Jump to content

మాతృగయ

వికీపీడియా నుండి
మాతృగయలో తల్లి రేణుకాదేవికి శ్రాద్ధకర్మలు ఆచరిస్తున్న పరశురాముడు

గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్న సిద్ధపూర్ తాలూకాలో ఉన్న బిందుసరోవం మాతృగయగా పిలువబడుతుంది. ఇది ఉత్తర గుజరాత్ రాష్ట్రంలో అహమ్మదాబాదుకు 115 కిలోమీటర్ల దూరం పఠాన్ జిల్లా ప్రధాన కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధపూర్ తాలూకాలో జిలకర అధికంగా పండించబడుతుంది. మతృగయ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఈ ప్రదేశం ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇక్కడ కర్ధమ మహాముని ఆశ్రమంనిర్మించుకుని తపసు చేసాడని ప్రతీతి. కపిలమహర్షి తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వహించిన పవిత్రప్రదేశం. పరశురాముడు తన తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించిన పవిత్ర ప్రదేశమిది. భారతదేశంలో హిందూ ధర్మం అనుసరించి తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వహించే ఏకైక క్షేత్రమిదే. ఇక్కడ తండ్రికి శ్రాద్ధకర్మ నిర్వహించబడదు.

చరిత్ర

[మార్చు]

ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న సిద్ధపూరును మాతృగయ అంటారు. పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని స్త్రీస్థల్ అంటారు. ఋగ్వేదంలో ఈ ప్రదేశవర్ణన ప్రస్తావించబడింది. మహాముని ధదీచి ఇంద్రుడికి తన ఎముకలను దానంగా ఇచ్చిన ప్రదేశం ఇదే. మహాభారతంలో పాండవుల అరణ్యవాస సమయంలో పాండవులు ఈ ప్రదేశం సందర్శించినట్లు పురాణాలలో ప్రస్తావించబడింది. సా.శ. 4-5 శతాబ్దంలో ఇరాన్ నుండి వలస వచ్చిన గుజరా ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడినట్లు చారిత్రకాధారాలు వివరిస్తున్నాయి. 10వ శతాబ్దంలో సోలంకి చక్రవర్తుల పాలనలో ఈ ఊరు వైభవాన్ని సంతరించుకుంది. సిద్ధిరాజ్ జైసింగ్ తన పాలనా కాలంలో ఈ ఊరును నిర్మించి తన రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఆయన ఇక్కడ శివాలయ నిర్మాణం, సుందర ప్రదేశాలు, 80 మీటర్ల పొడవున్న పెద్ద గోపుర నిర్మాణం చేసాడు. ఆయన ఇక్కడకు మథుర నుండి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను తీసుకు వచ్చాడు. వారంతా ప్రతుతం ఇక్కడ స్థిరపడ్డారు. 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ నాయకత్వంలో ఈ ఊరు ధ్వంసం చేయబడింది. వారు సోమనాధ్ ఆలయానికి వెళ్ళే దారిలో దీనిని ధ్వంసం చేసారు. ఆ దండయాత్రలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతటితో సోలంకి సామ్రాజ్య పతనం జరిగింది. సుల్తానుల పాలనలో ఈ ఊరు ప్రాంతీయ పాలన్‌పూర్ రాజప్రతినిధి పాలనలో ఉంది. తరువాత ఊఈ ప్రదేశం ముగల్ చక్రవర్తి అక్బర్ పాలనలోకి వచ్చింది. ముగల్ పాలనలో ఈ ఊరు అభివృద్ధి చేయబడి సమృద్ధిని సాధించింది.

బిందుసరోవరం

[మార్చు]
మాతృగయలో బిందుసరోవరం
మాతృగయలో ద్వారరతోరణం

కర్ధమప్రజాపతి సరస్వతీ నదీతీరంలో అనుకూలవతి అయి మోక్షసాధనకు సహకరించ కలిగిన భార్యను అనుగ్రహించమని విష్ణుమూర్తి కొరకు తమస్సు చేసినప్పుడు ప్రక్షమైన విష్ణుమూర్తి కర్ధమ ప్రజాపతిని చూసి ఆనందబాష్పాలు రాల్చాడు. విష్ణుమూర్తి కంటి నుండి రాలిన కన్నీటి బిందువులే బిందుసరోవరంగా రూపుదిద్దుకొన్నది. హిందూమత ధర్మం అనుసరించి ఉన్న అయిదు పవిత్ర సరోవరాల్లో బిందుసరోఈవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్‌లోని మానస సరోవరం, రాజస్థాన్‌లోని పుష్కర్ సరోవరం, గుజరాత్‌లోని బిందుసరోవరం, కర్నాటక రాష్ట్రం లేని హంపీలో ఉన్న పంపా సరోవరం. ఈ బిందు సరోవరం సమీపంలో కపిల మహర్షి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసాడు. ఇది అతిపవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. ఈ సరోవరాన్ని చుట్టి సరస్వతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం యాత్రికులు స్నానమాచరించడానికి తగిన నీరు లేవు కనుక ఇక్కడ నీటిని మాత్రం చల్లుకుని అనుమతి తీసుకుని వారి వారి తల్లికి మాత్రం శ్రాద్ధకర్మ నిర్వహిస్తారు.

