Jump to content

మ్యాదరి నాగయ్య

వికీపీడియా నుండి
మ్యాదరి నాగయ్య
మరణం
నాగపూర్
ఇతర పేర్లునాగులు, నాగ్లూ
వృత్తిహోటల్ వ్యాపారి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతదేశంలో హోటల్ నడిపిన మొట్టమొదటి దళితుడు.
జీవిత భాగస్వామితులశమ్మ
పిల్లలుఎం.ఎన్ వెంకటస్వామి
తల్లిదండ్రులుపోలయ్య

మ్యాదరి నాగయ్య లేదా మ్యాదరి నాగులు భారతదేశంలో హోటల్ నడిపిన మొట్టమొదటి దళితుడిగా ప్రసిద్ధి చెందాడు. 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్, అమెరికా నుండి భారతదేశానికి వచ్చే పర్యాటకులకు ఇతడు ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

నాగులు పూర్వీకులు మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. వీరు రాజరిక వంశపారంపర్యాన్ని కలిగి ఉండేవారు. అయితే ఒక పూర్వీకుడి నీచమైన చర్య కారణంగా కులనిచ్చెనలో పతనానికి జారిపోయారు. 1783 కరువు సమయంలో, నాగులు తాత మ్యాదరి గోవిందు, మాలవాండ్ల సమూహం చుట్టూ కూర్చుని అపవిత్రమైన ఆవు మాంసాన్ని తినడం చూశాడు. ఆకలితో బాధపడుతున్న గోవిందు ఆ మాంసం ముక్కను తీసుకొని తిన్నాడు. రాజుకు ఆ విషయం తెలిసి అతన్ని బహిష్కరించి అంటరానివారి స్థితికి తెచ్చాడు.

1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో గోవిందు బ్రిటిష్ స్థానిక పదాతిదళాలకు ఎడ్లబండ్లను సరఫరా చేసి చాలా సంపదను కూడబెట్టాడు. అతని కుమారుడు పోలయ్య (నాగులు తండ్రి) పసివయసులోనే గోవిందు మరణించాడు. పోలయ్య తన తండ్రి కూడబెట్టిన సంపదతో జీవిస్తూ మంత్రవిద్య నేర్చుకుని మంత్రగాడిగా జీవించాడు. నాగులు కూడా చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. ఇతని ఇద్దరు అక్కల వివాహం చేసిన తర్వాత, నాగులు తల్లి ఆమె సోదరుడితో నివసించడానికి ఇతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. కొన్ని నెలల్లోనే, నాగులు తల్లి మరణించింది.

నాగులు బ్రిటిష్ సైనిక స్థావరం అయిన జాల్నాకు వస్తువులను మోసుకెళ్ళే ఎద్దుల బండ్లలో చేరాడు. వలసరాజ్యాల ఆక్రమణ ప్రారంభ రోజుల్లో బ్రిటిష్ ఆర్మీ అధికారులు తక్కువ స్థాయి సేవకులను, సహాయకులను మచిలీపట్నం మొదలైన ప్రాంతాల నుండి తెచ్చుకునేవారు. జాల్నా కోరమండల్ తీరంలో యూరోపియన్లకు ప్రవేశ మార్గమైన ఒక వాణిజ్య కేంద్రం. నాగులు రాయల్ హార్స్ ఆర్టిలరీ లెఫ్టినెంట్ కల్నల్ ఇంట్లో గృహ సేవకుడిగా నియమించబడ్డాడు. తరువాత జాల్నా నుండి, అతను నాగ్‌పూర్ సమీపంలోని కాంప్టీకి వెళ్లి, 1857 వరకు వివిధ బ్రిటిష్ ఆర్మీ అధికారుల ఇళ్లల్లో సేవకుడిగా పనిచేశాడు.

1857 తర్వాత, నాగులు నాగ్‌పూర్ నుండి బొంబాయికి ఎడ్లబండిలో సరుకుల రవాణా వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదే సమయంలో బాంబే ఇన్‌ఫాంట్రీకి చెందిన కెప్టెన్ ఆర్.హెచ్. బోల్టన్, గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే చీఫ్ ఇంజనీర్ రాబర్ట్ బ్రెరెటన్‌ల వద్ద కూడా పనిచేశాడు. ఈ ఇద్దరు అధికారులు రైల్వే స్లీపర్‌ల కోసం మన్నికైన కలప దుంగలను కొనుగోలు చేసే బాధ్యతను నాగులు అప్పగించారు. రైలు దుంగ ఒప్పందాలు, రవాణా వ్యాపారం నుండి వచ్చిన లాభాలతో ఇతడు 1864 మార్చి 20న నాగ్‌పూర్ హోటల్‌ను స్థాపించాడు.

