Jump to content

మిద్దె రాములు

వికీపీడియా నుండి
మిద్దె రాములు

మిద్దె రాములు గౌడ్ (1942 - నవంబర్ 25, 2010) తెలంగాణ ఒగ్గుకళారూపానికి వన్నె తెచ్చిన ఒగ్గు కళాకారుడు.[1]

జననం

[మార్చు]

కరీంనగర్ జిల్లా లోని వేములవాడ మండలం హన్మాజిపేటలో 1942లో జన్మించాడు. 'మిద్దె రాములు' ఒగ్గు కథను విననివారు తెలంగాణ పల్లెలో ఇంచుమించుగా ఉండరు. గౌడ కులస్తుడైన రాములు పట్టుపట్టి మరీ నేర్చుకున్నాడు. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేకపోవడం వల్లే ఈ కథ రాములుకు ఒంటపట్టింది. వేములవాడకు వెళ్లి హరికథలు, బుర్ర కథలు చూసేవాడు. ఎలాగైనా కథ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో కాళ్ళకు గజ్జెల వలె తుమ్మకాయలు కట్టుకుని, తలుపులు మూసి ఆముదం దీపం పెట్టుకుని ఆ దీపపు నీడలో తన కదలికల్ని గమనించేవాడు. ఇదీ మిద్దె రాములు 'స్టైల్‌' అని ముద్ర పడేలా కృషి చేశాడు. యాభై ఏళ్ల నుంచి దాదాపు ముప్ఫై వేల ప్రదర్శనలిచ్చాడు. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో రాములు శిష్య, ప్రశిష్యులు రెండు వేల మంది వరకున్నారు. శుభకార్యాలకే కాదు, అశుభకార్యాలకు కథలు చెప్తుంటారు రాములు. జనాభా నియంత్రణ, వయోజన విద్య, అక్షరాస్యత కార్యక్రమాల గురించి ప్రచారం చేయడానికి ప్రభుత్వం రాములు కథల్ని విరివిగా ఉపయోగించుకుంది. తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతాడు. పాటలు జోడించి కథను పండిస్తాడు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తాడు రాములు. తన ఒగ్గు కథ సరిగ్గా చెబితే నాలుగు రోజుల పాటు సాగుతుందంటాడు. ఆయన కథలో కొస మెరుపుగా బోనాల నృత్యం. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతాడు. రాములు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో దాదాపు రెండు వందల ప్రదర్శినలిచ్చాడు. 1990లో మారిషన్‌లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శన ఇచ్చి అప్పటి మారిషస్‌ ప్రధాని అనురుధ్‌ జగన్నాథ్‌, గవర్నర్‌ రంగస్వామి రంగడు ప్రశంసలు అందుకున్నాడు. జానపద కళా బ్రహ్మ' ఒగ్గు కథా చక్రవర్తి, కళాపురస్కార్‌ బిరుదులు పొందాడు.[2]

మరణం

[మార్చు]

నవంబర్ 20, 2010లో మరణిచాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (9 August 2016). "ఒగ్గు కథకు వన్నె తెచ్చిన మిద్దె". Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.
  2. Sakshi (25 November 2014). "ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు". Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.