Jump to content

రక్త దానం

వికీపీడియా నుండి
అమెరికాలో రక్తదానం చేస్తున్న నావికాదళం సభ్యుడు.

రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. చేసిన దానం సవ్యంగా వెచ్చించబడుతోందా, దుర్వినియోగం పాలవుతోందా అనే అనుమానం ఉండటం సహజం. దుర్వినియోగం అంటే మనం దానం చేసిన రక్తాన్ని కుళ్ళబెట్టి పారెయ్యడమయినా కావచ్చు లేదా నల్ల బజారులో అమ్మకానికి పెట్టినా పెట్టొచ్చు.

అవసరం

[మార్చు]

ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ రక్త చందురం (hemoglobin) ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటే తక్కువ రక్తచందురం ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు.

ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడా కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే ఉరమరగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి (patient) శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించినవాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రోగి స్వంత రక్తాన్నే ఎంత వీలయితే అంత గొట్టాల ద్వారా పట్టి, కూడగట్టి, శుద్ధి చేసి, తిరిగి వాడతారు.

రక్తాన్ని నిల్వ చెయ్యటం

[మార్చు]

దానం చేసిన రక్తాన్ని అప్పటికప్పుడు, అక్కడికక్కడ వాడుకోవటం కష్టం. కనుక రక్తాన్ని ఏదో ఒక విధంగా నిల్వ చెయ్యాలి. రక్తాన్ని యధాతధంగా నిల్వ చెయ్యటం శ్రేయస్కరం కాదు; అందుకని రక్తంలో ఉన్న భాగాలని విడగొట్టి ఏ భాగానికా భాగాన్ని విడివిడిగా నిల్వ చేస్తారు. ఉదాహరణకి ఎర్ర కణాలని విడగొట్టి బీరువాలో నిల్వ చేస్తే 42 రోజులపాటు పాడు కాకుండా ఉంటాయి. అవే ఎర్ర కణాలని చల్లబరచి, గడ్డకట్టిస్తే 10 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. రసిని చల్లబరచి, గడ్డకట్టిస్తే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాని పళ్ళెరాలు (platelets) అయిదు రోజులు దాటి నిల్వ ఉండటం లేదు. నిల్వ చేసే విధానాల మీద ప్రయోగాలు జరుగుతూ ఉండగా రక్తం చేసే ఉపకారాన్ని రసి (plasma) ఒక్కటీ చెయ్యగలదని కనిపెట్టేరు. కనుక రసిని నిల్వ చేసి రవాణా చేసే పద్ధతులు కనిబెట్టేరు. రసి మీద అంశిక శ్వేదనం (fractional distillation) వంటి అస్త్రాలని ప్రయోగించి కారణాంశం-1 (factor-1) అనే గుండని విడదీశారు. దీనినే ఫైబ్రినోజెన్‌ (fibrinigen) అని ఇంగ్లీషులోనూ 'తాంతవజని' అని తెలుగు లోనూ అంటారు. అటు తరువాత కారణాంశం-2, కారణాంశం-3 అనే మరొక రెండు పదార్ధాలని విడదీశారు. ఈ రెండు కారణాంశాలలో ముఖ్యంగా ఉండే పదార్ధాల పేరు గ్లాబ్యులిన్‌లు (globulins). శరీరం రోగ గ్రస్తం కాకుండా కాపాడటంలో ఈ గ్లాబ్యులిన్‌లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పాల సముద్రాన్ని మధించినట్లు ఈ రసిని ఇంకా మధిస్తే కారణాంశం-4 వస్తుంది. దీనికే మరొక పేరు కోలెస్టరాల్‌ (cholesterol). ముడి చమురుని అంశిక శ్వేదనం చేసినప్పుడు ఆఖరున తారు లభించినట్లు, రసిని ఇంకా మధిస్తే వచ్చే అయిదవ కారణాంశం పేరు ఆల్బ్యుమిన్‌ (albumin). దీనిని గుండ రూపంలో వెలికి తీసి నిల్వ చెయ్య వచ్చు. ఇంకా కారణాంశాలు ఉన్నాయి. కాని వాటి ప్రస్తావన ప్రస్తుతం అప్రస్తుతం.

ఇలా రక్తం లోని భాగాలని వీడదీసి నిల్వ చెయ్యటంలో కొన్ని లాభాలు ఉన్నాయి. సాధారణంగా రక్తాన్ని ఎక్కించవలసిన ఏ సందర్భం లోనూ కూడా పక్కా రక్తం (whole blood) అవసరం ఎప్పూడో కాని రాదు. ఒకొక్క పరిస్థితిలో ఒకొక్క కారణాంశం అవసరం ఉంటుంది. అప్పుడు అదొక్కటే వాడి విలువైన రక్తాన్ని పొదుపుగా వాడుకోవచ్చు. అంతే కాకుండా పైన చెప్పిన కారణాంశాలన్నీ కూడా గుండ రూపంలో ఉంటాయి కనుక వాటిని నిల్వ చెయ్యటమూ, రవాణా చెయ్యటమూ తేలిక.

