Jump to content

రఘుపతి వేంకటరత్నం నాయుడు

వికీపీడియా నుండి
(రఘుపతి వెంకటరత్నం నుండి దారిమార్పు చెందింది)
రఘుపతి వెంకటరత్నం నాయుడు
జననం(1862-10-01)1862 అక్టోబరు 1
మరణం1939 మే 26(1939-05-26) (వయసు 76)
వృత్తివిద్యావేత్త, సంఘసంస్కర్త

రఘుపతి వెంకటరత్నం నాయుడు ( అక్టోబరు 1, 1862 - మే 26, 1939) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా భారతదేశంలోని తెలుగు ప్రాంతాలలో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.[1][2][3].

జీవిత విశేషాలు

[మార్చు]
రఘుపతి వేంకటరత్నం నాయుడు, (హైదరాబాదు, టాంక్ బండ్ పైన గల విగ్రహం)

రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1 న మచిలీపట్నంలో తెలగ నాయుళ్ళ ఇంట జన్మించాడు.[4] తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి హైదరాబాదు బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాల గురించి పట్టించుకోరాదు అనే వారామె.

ఎం.ఏ. కాగానే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసాడు. 1904లో కాకినాడ లోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు.[5] 1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు.[6] 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు[7]. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసాడు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు.[8][9] 1927లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.

1884లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడుకు పెళ్ళయింది. 1889లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఆయనను శ్వేతాంబర ఋషి అనేవారు. పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు.

1939 మే 26న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు. ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - వేమూరి రామకృష్ణారావు జంటని తప్పకుండా చెప్పుకుంటారు. ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన రఘుపతి వెంకయ్య నాయుడు ఈయన సోదరుడు.

సంఘ సంస్కరణ

[మార్చు]

దేశ రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాలు మరొకవైపు ఆవరించి, సమాజం అంధకార బంధురమై - ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్సనం కోసం ఎదురుచూస్తున్న రోజులు 19 శతాబ్దపు ఆఖరి దశాబ్దాలు. సరిగ్గా అట్టి తరుణంలో సంఘంలో నైతిక ధార్మిక విద్యారంగాలను దేదీప్యమానం చేసినవి రెండు దివ్యజ్యోతులు. తమ దార్శనికతతో, చైతన్యంతో ఆంధ్రదేశాన్ని పునీతం చేసి పునరుజ్జీవింపచేసిన నవయుగ వైతాళికద్వయం శ్రీ వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకతరత్నం నాయుడు గారు. ఇందు సర్వతోముఖ సంఘసంస్కరణకు ఆధ్యాత్మిక నవజీవనానికి వసుధైక కుటుంబభావనకు పునాదులు వేసి జీవితాంతం కృషి చేసినవారు శ్రీ వేంకటరత్నం నాయుడు గారు. వీరు ప్రాక్పశ్చిమ విచారధారకు పవిత్రవారధియై, దీనబాంధవుడై, దాతయై, త్రాతయై, కులపతియై, సమాజాన్నే సాధనక్షేత్రంగా, విద్యాలయాలే తపోనిలయాలుగా చేసుకున్న కర్మయోగి. అందుకే ఆయనను అఖిలాంధ్రదేశము భక్తిప్రపత్తులతో బ్రహ్మర్షి అని సంభావించినది.

150 వ జయంతి సందర్భంగా ఎమెస్కో బుక్స్ ప్రచురించిన పుస్తకంలోని వివరం

మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, కాకినాడలో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు[10]. మద్యనిషేధం కొరకు శ్రమించాడు. 1923లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు[11]. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్ అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు.

బిరుదులు

[మార్చు]

రఘుపతి వెంకటరత్నం నాయుడు వివిధ రంగాల్లో ఆయన కృషికి గుర్తింపుగా చాలా పురస్కారాలు, బిరుదులు లభించాయి. వాటిలో కొన్ని:

  • బ్రహ్మర్షి
  • శ్వేతాంబర ఋషి
  • అపర సోక్రటీసు
  • కులపతి
  • దివాన్ బహదూర్
  • కైజర్-ఇ-హింద్
  • సర్

వనరులు

[మార్చు]
  • అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు

మూలాలు

[మార్చు]
  1. "Wikisource link to రఘుపతి వెంకటరత్నం నాయుడు". Wikisource link to సుప్రసిద్ధుల జీవిత విశేషాలు. వికీసోర్స్. 1994. 
  2. Essays on Social Reform Movements edited by Raj Kumar. 2004. pp. 310–11.
  3. Rāyẏa, Niśītha Rañjana (1984). Public associations in India. Institute of Historical Studies. p. 347. OCLC 13671846.
  4. Rao, P. Raghunatha (1983). History of modern Andhra. Sterling Publishers. p. 186. ISBN 978-0-86590-112-4.
  5. "Fulfilment is his reward". The Hindu. 16 December 2002. Archived from the original on 21 మార్చి 2004. Retrieved 4 January 2010.
  6. "రఘుపతి వేంకటరత్నం నాయుడు". Itihas. 12. Government of Andhra Pradesh: 24. 1984.
  7. "Tributes paid to educationist". The Hindu. 2 October 2009. Archived from the original on 6 అక్టోబరు 2009. Retrieved 4 January 2010.
  8. Kumar, A. Prasanna (1978). Dr. B. Pattabhi Sitaramayya: a political study. Andhra University Press. p. 13. OCLC 5414006.
  9. The London Gazette, 29 August 1924
  10. Anjaneyulu, D. (1976). Kandukuri Veeresalingam. Ministry of Information and Broadcasting. p. 151. OCLC 3849181.
  11. Subbamma, Mallādi (1994). Women's movement and associations: regional perspective, 1860-1993. Booklinks. p. 14. ISBN 978-81-85194-30-1.

బయిటి లింకులు

[మార్చు]