక్క అవశేషాలు భోపాల్ సాగర్ హైవే గుండా వెళుతున్నప్పుడు చూడవచ్చు (ముని లాల్, 1980).
వివాహ సమయానికి, దల్పత్ షా వయస్సు 25 సంవత్సరాలు, యువరాణి దుర్గావతి వయస్సు 18 సంవత్సరాలు. వారిద్దరి వివాహం 1542లో సింగోరఘర్ కోటలో కోయ పుణెం (గోండి పద్ధతి) ద్వారా పూర్తయింది. ఈ కోటలో, 1545 సంవత్సరంలో, రాణి దుర్గావతి తన బిడ్డకు జన్మనిచ్చింది, అతనికి వీర్ నారాయణ్ (వీరాస) అని పేరు పెట్టారు. రాజా సంగ్రామ్ షా 1543 సంవత్సరంలో ఈ కోటలో మరణించాడు, తరువాత అతని పెద్ద కుమారుడు దల్పత్ షా కూడా 1550లో కేవలం 33 సంవత్సరాల చిన్న వయస్సులో ఈ కోటలో మరణించాడు. పెళ్లయిన 8 సంవత్సరాలకే రాణి దుర్గావతి వితంతువు అయింది. దల్పత్ షా మరణించే సమయానికి, అతని కుమారుడు వీర్ నారాయణ్ వయస్సు కేవలం 5 సంవత్సరాలు (మిశ్రా, 2008 బి) మామగారు సంగ్రామ్ షా, భర్త దల్పత్ షా మరణం కారణంగా, మొత్తం గర్హా రాజ్యం యొక్క పాలన రాణి దుర్గావతిపై పరిపాలన బాధ్యత పడిపోయింది.
కొంతమంది చరిత్రకారులు ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి, గోండులను కించపరచడానికి రాణి దుర్గావతిని రాజపుత్ అని పిలుస్తారు, అయితే గోండులలో కులాంతర వివాహాలు జరగవు, కాబట్టి ఇంత గొప్ప మహనీయుడైన రాజు సంగ్రమ్ షా తన కొడుకును రాజపుత్ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరగదు . భారతీయ బ్రాహ్మణవాద మనస్తత్వానికి చెందిన రచయితలు, చరిత్రకారులు రాణి దుర్గావతి పూర్తిగా నిరాధారమైన సగం అసంపూర్ణ సమాచారం ఆధారంగా రాజపుత్ అని ప్రకటిస్తూ వస్తున్నరు. రాణి దుర్గావతి, కోయితుర్ గోండ్ ల శాఖ, చందేల్ వంశం కోయితుర్‌కు గోండ్ తెగకు చెందినది, దీని టోటెమ్ (చిహ్నం) ఒక కుందేలు,, ఆమె తండ్రి పేరు కీరత్ రాయ్. రాణి దుర్గావతి మహోబా (బీలే & కీనే, 1894) రాజు కుమార్తె అని స్పష్టంగా పేర్కొంటున్న యాన్ ఓరియంటల్ బయోగ్రాఫికల్ డిక్షనరీలో దీనికి ఆధారాలు ఉన్నాయి.
రాజ్యపాలనం
[మార్చు]దుర్గవతి యొక్క గోండ్వన రాజ్యం అప్పుడు రాజ్యపాలనమంతయు దుర్గావతిమీద బడినందున నామె తన కుమారుని సింహాసనాధీశు జేసి, యతని పేరిట తానే రాజ్యము జేయజొచ్చెను. ఆమె తన పెనిమిటివలెగాక, మిగుల దక్షతతో, న్యాయముతో, రాజ్యపరిపాలనము జేయుచు బ్రజలను సంతోష పెట్టుచుండెను!
ఇట్లు తనప్రజలను సుఖపెట్టుచు, పర రాజులతో వైరము లేక ఐదారు సంవత్సరములు రాణీగారు రాజ్యము చేసి నతరువాత, మొగలాయి రాజైన అక్బరు బాదుషా ఆమె కీర్తివిని, యిట్టి రాజ్యము పరిపాలించెడి రాణి మనకు సంకితురాలుగా నుండవలయునని నిశ్చయించెను. ఇట్లుతలచి యక్బరు ఆసఫ్ ఖాన్ అను ప్రసిద్ధవీరుని 1564 వ సంవత్సరమున దుర్గావతి రాజ్యముపైకి బంపెను!