రక్తపు వ్యాపారం

[మార్చు]

మనం రక్తం ఇచ్చినప్పుడు 'దానం' చేస్తాం. ఆసుపత్రి వారు మనకి రక్తం ఎక్కించినప్పుడు డబ్బు వసూలు చేస్తారు. కనుక ఇది ఒక రకమైన 'ధర్మ వ్యాపారం.' సా. శ. 2008 లో ముడి చమురు వెల పీపా ఒక్కంటికి 120 అమెరికా డాలర్లు. అదే పీపాడు రక్తం బజారులో కొంటే సునాయాసంగా $20,000 పైనే పలుకుతుంది. ముడి చమురుని అంశిక స్వేదనం చేసి పెట్రోలు, కిరసనాయిలు, వగైరాలుగా చేసి చిల్లరగా అమ్మితే పీపాకి ఓ $500 రావచ్చు. అదే విధంగా రసిని విడి విడి కారణాంశాలుగా విడగొట్టి అమ్మితే పీపాకి $70,000 పైనే వస్తుంది. సాలుకి సగటున 20 మిలియను గేలన్ల రక్తాన్ని పోగు చేసి వ్యాపారంలో తిప్పుతున్నారు. ఈ రక్తం బజారు వెల $20,000,000,000. ఇంత డబ్బుతో వ్యవహారం అయినప్పుడు అత్యాసకి అవకాశాలు పుడతాయి. ఇలాంటి సందర్భాలలోనే రక్తపు సరఫరా రోగగ్రస్తమయిన రక్తంతో కల్తీ అయే ప్రమాదం ఉంది. కనుక ఒకరి రక్తం మరొకరికి ఎక్కించేటప్పుడు అప్రమత్తతతో ఉండకపోతే కామెర్లు, ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే సావకాశం ఉంది.

ఈ ప్రమాదాల నుండి తప్పించుకుందుకి ఎవరి రక్తం వారే, ఎవరికి వారే' దానం చేసుకుని 'బేంకు' లో దాచుకుంటారు. ఉత్తరోత్తర్యా వచ్చే అవసరం వెంబడి వాడుకుంటారు. ఇది ఒక కొత్త ధోరణి!

కృత్రిమ రక్తం

[మార్చు]

ఈ రోజుల్లో రక్త దానం చేస్తామని ముందుకొచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్త దానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ఇలా సరఫరా ఒక పక్క తగ్గిపోతూ ఉంటే మరొక పక్క నుండి వృద్ధుల జనాభా పెరుగుతోంది. రక్త దానం పుచ్చుకునే వారిలో ఎక్కవ భాగం వయ్సు మళ్ళిన వారే.కనుక రక్తానికి ఎద్దడి రోజులు వస్తున్నాయి. దీనికి తోడు రవాణా ఇబ్బందులు, నిల్వ చెయ్యటంలో ఇబ్బందులు వల్ల కృత్రిమంగా రక్తం తయారు చెయ్యాలనే కోరిక పెరిగింది. కృత్రిమంగా తయారు చేసిన రక్తం (artificial blood)ఈ దిగువ చూపిన లక్షణాలు కలిగి ఉండాలి.

  • అది అవిషి (non-toxic) అయి ఉండాలి.
  • అందులో రోగకారక పదార్ధాలు ఉండకూడదు.
  • రవాణా చెయ్యటానికి అనుకూలంగా ఉండాలి.
  • గ్రహీత శరీరంలోకి ఎక్కించినప్పుడు రక్షక ప్రతిస్పందన (immune reaction) రాకూడదు.
  • ఏ జాతి రక్తంతో అయినా కలసిపోగలగాలి.
  • అవసరం తీరేవరకూ (శరీరం తన సొంత రక్తాన్ని తయారు చేసుకునే వరకు) పాడవకుండా పని చెయ్యాలి.
  • అవసరం తీరిన తరువాత శరీరం నుండి విసర్జించబడాలి.
  • అలమారులో చాల కాలం నిల్వ ఉంచినా పాడవకూడదు. (దీనినే అలమారు ఆయుర్దాయం లేదా shelf life అంటారు.)

ఈ కోరికలన్నింటినీ తీర్చటానికీ ఇంతవరకు అనుకూలమైన పదార్థం దొరకలేదు.

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రక్త_దానం&oldid=2941695" నుండి వెలికితీశారు