Jump to content

మాబాబు (నవల)

వికీపీడియా నుండి

మాబాబు విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల. ఇతివృత్తం ప్రధానంగా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో 1920ల్లో సాగినట్టు ఉంటుంది.

ఇతివృత్తం

[మార్చు]

నవలలోని పాత్రలు వేటికీ పేర్లుండవు. కథానాయకుడు పుట్టకముందే తండ్రిని, పుట్టడంతోనే తల్లిని పోగొట్టుకున్న అనాథ.

ఈ నవలలో కథానాయకుడు ఉత్తమ పురషలో తానే "నేను" అని కథ చెబుతాడు. ఈ కథలో కథానాయకునితో సహా ఎవరికీ పేర్లు ఉండవు. అతను పుట్టుకతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ. అతనిని తన పినతల్లి తీసుకెళ్ళింది కానీ ఆమె కుటుంబంలో ఆమె మాటకు విలువ లేకపోవడంతో అతను పిల్ల పాలేరుగా ఆ ఇంట్లో పెరిగాడు. ఏడేళ్ళ వయసులో ఆ ఇంటినుండి పారి పోయి అనేక ఊళ్ళు తిరుగుతో పోతే ఒక గ్రామంలో తనను దొంగ అనుకుని చచ్చేట్లు కొట్టి గుంజకు కడతారు. మర్నాడు ఆ గ్రామంలో మోతుబరి రైతు అతనిని చూసి జాలిపడి తన ఇంటికి తీసుకొని పోయి ఆశ్రయమిస్తాడు. ఆ పెద్దాయనను అతను "బాబు" అని పిలుస్తాడు. ఆ పెద్దాయన పేరే ఈ నవల శీర్షిక "మా బాబు". ఆ పెద్దాయన కుటుంబం తనకు దయతో చూస్తుంది. ఆ పిల్లాడు సహజంగా ప్రతిభావంతుడు కావడంలో రెండేళ్ళలో వ్యవసాయం, వ్యవహారాలు, కొంత చదువు నేర్చుకుని పెద్దాయనకు సహాయంగా ఉంటాడు. పెద్దాయనకు ఆలస్యంగా పిల్లలు కలగడంతో బాగా చిన్నవాళ్ళు. పెద్దాయనకు అకస్మాత్తుగా జబ్బు చేసి చనిపోతాడు. అతనికి బావమరిది వరుస గల ఒకాయన ఏవో పత్రాలపై సంతకాలు చేయించుకుంటాడు. పెద్దాయన పోగానే అతని భార్య కూడా శోకంతో బావిలో పడి మరణిస్తుంది. మరలా ఆ పిల్లాడు రోడ్డున పడ్డాడు. అలా తిరుగుతూ ఒక ఊరు చేరుతాడు. ఆ ఊరు తన మేనమామ ఊరు. తన మేనమామ పోయి కొన్నాళ్లయింది. మేనమామ భార్య కుమార్తె,కుమారునితో కలసి బ్రతుకుతుంది. ఆమె ఆ పిల్లాడికి ఆశ్రయమిస్తుంది. ఒక సంవత్సర కాలంలో ఆ యింటి వ్యవసాయాన్ని చక్కబరుస్తాడు. మేనమామ భార్య తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని, తన బావమరిదిని కూడా తీర్చిదిద్దమని చెబుతుంది. ఆ కుటుంబంలోని వారంతా అతనిని బాగా గౌరవంగా చూసేవారు. అంతా బాగా సాగిపోతాయి అన్న తరుణంలో అతని కలలో "బాబు" కనిపించి "అనాథలుగా ఉన్న తన పిల్లలను వాళ్ళ కర్మానికి వదిలేసి వచ్చేసావా" అని అడుగుతాడు. మర్నాడు పూర్వం తనకు ఆశ్రయమిచ్చిన "బాబు" గ్రామానికి వెళ్తాడు. అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఆస్తంతా ఆక్రమించుకుని ఆ బంధువు పిల్లలు ముగ్గురినీ దారుణంగా హింసిస్తూ బానిసలుగా చూస్తుంటాడు. తన తెలివి తేటల్ని ఉపయోగించి ఆ ముగ్గురు పిల్లల్ని ఆ వూరినుండి తప్పించి తనతో తీసుకొని వచ్చేస్తాడు. తరువాత మేనత్త చనిపోతుంది. ఇంట్లో ఉన్నవారందరిలో తనే పెద్దవాడు. బాబు పెద్ద కుమారుని, తన బావమరిదినీ గుంటూరులోని పాఠశాలలో చేర్పిస్తాడు. సెలవులకి బస్తీ బాబులా వచ్చిన బాబు కొడుకుని చూసి మరదలు ఆకర్షితురాలైంది. దీనితో తన బావమరిది ఆగ్రహిస్తాడు. తన పిల్లల పట్ల బాద్యతను నెరవేర్చినట్లు బాబు ఆత్మ సంతృప్తి చెందిందా? లేదా? అనేది మిగిలిన కథాంశం.[1]

మూలాలు

[మార్చు]
  1. "పుస్తకం » Blog Archive » విశ్వనాథ సత్యనారాయణ గారి నవలిక "మాబాబు"" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-28.