మెడికల్ అల్ట్రాసౌండ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మెడికల్ అల్ట్రాసౌండ్ లేదా డయాగ్నొస్టిక్ సోనోగ్రఫీ లేదా ఆల్ట్రాసోనోగ్రఫీ అనేది అల్ట్రాసౌండ్ వినియోగ ఆధారిత డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ పద్ధతి. దీనిని స్నాయువులు, కండరాలు, కీళ్ళు, నాళాలు, అంతర్గత అవయవాలు వంటి అంతర్గత శరీర నిర్మాణాలు చూడడానికి ఉపయోగిస్తారు. దీని ఉపయోగం యొక్క లక్ష్యం వ్యాధి యొక్క మూలాలను కనుగొని బాగుచేయడం. గర్భిణీ స్త్రీలను పరిశీలించే అభ్యాసానికి ఉపయోగించే అల్ట్రాసౌండ్ ను "ఆబ్స్టెరిక్ అల్ట్రాసౌండ్" అంటారు. అల్ట్రాసౌండ్ అనేవి మానవులకు వినిపించే 20వేల హెర్ట్‌జ్‌ల పౌనఃపున్యం కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీలతో ఉండే శబ్ద తరంగాలు (> 20,000 Hz). ఈ పౌనఃపున్యం ఉన్న శబ్దాలు మానవులకు వినిపించవు.
వైద్యరంగంలో అతిధ్వనులను శరీర అంతర్భాగాలను పరిశీలించేందుకు, రోగగ్రస్థ కణజాలం నిర్మూలించేటందుకు, చెడిపోయిన కణజాలాన్ని బాగుచేయడానికి ఉపయోగిస్తారు. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పుల నివారణలో అతిధ్వనులను ఉపయోగిస్తారు. మూత్రపిండాలలోని రాళ్ళను నిర్మూలించడానికి కూడా అతిధ్వనులను వాడుతున్నారు. శరీర అంతర్భాగాల్ని పరిశీలిచడంలో అతిధ్వనులు X-కిరణాల కన్నా సమర్ధవంతముగా పనిచేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ కణితుల సాంద్రతలలో ఉండే అతి స్వల్ప తేడాలు గుర్తించడంలో X-కిరణాలు అంత ఉపయోగకరం కాదు. గర్భములో ఉన్న శిశువుకు సంభందిచిన సమాచారాన్ని తెలుసుకోవడములో అతిధ్వనులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కణజాలం గుండా అతిధ్వనులు ప్రసారము చేసిన్నప్పుడు దాని సాంద్రత, స్థితిస్థాపకతల ఆధారముగా అతిధ్వనులు వేర్వేరు డిగ్రీలలో పరావర్తనము చెందుతాయి. కణజాలము యొక్క నిరోధము కారణముగా అంతర్గత ఉష్ణాన్ని జనింపజేసే డయాథర్మిక్ సాధనాలను ఫిజికల్ థెరపీలో విస్తారముగా వాడుతున్నారు. అతిధ్వనులను ఉపయోగించడం ద్వారా సంప్రదాయ శస్త్ర చికిత్సలో కన్నా అతి తక్కువ పరిమాణములో శరీరంపై గాటు లేదా రంధ్రాలు చేయడం ద్వారా శస్త్ర చికిత్స చేయడం వీలవుతుంది. ఈ పద్ధతి మెదడు, చెవి వంటి భాగాలపై చేసే సున్నితమైన శస్త్ర చికిత్సలో ఉపయోగిస్తున్నారు.