అక్బరు సైన్యంతో యుద్ధం
[మార్చు]తనపై దండెత్తి వచ్చు చున్నాడన్నమాట విని, దుర్గావతి భయపడక, మహా థైర్యముతో యుద్ధమునకు సిద్ధము చేయసాగెను. మహా ప్రయత్నముచేసి కొద్దికాలములోనే 500 కరులను 5000 తురంగములను, గొప్ప కాల్బలములను సిద్ధపరచెను. తాను పురుషవేషము ధరించి, ఆయుధములను బుచ్చుకొని, ఏనుగుపై నెక్కి ప్రత్యక్షదుర్గవలె యుద్ధభూమికి వెడలెను! ఆమెనుజూచి సైనికుల కందరికిని ఉత్సాహము గలిగి వారిశౌర్యము మినుమడియై వారు శత్రుసైన్యముపై నడరి యతిధూర్తు లగు యవన సైనికుల ననేకుల రూపుమాపి, మరునాడా సేనాధిపతిని యమ సదనమున కనుప నిశ్చయించిరి. కాని, డిల్లీశ్వరునిచే మహావీరుడని ప్రఖ్యాతిని గాంచిన ఆసఫ్‌ఖాన్ కొద్దిసైన్యముతో నీమెను జయించుట దుస్తర మని తెలిసికొని, మరునా డింకను సైన్యమును గూర్చుకొని, తమవద్దనున్న ఫిరంగిలన్నియు నగ్రభాగమునందుంచి, గోండు సైనికులపై నకస్మాత్తుగా వచ్చి, తన సామర్థ్యమంతయుజూప, వారు చీకాకుపడి శత్రువుల మార్కొన శక్తులు కాకయుండిరి. ఇట్టి దురవస్థజూచి, దుర్గావతీ కుమారుడల్పవయస్కు డయ్యును, అభిమన్యు కల్పుడుగానతాను ముందై వెరవవలదని సైనికులకు ధైర్యమిచ్చి, శత్రువులను మార్కొనెను. ఇట్లు కొంతసేపు మహాధైర్యముతో బోరాడి యాబాలశూరుడు బాణఘాతముచే మూర్ఛిల్లెను. అప్పుడు సైనికు లందరు చింతాక్రాంతులై యాదు:ఖవార్త యింకొకవైపున తురకలను మర్దించుచున్న దుర్గావతికి దెలియజేసిరి. ఆమాటవిని, దు:ఖించుట కది సమయము కాదనియెంచి రాణీగారిసుమంతైనను జలింపక పుత్రవాత్సల్యమును ఆపి, తనసేనాధిపతికి నిట్లు వర్తమానము చేసెను. "ఈసమయము ధైర్యమును వదలి దు:ఖించుచు కూర్చుండ తగినదికాదు. శత్రుహననము మన ముఖ్యకర్తవ్యము. ఈశ్వరేచ్ఛ వలననైన కార్యమునకు వగవ పనిలేదు. కాన పిల్లవానిని శిబిర మునకు గొనిపోయి తగిన యుపచారములు చేయుడు. నేనిప్పుడు యుద్ధమును విడిచి వచ్చుటకు వీలులేదు. రణయజ్ఞము సమాప్తముచేసి, ప్రాప్తియున్న మరల జూచెదను." ఈయనుజ్ఞ ప్రకారము సైనికులు కార్యమును జరిపిరి.
యుద్ధమునందు గొంతసేపు వారికి జయమును, కొంతసేపు వీరికి జయమును గలుగుచు; తుద కెవరు గెలుతురో నిశ్చయించుటకు వీలులేకయుండెను. ఇట్లు కొంతసేపు వుభయపక్షముల సమానముగా యుద్ధముజరిగి, అది హిందువుల స్వాతంత్ర్య నాశన కాలముగాన, తురుష్కులకే యాధిక్యము వచ్చెను. గోండుసైనికులు పోరాడిపోరాడి, ఉత్సాహహీనులైరి. గోండులెట్లెట్లె ఉత్సాహహీనులైరో, అట్లట్లు మ్లేచ్ఛుల బలము హెచ్చుచుబోయెను. తమరాజ్యమును గోండుదేశమునందు స్థాపించవలె నన్న దృఢేచ్ఛ గలవారు గనుక 'దీన్‌దీన్' అను రణశబ్దముచ్చరించుచు ఘోరముగా గోండు సైన్యములను దెగటార్చిరి.ఇట్లుభయకంరయిన హననయజ్ఞము జరుగగ, మూడువందల సైనికులతోడ దుర్గావతిరాణి మాత్రము బ్రతికి భయంకరముగా బోరాడుచుండెను. ఆమెను మార్కొనుటకు ఆసఫ్‌ఖాన్ దుర్గావతివద్దకి స్వయముగా వచ్చెను. కాని యామె రౌద్రమునుజూచి భయమంది, దూరముపోయి, అటనుండి యామెపై బాణవర్షమును గురిపించదొడగెను. ఆమెయాబాణముల నన్నిటిని దునిమెను. కానియందొక బాణము శిరస్సునందు గ్రుచ్చుకొనగా నామె మరింత క్రోధాయమానమానసయై, ఆ బాణమును తానె పెరికివైచి, మరింత రౌద్రముతోయుద్ధము