రాజా రాణి
రాజా రాణి | |
---|---|
దర్శకత్వం | అట్లీ |
రచన | అట్లీ |
నిర్మాత | ఏ.ఆర్. మురుగదాస్, ఎస్.షణ్ముగం |
తారాగణం | ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీం, సత్యరాజ్, సంతానం |
ఛాయాగ్రహణం | జార్జి సి. విలియమ్స్ |
కూర్పు | ఆంటోని ఎల్. రూబెన్ |
సంగీతం | జి.వి. ప్రకాష్ కుమార్ |
నిర్మాణ సంస్థలు | ఏ.ఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్, ది నెక్స్ట్ బిగ్ ఫిల్మ్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
విడుదల తేదీ | మార్చి 14, 2014 |
భాష | తమిళ |
ఏ.ఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్, ది నెక్స్ట్ బిగ్ ఫిల్మ్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పతాకాలపై ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్, ఎస్.షణ్ముగం నిర్మాతలుగా మరో ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అట్లీ దర్శకత్వంలో తెలుగులోకి విడుదలయిన అనువాద చిత్రం "రాజా రాణి". తమిళంలో అదే పేరుతో నిర్మించిన ఈ సినిమాలో ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీం కథానాయక-నాయికలుగా నటించగా సత్యరాజ్, సంతానం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతదర్శకుడిగా, జార్జి సి. విలియమ్స్ ఛాయాగ్రాహకుడిగా, ఆంటోని ఎల్. రూబెన్ ఎడిటర్ గా పనిచేసారు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో మార్చి 14, 2014న భారీగా విడుదలయ్యింది.[1]
కథ
[మార్చు]ప్రేమలో ఓడిపోయాక కూడా జీవితం ఉంటుందన్న పాయింటుతో గతంలో మణిరత్నం తెరకెక్కించిన మౌనరాగం సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. తన స్నేహితుడు సారథి (సంతానం) బలవంతం మీద జాన్ (ఆర్య), తన తండ్రి జేమ్స్ (సత్యరాజ్) సంతోషం కోసం రెజీనా (నయనతార) ఒకరికొకరు ఇష్టం లేకపోయినా పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకుని కొత్త ఫ్లాట్లో అడుగుపెట్టిన ఆ దంపతులకి ఒక్క క్షణం కూడా పడదు. ఇద్దరూ ఉద్యోగస్తులే. రోజూ రాత్రి జాన్ కావాలని తాగి ఇంటికి వచ్చి రెజీనాని ఇబ్బంది పెట్టడం, వాళ్ళుండే అపార్ట్మెంట్ సెక్రెటరీతో సహా అందరూ జాన్ పై ఫిర్యాదులు రెజీనాకు చెప్పడం రీజీనాని ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. విదేశాల్లోని తమ కంపెనీకి ట్రాన్స్ఫర్ కోసం రెజీనా దరఖాస్తు చేస్తుంది. ఈ చర్య జాన్ పై ఎలాంటి ప్రభావం చూపదు.
ఒక రాత్రి పరిస్థితులు చెయ్యి దాటాక రెజీనా మూర్చ బారీన్ పడి ఫిట్స్ తో బాధపడుతుంటే కేవలం మానవత్వంతో జాన్ తనని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అక్కడ ఫిబ్రిలేటర్ ద్వారా రెజీనాని మామూలు స్తిథికి తీసుకొస్తారు. డాక్టర్ సలహా మేరన జాన్ ఇదివరకెప్పుడైనా ఫిట్స్ వచ్చాయా అని రెజీనాని అడిగితే రెజీనా ఒక్కసారి వచ్చాయని, అందుకు కారణం ఏంటని జాన్ అడిగాక రెజీనా సూర్య అని చెప్తుంది. ఆ తర్వాత తన గతం జాన్ తో పంచుకుంటుంది. ఎంబీఏ చదువుకునే రోజుల్లో రెజీనా సూర్య (జై) అనే కాల్ సెంటర్ ఎంప్లాయీతో తన సిం బ్లాక్ గురించి మాట్లాడుతూ గొడవ పెట్టుకుంటుంది. తన ఫ్రెండ్స్ అందరి చేతా ఫోన్ చెయ్యించి సూర్యని ఏడిపిస్తుంది. భయస్తుడయిన సూర్య ఇంకా భయపడిపోయాక రెజీనా తనకి క్షమాపణ చెప్తుంది. ఆపై ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాక ప్రేమలో పడతారు. సూర్య తండ్రి బలరామ మూర్తి ఒక పోలీస్ అధికారి. చాలా కఠినమైన వ్యక్తి. అందుకే వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. అందుచేత ఇద్దరూ రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళిచేసుకోవాలనుకుంటారు. రెజీనా రిజిస్టర్ ఆఫీసుకి వస్తుంది కానీ క్యాబిన్ క్రూ ట్రెయినింగ్ కోసం బలరామ మూర్తి బలవంతం మీద అమెరికాకి వెళ్తాడు. కూతురి స్నేహితుడిలా ఉండే రెజీనా తండ్రి జేమ్స్ రెజీనా బాధపడటం చూసి తట్టుకోలేక గుండెపోతుకు గురౌతాడు. అమెరికాకి వెళ్ళాక సూర్య ఆత్మహత్య చేసుకున్నాడని సూర్య స్నేహితుడు అయ్యప్ప చెప్పాక రెజీనా ఫిట్స్ బారిన మొదటిసారి పడుతుంది. ఆపై మూడేళ్ళ తర్వాత జేమ్స్ సంతోషం కోసం రెజీనా జాన్ ని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకుంటుంది.
