Jump to content

మెహరాన్‌గఢ్ కోట

వికీపీడియా నుండి
మెహ్‌రాన్‌ఘర్’కోట దృశ్యచిత్రం

రావ్ జోధా (1438-1488) ఈ కోట ఆలోచనకు రూప కల్పన ‘మెహ్‌రాన్‌ఘర్’ కోట.[1]మెహ్రాన్‌గఢ్ కోట రాజస్థాన్‌లోన జోధ్‌పూర్‌లో 1,200 ఎకరాల (486 హెక్టార్లు) విస్తీర్ణంలో ఉంది. ఈ సముదాయం చుట్టుపక్కల మైదానం నుండి 122 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది.[2] రాథోర్ వంశీకుల్లో 15వ వాడైన రావ్ జోధా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజ్యం సుభిక్షంగానూ శత్రు దుర్భేద్యంగానూ ఉండేందుకు వేల ఏళ్ల నాటి పూర్వీకుల మన్‌డోర్ కోటని వీడి.. అక్కడికి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో మెహ్‌రాన్ ఘర్ కోట రూపకల్పనచేశాడు. ఈ ప్రాంతాన్ని ‘బార్‌చీరియా’ అని వ్యవహరించేవారు. అంటే పక్షుల పర్వతం అని అర్థం. ‘చీరియానాథ్‌జీ’ అక్కడి పర్వత గుహలో కొలువై ఉన్నాడని స్థానికుల నమ్మకం. చాన్నాళ్లు తర్జనభర్జనలు పడిన మీదట - ‘చీరియానాథ్‌జీ’ని అక్కడ్నుంచీ తరలించి కోటలో ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠింపజేశారు. కానీ - కొద్దికాలంలోనే రాజు హఠాత్ మరణం చెందటంతో చీరియానాథ్‌జీ శాపానికి గురయ్యాడని ప్రజలు చెప్పుకొనేవారు. ఆ తర్వాత రాజ్య పీఠాన్ని అధిరోహించిన రాథోర్ వంశీకులు ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించి ‘మిహిర్‌ఘర్’ని ‘మెహ్‌రాన్‌ఘర్’గా పిలవటం మొదలుపెట్టారు. సా.శ.1459లో ప్రారంభమైన జోధ్ సంస్కృతి క్రమంగా వేళ్లూనుకొని ‘జస్వంత్ సింగ్’ (1638-78) కాలం నాటికి అద్భుతమైన చరిత్రను సంతరించుకొంది.

ఎత్తైన కోట గోడలు - శత్రు దుర్భేద్యమైన సరిహద్దులూ.. బురుజులతో రాజస్థాన్ చరిత్రలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కోట ‘మెహ్‌రాన్‌ఘర్’. కోటలో ప్రవేశించటానికి ఏడు ప్రధాన ద్వారాలను దాటాల్సి ఉంటుంది. వీటిలో జయపోల్ ఒకటి. మహారాజా మాన్‌సింగ్ శత్రు రాజ్యాలను ఆక్రమించుకొన్న తదుపరి తన విజయానికి చిహ్నంగా దీన్ని నిర్మించినట్టు చరిత్ర కథనం. మహారాజా అజిత్ సింగ్ నిర్మించిన ‘్ఫతేపూల్’ కూడా మొగలులపై విజయ భేరి మోగించిన సందర్భంలోనిది. దీన్ని 1707లో నిర్మించారు. ‘దేద్ కంగ్రా పోల్’ ‘లోహా పోల్’ని దాటి వెళితే కోట మధ్యభాగంలోకి చేరుకోవచ్చు. ఇక్కడ మహారాజా మాన్‌సింగ్ కాలంలో ‘సతి’ జరిగిన ఆనవాళ్లు కనిపిస్తాయి. రాజపుత్ర వంశీకులు యుద్ధాలకు వెళ్లినా.. శత్రువులు కోటలో ప్రవేశించి దాడులు జరిపే సమయంలో రాజపుత్ర కన్యలు ఆత్మాహుతి చేసుకొనేవారు. ఈ కోటలో అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మోతీ మహల్, ఫూల్ మహల్, శీషా మహల్, సిలేఖానా, దౌలత్ ఖానా వాటిలో ప్రధానమైనవి. చక్కటి శిల్పశైలితో.. ఆనాటి రాజపుత్ర సంస్కృతులకూ అభిరుచులకూ వేదిక అయింది మెహ్‌రాన్‌ఘర్. 1595 ప్రాంతంలో రాజా సుర్‌సింగ్ నిర్మించిన మోతీ మహల్ ఈ కోటలో ఉత్కృతష్టమైంది. ఎతె్తైన బాల్కనీలతో.. విశాలమైన హాళ్లు కలిగిన ఈ కోటలో కింది భాగంలో సంగీత సాహిత్య విభావరి జరిగే సందర్భంలో కోటపై భాగంలోంచి మహరాణులు.. రాచకన్యలు పరదాల చాటున వీక్షించేవారట. మోతీ మహల్ అని పిలవటానికి కారణం - ఆ ప్యాలెస్ ముత్యంలా మెరిసిపోవటమే. ఫూల్ మహల్ విషయానికి వస్తే - మహారాజా అభయసింగ్ (1724-1749) నిర్మించిన ఈ ప్యాలెస్ పక్కనే తోట ఉండటంవల్ల ఆ పరిమళాల సొగసులతో అలరారే మహల్ కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఈ భవంతిలో ఆస్థాన నర్తకీమణులు నాట్యం చేసేవారట. తాకత్ విలాస్ - ఇది మహారాజా తాకత్ సింగ్ ఛాంబర్. ఇది ప్రత్యేకంగా జోధ్‌పూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సంప్రదాయబద్ధంగా చెక్కిన ఈ మహల్‌కి మరో ప్రత్యేకత ఏమిటంటే - మహల్ పైభాగంలో ‘గ్లాస్ బాల్స్’ని అమర్చటం. ఈ మహల్ ప్రవేశిస్తే.. అడుగడుగునా మన ప్రతిబింబం కనిపించటంతో తీయటి అనుభూతికి లోను కావచ్చు.ఆయా కాలాల్లో- పలువురు రాజులు నిర్మింపజేసిన మహళ్లు ఒక ఎతె్తైతే.. రాజా జోధ్ నిర్మించిన చాముండీ దేవి ఆలయం మరో ఎత్తు. మన్‌డోర్ ప్రాంతాన్ని పాలించిన పరిహార వంశీకుల కుల దేవత ఈమె. మెహ్‌రాన్‌ఘర్ కూడా అలా ఉద్భవించిందన్న కథనం ఉంది. ఇప్పటికీ ఇక్కడ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఐతే 2008, సెప్టెంబర్ 30న చాముండీ దేవి ఉత్సవాల్లో భక్తజన సందోహం క్రిక్కిరిసి పోయింది. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో సుమారు 249 మంది మరణించటం.. 400 మందికి పైగా గాయపడటం చరిత్రలో మరచిపోలేని విషాదాంతం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
  2. "History". Mehrangarh Museum Trust. Retrieved 2021-10-01.

వెలుపలి లంకెలు

[మార్చు]