ముస్లింల పవిత్ర స్థలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముస్లింల పవిత్ర స్థలాలు ఇస్లామీయ సంప్రదాయాలలో ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. మస్జిద్-అల్-హరామ్ (కాబా) ఇందులో పరమపవిత్రం. మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (జెరూసలేం), , బైతుల్-ముఖద్దస్ పవిత్రస్థలాలు.

మస్జిద్-అల్-హరామ్, మక్కా

[మార్చు]
కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.

మస్జిద్-అల్-హరామ్ (المسجد الحرام "పవిత్రమైన మసీదు"), మక్కానగరంలోని ఒక పెద్ద మస్జిద్ , ఇస్లామీయ ప్రపంచంలోని అతిపెద్ద మస్జిద్. ఈ మస్జిద్ కాబా గృహం చుట్టూ ఉంది. ముస్లింలందరూ ఈ కాబా వైపు తిరిగి నమాజు చేస్తారు. ముస్లింలకు పరమపవిత్రం, దీన్నే హరమ్ షరీఫ్ అని కూడా అంటారు.

ఈ మస్జిద్ యొక్క వైశాల్యం 3,56,800 చదరపు మీటర్లు, , 8,20,000 మంది నమాజీ (నమాజ్ చేయువారు) లకు నమాజు చేసే వసతి గలదు. హజ్ సమయంలో వసతి కొరతవల్ల వీధులలోనూ నమాజులు ఆచరిస్తారు. హజ్ కొరకు ప్రతి సంవత్సరం కనీసం 25 లక్షలమంది హజ్ యాత్రికులు వస్తారు.

మస్జిద్-ఎ-నబవి, మదీనా

[మార్చు]


మస్జిద్-ఎ-నబవి (ప్రవక్తగారి మసీదు) (అరబ్బీ: المسجد النبوي ) మదీనా నగరంలో గలదు. దీనిని రెండవ అతిపవిత్ర స్థలంగా పరిగణిస్తారు.

ఇది మహమ్మద్ యొక్క నివాసము. మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళిన తరువాత ఇచటే స్థిరనివాసము ఏర్పరచుకొన్నారు. తరువాత ఇచటే మస్జిద్ నిర్మింపబడింది. ఈనిర్మాణంలో స్వయంగా ప్రవక్త పాల్గొన్నారు. ఈ మస్జిద్ ను సామాజికకేంద్రంగాను, న్యాయస్థానంగాను, ధార్మికపాఠశాలగాను ఉపయోగించారు. ఇచటే ఖురాన్ను గూడా బోధించేవారు. ఈ నిర్మాణ విధానాన్నే ప్రపంచవ్యాప్తంగా మస్జిద్ ల నిర్మాణాలకొరకు ఉపయోగిస్తున్నారు.

ఈ మస్జిద్ ను ప్రవక్తకాలంలోనే నిర్మించారు. తరువాత వివిధ ఖలీఫాల కాలాలలో దీనిని విస్తరించారు. 1839 సం.లో ఈ మస్జిద్ యొక్క గుంబద్ లేక గుంబజ్ (గుమ్మటం) ను పచ్చని రంగుతో పూతపూశారు. ఈ గుంబద్ నే ప్రేమాభక్తితో సబ్జ్ గుంబద్ అని గుంబద్-ఎ-ఖజ్రా అని వ్యవహరిస్తారు.

మస్జిద్ ఎ అల్ అఖ్సా, జెరూసలేం

[మార్చు]
అల్-అఖ్సా మస్జిద్ - జెరూసలెం

అల్-అఖ్సా మస్జిద్ అనునది పురాతన ఇస్లామీయ మస్జిద్ ల సమూహము. ఈ సమూహములో ప్రార్థనలకొరకు ఉపయోగించు మస్జిద్ 'మస్జిద్-అల్-అఖ్సా, గలదు. అల్-అఖ్సా అనే పదం ఖురాన్ లో ఉదహరించబడ్డది.

అల్-అఖ్సా మస్జిద్ ను ప్రథమ ఖిబ్లాగా వ్యవహరించేవారు. దైవాజ్ఞ తరువాత కాబాను ఖిబ్లాగా మార్చుకొన్నారు. మహమ్మదు ప్రవక్త ఇస్రా , మేరాజ్కు ఇచ్చటినుండే పయనమయ్యారు.

అబూ అల్-దర్దా ఉల్లేఖనం ప్రకారం: మహమ్మద్ ప్రవక్త ప్రవచించారు, 'ఒక్కసారి మస్జిద్-అల్-హరామ్ లో నమాజు చేస్తే 1,00,000 నమాజుల పుణ్యం, మస్జిద్-ఎ-నబవిలో నమాజు చేస్తే 1,000 నమాజుల పుణ్యం , మస్జిదె అఖ్సాలో నమాజు చదివితే 500 నమాజులపుణ్యం దక్కుతుంది.' --సహీ బుఖారి -2:21:288.

బైతుల్ ముఖద్దస్

[మార్చు]
బైతుల్-ముఖద్దస్, జెరూసలేం

బైతుల్-ముఖద్దస్, బైత్-అల్-ముఖద్దస్ (అరబ్బీ: مسجد قبة الصخرة, మస్జిద్ ఖుబ్బత్ అస్-సఖరా (టర్కీ : కుబ్బెతుస్-సహ్రా) ఇస్లాం లోని ఒక పుణ్యక్షేత్రం. ఇది జెరూసలేం లోని మస్జిద్ ల సమూహాలలో ముఖ్యమైన మస్జిద్. దీని నిర్మాణం 691 లో పూర్తయింది. ఇది ఇస్లాం లోని ప్రపంచంలోనే అత్యంత పురాతన కట్టడం.[1] దీనినే ఇంగ్లీషువారు 'డూమ్ ఆఫ్ రాక్' అని వ్యవహరిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. Rizwi Faizer (1998). "The Shape of the Holy: Early Islamic Jerusalem". Rizwi's Bibliography for Medieval Islam. Archived from the original on 2007-06-09. Retrieved 2009-02-03.

ఇవీ చూడండి

[మార్చు]