ఇదంతా విన్న జాన్ కి రెజీనా పై గౌరవం పెరుగుతుంది. తన ఫోన్ నంబర్ తీసుకుని వెళ్ళిన జాన్ సమయానికి మందులు వేసుకున్నారా అని కనుక్కోవడానికి రెజీనాకి ఫోన్ చేస్తుంటాడు. రెజీనా డిస్చార్జ్ అయ్యే రోజు జాన్ అక్కడికి వెళ్ళి డబ్బు కడతానంటే రెజీనా జాన్ పై నిప్పులు చెరుగుతుంది. నాపై నీకే హక్కుందని మందులు వాడావా అని ఫోన్ చేసావని, ఫోన్ నంబర్ వాచ్ మెన్ కి కూడా ఇచ్చానని నటుంది. నేనూ వాచ్ మెన్ ఒక్కటేనా అని జాన్ అడిగితే ఇంకోసారి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యద్దని అందరి ముందూ అవమానించి తన స్నేహితురాలిని తీసుకుని వెళ్ళిపోతుంది. జాన్ సారథితో తన బాధను చెప్పుకుని ఏడ్చాక ఇద్దరూ మందు కొడతారు. మందు కొట్టిన తర్వాత సారథి జాన్ ఫ్లాట్ కి వెళ్ళి అక్కడ రెజీనాతో జాన్ గతం గురించి చెప్తాడు. జాన్ కీర్తన (నజ్రియా నజీం) అనే ఓ అనాథను ప్రేమించాడు. అందరితో సరదాగా హుషారుగా ఉండే కీర్తన ఎన్నో రోజుల తర్వాత జాన్ ప్రేమని స్వీకరిస్తుంది. వాళ్ళ జీవితాలు హాయిగా సాగుతున్నప్పుడు జాన్ కీర్తన పుట్టినరోజున గుడికి తీసుకెళ్ళి అక్కడ తనని పెళ్ళి చేసుకుంటాడు. ఆ రాత్రి కీర్తనను తన ఇంట్లో దింపేసి రూముకి వెళ్తాడు జాన్. మరుసటి ఉదయం హైవేపై ఉన్నప్పుడు సారథికి తన పెళ్ళి విషయం జాన్, కీర్తనలు చెప్తారు. ఇంతలోనే రోడ్ దాటి వస్తున్న కీర్తనని కారు గుద్దటంతో బాగా గాయపడి చనిపోతుంది. నాలుగేళ్ళుగా పిచ్చివాడిలా కీర్తన జ్ఞాపకాల్లో మిగిలిన జాన్ సారథి బలవంతం మీద రెజీనాని పెళ్ళి చేసుకుంటాడు.