చేయ సాగెను! అప్పు డామె శరీరమంతయు రక్తమయమైన సంగతి చూచి, ఆమె డస్సినదని తెలిసికొని, స్వామిభక్తిగల యొక సేవకుడు డామెను సమీపించి యిట్లనియె. "అమ్మా! మీరిక యుద్ధమును జేసినందువలన లాభమేమియు లేదు. కొద్దికాలములోనే శత్రువులు మిమ్ము చెరబెట్టగలరు. వారిచేతులలో బడక శీఘ్రముగా నిచ్చటనుండి పలాయనము చేయుట మేలు; తమకొక యిబ్బందిలేక నేను ఆవలకు దీసికొనిపోయెదను." ప్రియ సేవకుడు పలికిన యీ వచనములు విని, ఆమె చింతించి, శత్రువులు నిజముగా సమీపించుచున్నారని చూచి, పవిత్రమైన దేహము మ్లేచ్ఛులచే నపవిత్రమగునన్న మాటమాత్రము తలపునకు రాగా సహింపలేక, మ్లేచ్ఛులామెను సమీపించుట గని, తన ఖడ్గమునకు మ్రొక్కి దానితో దనంతట దానే పొడుచుకొని రణభూమియందే ప్రాణములు విడిచెను!!! రాణీగారి శవము మ్లేచ్ఛులచే బడకుండ నామె సేవకుడు భద్రపరచి, తానును యుద్ధముచేసి యచటనే మృతుడయ్యెను! రాణీగారి కుమారుడును పరలోకగతుడయ్యెను. ఇట్లొక తురకబాదుషాయొక్క రాజ్యలోభముచేత గోండు సంస్థానములోని నిరపరాధులగు లోకులందరు హతులైరి.
దుర్గావతి సమాధి
[మార్చు]ఈ రణ శూరయైన దుర్గావతి యొక్క సమాధి జబ్బలపురమువద్ద నున్నది. ఆ సమాధియొద్దనే ఈమె గుణవర్ణనాత్మకమైన శిలాశాసనము ఉంది. అచ్చటికి వెళ్లిన బాటసారు లందరును ఆ సమాధిని మహాభక్తితో జూచి, ఈ శూరనారినిగురించి పూజ్యభావమును వహించెదరు. బరమ ధార్మికుడయిన యొక బాటసారి యిందును గురించి యిట్లు వ్రాసియున్నాడు. "దుర్గావతి యొక్క సమాధి యా పర్వతదేశమునందు నిర్మించబడింది. అచ్చట రెండు పాషాణస్తంభంబులున్నవి; వానిని జూడగానే వెనుక జరిగిన యుద్ధము మూర్తివంతముగా గనుల యెదుట గానబడును. ఆ గిరిశిఖరముమీద నిప్పటికిని భయంకరమైన రణ ఘోషము రాత్రిపూట వినవచ్చునని అచ్చటిలోకులు నమ్మెదరు. నిర్జనమయ్యును, రమణీయమగు నీ స్థలమునకు వచ్చెడి బాటసారులు ప్రేమపూర్వకముగా రాణీగారి సమాధిని దర్శింతురు. ఆమె పరాక్రమశ్రవణముచే విస్మయచిత్తులయి నానందములో నామె సమాధిని బూజించెదరు. ఆ స్థలమునందు బ్రకాశమానము లయిన గాజుతునకలనేకములున్నవి. ఆగాజుతునకలే రాణీగారికి బాటసారులర్పించెదరు.
ప్రస్తుత జ్ఞాపకాలు
[మార్చు]- 1983 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ విశ్వవిద్యాలయాన్ని రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది.[2]
- భారత ప్రభుత్వం రాణి దుర్గావతి స్మారకంగా ఆమె మరణించిన 1988 జూన్ 24 తేదీన ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది.[3]
- జబల్పూర్, జమ్మూతావీ మధ్య నడిచే రైలుబండికి దుర్గావతి ఎక్స్‌ప్రెస్ (11449/11450) పేరు పెట్టారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ రాణీ దుర్గావతి (1935). భండారు అచ్చమాంబ రచించిన అబలా సచ్చరిత్ర రత్నమాల. కొమర్రజు వినాయకరావు. pp. 47–55.
- ↑ "రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయ, జబల్పూర్, మధ్యప్రదేశ్". Archived from the original on 2016-11-19. Retrieved 2015-05-29.
- ↑ "IndianPost". 1988-06-24.
- ↑ "11450 జమ్మూతావి-జబల్పూర్ (దుర్గావతి) ఎక్స్‌ప్రెస్". Indianrail info.