Jump to content

మానవల్లి రామకృష్ణ కవి

వికీపీడియా నుండి
మానవల్లి రామకృష్ణ కవి [1]

మానవల్లి రామకృష్ణ కవి (1866-1957) సాహిత్య పరిశోధకుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. బహుభాషా కోవిదుడు. సంస్కృతము, ఆంధ్రము, అరవము, కన్నడము, మలయాళము, ఇంగ్లీషు భాషలలో పాండిత్యము కలవారు.[2]

రామకృష్ణ కవి 1866లో మద్రాసు లోని నుంగంబాక్కంలో తెలుగు బ్రాహ్మణ పండిత కుటుంబంలో జన్మించారు. ఈయన త్యాగయ్య, గంగాధరశాస్త్రి, నరసింహశాస్త్రి వంటి సంస్కృత పండితుల వంశానికి చెందినవారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృతం లలో ఎం.ఏ. పట్టా పొందారు. పదహారేళ్ళ వయసులో మృగవతి అనే కవితను వ్రాసి, కవి అనే బిరుదును పొందారు. కొన్నాళ్ళ పాటు మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములోనూ, ఆ తరువాత వనపర్తి సంస్థానంలో ఆంతరంగిక కార్యదర్శిగానూ పనిచేశారు. తాళపత్రాలను సేకరించడం ప్రారంభించి అభినవ భారతి వంటి అనేక కనుమరుగైన కృతులను వెలుగులోకి తెచ్చారు. 1916 లో నిడదవోలు వెంకటరావు ఇంట్లో బసచేసి, నాట్యశాస్త్రాన్ని, దాని టీకా తాత్పర్యాన్ని నకలు వ్రాశారు. 1916 లో ప్రాచ్యలిఖిత భాండాగారము యొక్క అసిస్టెంట్ క్యూరేటర్ పదవిని పొందారు. 1940 లో శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థలో రీడరుగా నియమించబడి, అక్కడే 1951 దాకా కొనసాగారు.

రామకృష్ణ కవి 1957లో 91 యేళ్ళ వయసులో తిరుపతిలో మరణించారు. అవసానదశలో కఠిన దారిద్ర్యాన్ని అనుభవించి వీధుల వెంట భిక్షాటన చేస్తూ తిరిగారు.

రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడిన రామకృష్ణ కవి 1933లో టీటీడీ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఈయన సంస్కృతంలో శూద్రకుని 'వత్సరాజు చరిత్రమ్'ను మానవల్లి 'వత్సరాజు చరిత్ర' అన్న నవలగా వ్రాశారు.[3] రామకృష్ణ కవి తాళపత్ర గ్రంథాల సేకరణకు ఊరూరా తిరిగేవారు. కొందరు యజమానులు ఆ గ్రంథాలను ఇవ్వటానికి ఒప్పుకునేవారు కాదు. అప్పుడు ‘ఊరికే చూసి ఇస్తాన’ని చెప్పి, వాటిని ఏకాగ్రతతో చదివి, బసకు వచ్చిన తర్వాత తాను చదివినదాన్ని అక్షరం పొల్లుపోకుండా రాసేవారట[4]

కుమార సంభవం

[మార్చు]

కుమార సంభవం కావ్యాన్ని కనుక్కొని, పరిష్కరించి అజ్ఞాత వాసంనుంచి బయటకు తీసుకువచ్చి, ప్రచురించిన ఖ్యాతి మానవల్లి రామకృష్ణ కవికి చెందుతుంది. అప్పటివరకు వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యం గురించి గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా వ్రాయలేదు.[5] తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఒక మూలపడి ఉన్న తాళపత్ర గ్రంథాన్ని కనుగొని, దానిని పరిష్కరించి 1909లో ఈ గ్రంథాన్ని ప్రకటిస్తూ నన్నె చోడుడు నన్నయ కంటే ముందువాడని రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత లోకాన్ని ఎంతటి ఆశ్చర్యానికి గురి చేసిందంటే, ఈ ప్రతిపాదన మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగాయి. ఆ తర్వాత నన్నెచోడుడు వ్రాయలేదు-రామకృష్ణ కవి రాసి నన్నెచోడుని పేరు పెట్టాడని కొర్లపాటి శ్రీరామమూర్తి పుస్తకం వ్రాసినా చాలామంది పరిశోధకులు ఆమోదించలేదు[6][7]

ప్రభావం

[మార్చు]

రామకృష్ణ కవి, ఆ తరువాత వచ్చిన వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల రామచంద్ర మొదలైన సాహితీ పరిశోధకులకు మార్గదర్శకుడయ్యారు. మానవల్లి వారు పూర్వకాలపు సంకలన గ్రంథమైన 'ప్రబంధ మణిభూషణా'న్ని బైటపెట్టగా, ప్రభాకర శాస్త్రి దాని విలువను తెలిసినవాడై, చాటుపద్య మణిమంజరి రెండు భాగాలను, ప్రబంధ రత్నావళిని వలవేసి బైటికి లాగేరు. రామకృష్ణ కవి క్రీడాభిరామాన్ని తెలుగువారికి అందజేయగా, శాస్త్రి ఆ పుస్తకాన్ని ముచ్చట లొలికే పండిత కూర్పును, చక్కని పీఠికతో విందు జేసేరు.. మానవల్లి వారి దోవ ప్రభాకర శాస్త్రికి ఘంటాపథమయింది..[8]

బయటి లింకులు

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-23. Retrieved 2013-04-28.
  2. "Ramakrishna Kavi Manavalli (1866-1957)". Archived from the original on 2012-11-04. Retrieved 2013-05-06.
  3. కష్టజీవే కథానాయకుడు - ఆంధ్రజ్యోతి[permanent dead link]
  4. ఒక జీవనది చెక్కిన అక్షరాలు - అమ్మంగి వేణుగోపాల్ ఆంధ్రభూమి[permanent dead link]
  5. "నాకు నచ్చిన పద్యం - నన్నెచోడుని వర్ష విన్యాసం - చీమలమర్రి బృందావనరావు ఈమాట నవంబర్ 2008". Archived from the original on 2009-02-13. Retrieved 2013-05-06.
  6. తొలి కావ్యం 4 తొలిరచన - ద్వా.నా.శాస్త్రి ఆంధ్రభూమి June 13th, 2010[permanent dead link]
  7. "స్వాతంత్ర్యోత్తర యుగంలో తెలుగు భాషా సాహిత్య పరిశోధనలు". Archived from the original on 2016-03-04. Retrieved 2013-05-06.
  8. అన్నమయ్యకు వెలుగిచ్చిన సాహితీ శాస్త్రవేత్త - ఆంధ్రప్రభ ఫిబ్రవరి 7, 2013[permanent dead link]