ఇదంతా విన్నాక రెజీనాకి జాన్ పై ఇష్టం కలుగుతుంది. గౌరవం పెరుగుతుంది. కొన్నిరోజుల తర్వాత నిద్రపోతున్న జాన్ ని లేపి కాఫీ ఇచ్చి రెజీనా హాల్ లోకి వెళ్తుంది. ఆనందంగా భయిటికొచ్చిన జాన్ అక్కడ జేమ్స్ ని చూసాక రెజీనా ప్రవర్తనంతా నాటకమనుకుంటాడు జాన్. ఆరోజు జాన్ పుట్టినరోజు కావడంతో సారథి, అపార్ట్మెంట్ జనాలు ఇంటికి వస్తారు. పార్టీ అయిపోయాక జేమ్స్ జాన్ ని ఎప్పుడైనా రెజీనా నీకు బీర్ కొనిచ్చిందా అని అడుగుతాడు. ఎందుకు అని అడిగితే జేమ్స్ రెజీనా ఏదయినా పనిచేయించుకోవాలనుకుంటే తనకి బీర్ కొనిచ్చేదని, అలాగే నీకు కూడా ఇచ్చిందా అని జాన్ ని అడుగుతాడు. జాన్ లేదంటాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గిఫ్ట్ తెరవమని రెజీనా ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ తీసుకుని గదిలోకెళ్ళిన జాన్ ఆ కానుకని విసిరి పారేయడం జేమ్స్ చూస్తాడు. కానీ మాట్లాడకపోగా వెళ్తూ వెళ్తూ జాన్ కి కృతజ్ఞతలు చెప్పి వెళ్తాడు. కిందకి వెళ్ళాక రెజీనాతో "నువ్వు నా ముందు నటించడం ఓకే. జాన్ ఎందుకు నటించాలి? ఇదే నీ ఇల్లు, ఇదే నీ లైఫ్. ఆలోచించు" అని చెప్పి వెళ్ళిపోతాడు. జాన్ ని ప్రేమిస్తున్న రెజీనా తనకి రెండేళ్ళు ఆస్ట్రేలియాకి ట్రాన్స్ఫర్ వచ్చిందని తెలుసుకుంటుంది. రెజీనాని ప్రేమిస్తున్న జాన్ మాత్రం రెజీనా తననుంచి విడాకులు కోరుకుంటోందని భావించినప్పుడు తన బాస్ హెన్రీ (రాజేంద్రన్) నీ ప్రేమ విషయం రెజీనాకి చెప్పమంటాడు.
ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళిన జాన్ రెజీనాకి వచ్చిన పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ పార్సిల్లో పాస్పోర్ట్, ఆస్ట్రేలియాకి టికెట్ చుస్తాడు. తాగకుండా ఇంటికెళ్ళిన జాన్ ని చూసి రెజీనా ఆశ్చర్యపోతుంది. బీర్ తాగుతారా అని అడిగి అపార్ట్మెంట్ టెర్రర్స్ మీదకి తీసుకెళ్తుంది. బీర్ తాగుతున్నప్పుడు జేంస్ మాటలు గుర్తొచ్చాక జాన్ రెజీనా మాట్లాడేలోపే మీకు నేను విడాకులిస్తానని అంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలనుకున్న రెజీనా ఏం మాట్లాడాలో తెలియక పెట్టెలో బట్టలు సద్దుతూ కింద పడి ఉన్న కానుకని పెట్టెలో పెడుతుంది. పొద్దున్నే విమానాశ్రయానికి వెళ్తారు ఆ ఇద్దరు. అక్కడ ఇమ్మిగ్రేషన్ కౌంటరులో సూర్యను చూసి ఆశ్చర్యపోయిన రెజీనా జాన్ ని ఎంట్రన్స్ దగ్గర కలవమంటుంది. ప్రేమిస్తున్నాని చెప్తుందేమో అని పరిగెత్తుకు వెళ్ళిన జాన్ సూర్య బ్రతికే ఉన్నాడని తెలిసి తనతో మాట్లాడటానికి వెళ్తాడు. అప్పుడు సూర్య తనకి పెళ్ళైందని, ప్రేమలో ఓడిపోయాక కూడా లైఫ్ ఉంటుందని, రెజీనాతో హాయిగా బ్రతకమని చెప్పి వెళ్ళిపోతాడు.
తిరిగొచ్చాక రెజీనా జాన్ ని కొట్టి చెప్పేది వినవెందుకని, సూర్య బ్రతికున్నాడని చెప్పగానే మాట్లాడటానికి వెళ్ళావు, అసలిలా ఎవరయినా చేస్తారా అని తిట్టి విమానాశ్రయం నుంచి బయటికి వెళ్తూ వెళ్తూ "ఈ గిఫ్ట్ ని నువ్వు ఆ రోజే తెరిచుంటే ఇంత దూరం వచ్చేది కాదు" అని చెప్పి కానుకు విసిరి వెళ్ళిపోతుంది. అది తెరిచి చూస్తే అందులో ఓ హార్ట్ సింబల్ పిల్లో పై "లెట్స్ బిగిన్ అవర్ లైఫ్" (మన జీవితాన్ని మొదలుపెడదాం రా) అని రాసుంటుంది. వెంటనే జాన్ రెజీనా దగ్గరికి వెళ్ళి తన ప్రేమని తెలియజేయడం, ఒకరినొకరు సంతోషంగా విమానాశ్రయంలో కౌగిలించుకోవడం జరుగుతుంది. కొన్నాళ్ళకి ఆ జంటని తన పెళ్ళికి రమ్మని సారథి పెళ్ళి సుభలేఖ ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది.
- ↑ "సంచలన చిత్రం రాజా రాణి 14న విడుదల". ఆంధ్రప్రభ. March 10, 2014. Retrieved March 23, 2014.[permanent dead link]
- ↑ Krishna, gopala. "Raja Rani". Archived from the original on 2024-03-14. Retrieved 2024-03-14.