1964లో నాగపూర్‌లో మ్యాదరి నాగయ్య నిర్మించిన హోటల్ భవంతి

రైల్వేలైన్ల విస్తరణతో పాటు సెంట్రల్ ప్రావిన్స్ తన అధికారాన్ని క్రమంగా ఏకీకృతం చేయడం వలన వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్య పరిమాణం పెరిగింది. అంతేకాకుండా, నాగ్‌పూర్‌ను స్థావరంగా ఉపయోగించే బ్రిటిష్ అధికారులకు, వ్యాపారులకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా పెరిగాయి. ఇది నాగులు హోటల్‌కు చాలా మంది ఇంగ్లీష్ వినిమయదారులను తీసుకువచ్చింది. ఇతని మాజీ యజమానులు ఇతని క్లయింట్లుగా ఉండేవారు. సెంట్రల్ ప్రావిన్స్ మొదటి చీఫ్ కమిషనర్ రిచర్డ్ టెంపుల్, నాగులుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడ్డాడు.

1866లో, సెంట్రల్ ప్రావిన్సులో వ్యాపార వాణిజ్య అవకాశాలను మెరుగు పరచడానికి రిచర్డ్ టెంపుల్ నాగ్‌పూర్‌లో ఒక పారిశ్రామిక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఈ ప్రదర్శనలో రవాణా, ఆహారం, వసతి ఏర్పాట్లను నాగులుకు అప్పగించారు. ఈ అధికారిక ప్రోత్సాహం నాగులుకు తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రజల దృష్టిలో, ముఖ్యంగా కుల పీడిత సమాజంలో అతని స్థానాన్ని పెంచుకోవడానికి సహాయపడింది. విజయవంతమైన ఏర్పాట్ల వలన బ్రిటిష్ అధికారుల ప్రోత్సాహం నాగులు కుల ప్రతికూలతను (అంటరాని స్థితి) అధిగమించడానికి సహాయపడింది. స్థానిక పాలకులైన హిందువుల నుండి అతనికి క్లయింట్‌లను సంపాదించిపెట్టింది. ముస్లిం పాలకులకు కూడా ప్రత్యేక సందర్భాలలో ఆహారం, వైన్ ఏర్పాటు చేసి వారి మన్ననలను పొందాడు.

బ్రిటన్, అమెరికాల నుండ వచ్చిన ప్రయాణికులు తమ యాత్రా కథనాలలో నాగులు హోటల్ గురించి ప్రస్తావించడంతో అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ పత్రిక పంచ్ ఈ హోటల్ గురించి ప్రకటనలు ప్రచురించింది. టాటాలు హోటల్‌ను దాని వైభవం శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు లక్ష రూపాయలకు కొనాలని ప్రయత్నించారు, కానీ నాగులు అమ్మడానికి నిరాకరించాడు. ఇతని విజయం పరాకాష్టకు చేరుకున్నప్పుడు, కోర్టుకేసులు ఎదుర్కొంటున్న కులస్థులలో ఇతనికి శత్రువులను తయారయ్యారు. చివరకు ఇతడు తన ఆస్తిని బ్రిటిష్ వారికి అప్పగించాల్సి వచ్చింది. వారు ఇతనికి పరిహారంగా రూ. 10,000 చెల్లించి హోటల్‌ భవనాన్ని బెంగాల్-నాగ్‌పూర్ రైల్వే ప్రధాన కార్యాలయంగా మార్చారు. ఈ పతనం పక్షవాతానికి దారితీసి చివరికి నాగులు మరణానికి కారణమయ్యింది. ఇతని కుమారుడు ఎం.ఎన్ వెంకటస్వామి తన తండ్రి కథను అజ్ఞాతం నుండి ప్రారంభ వలస భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యక్తిగా చాటి చెప్పాలని అతని జీవిత కథను 1909లో ‘లైఫ్‌ ఆఫ్‌ ఎం నాగ్లు’ పేరుతో ప్రచురించాడు.

మూలాలు

[మార్చు]
  1. జంగం చెన్నయ్య (15 April 2021). "Meet M. Nagloo, India's first Dalit hotelier who was famous among British, US travellers". The Print. Retrieved 11 February 2025.