  • 05. బిందు సరోవరం

గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఓ పురాణ కథనం ప్రకారం, స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందబాష్పాలు వెలువడ్డాయట. ఆ బాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం. కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడా ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు. ఆ పుత్రుడే కపిలుడు. ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము. బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టణాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

కపిల మహర్షి దేవభూతి

[మార్చు]

కర్ధమ ప్రజాపతి దేవభూతి పుత్రసంతానం కొరకు మహావిష్ణువును ప్రార్థించి విష్ణు అంశతో పుత్రుడిని పొందారు. పుట్టుకతోనే పరిపూర్ణ జ్ఞానంతో ఉద్భవించిన ఆపుత్రుడే కపిలమహర్షి. కపిలమహర్షి జన్మించి తన తల్లితండ్రుల కోరికను అనుసరించి తన సహోదరీల వివాహం చేసి తన తల్లికి సాంఖ్యయోగబోధను చేసి ఆమెకు సంసారమునందు విరక్తిని కలిగించి మోక్షమార్గం వైపు నడిపించాడు. కపిల మహర్షి సాంఖ్యగోగ ప్రచారం చేసి ప్రజలను జ్ఞానవంతులను చేసాడు. తనకు తపోభంగం కలిగించిన సగరపుత్రులను భస్మంచేసాడు. తల్లికి బిందుసరోవరం వద్ద శ్రాద్ధక్రియలు నిర్వహించి ఆమెకు మోక్షప్రాప్తిని కలిగించాడు.

మాతృశ్రాద్ధం

[మార్చు]

మహావిష్ణుమూర్తి అవతారమైన కపిలమహర్షి ఇక్కడ జన్మించాడు. ఆయన తన తల్లికి జ్ఞానబోధ చేసి ఆమె మరణించిన తరువాత శ్రాద్ధకర్మలు నిర్వహించాడు. ఆ కారణంగా ఇది అతి పవిత్ర స్థలంగా భావించబడుతుంది. కృతయుగం నుండి ఇది ఉన్నట్లు పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించారు కనుక ఇది అతి పురాతనమైన ప్రదేశంగా భావించబడుతుంది. త్రేతా ద్వాపర యుగములలో ప్రస్తావించబడిన మహర్షి పరశురాముడు తన తల్లికి ఇక్కడ శ్రాద్ధకర్మలు ఆచరించాడు. ఇక్కడ పరశురాముడు శ్రాద్ధకర్మలు ఆచరిస్తున్న భంగిమలో పరశురామాలయంలో ప్రతిష్ఠించబడి ఉంది. ఇక్కడ హిందువులు ఆడవారికి మాత్రమే శ్రాద్ధకర్మలు ఆచరిస్తారు. స్త్రీలు కూడా ఇక్కడ తమ మాతృమూర్తికి శ్రాద్ధకర్మ నిర్వహించవచ్చు అన్నది ఇక్కడి విశేషం. దేశంలో హిందూ స్త్రీలు శ్రాద్ధకర్మలు ఆచరించడం ఈ ప్రదేశంలో మాత్రమే.

ఆలయాలు

[మార్చు]

బిందుసరోవరం తీరాన ఉన్న ఆలయాలలో కపిలమహాముని ఆలయం, కర్ధమప్రజాపతి ఆలయం, దేవభూతి ఆలయం, గయగదాధర ఆలయాలు ఉన్నాయి. ఎదురుగా శివాలయం ఉంది. ఆవరణలో రావిచెట్టు ఉంది. అక్కడ యాత్రికులు దేవభూతిని ఆరాధిస్తారు. పరశురామాలయం కూడా ఒక వైపున ఉంది.

జనసంఖ్య - వాతావరణం

[మార్చు]

2001 జనాభాగణాంకాలను అనుసరించి సిద్ధిపూరు జనాభా 53,581. వీరిలో పురుషుల శాతం 52%. స్త్రీల శాతం 48%. సరాసరి అక్షరాస్యత 71%. ఇది జాతీయ అక్షరాస్యతకంటే అధికం. వీరిలో పురుషుల అక్షరాస్యత 77%, స్త్రీల అక్షరాస్యత 64%. జనాభాలో 6 సంవత్సరాలకంటే తక్కువగా ఉన్న వారి సంఖ్య 12%.

సిద్ధిపూరు వాతావరణం వేసవిలో వేడి అధికంగా ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. శీతాకాలం ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. వర్షాకాలపు సరాసరి ఉష్ణోగ్రత 40-50 అంగుళాలు ఉంటుంది.

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

సిద్ధిపూర్ అహమ్మదాబాదు నుండి (115 కి.మీ) - పఠాన్ (140 కి.మీ) – మొధేరా (119 కి.మీ) మేషనా (70 కి.మీ).

రహదారి

[మార్చు]

సిద్ధిపూరు గుజరాత్ రాష్ట్రంలోని అన్ని నగరాలతో రహదారి మార్గంలో చక్కగా అనుసంధానించబడి ఉంది. అహమ్మదాబాదు, మేషనా నుండి దినసరి బసు సర్వీసులు ఉన్నాయి. యాత్రికులు అహమ్మదాబాదు నుండి కారు, వ్యానులలో రెండు గంటల సమయంలో చేరుకోవచ్చు.

రైలు

[మార్చు]

సిద్ధిపూరు అహమ్మదాబాదు నుండి ఢిల్లీ వెళ్ళే రైలు మార్గంలో ఉంది. అహమ్మదాబాదు నుండి 3 గంటల సమయంలో చేరుకోవచ్చు.

వాయుమార్గం

[మార్చు]

సిద్ధిపూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహమ్మదాబాదు లోని విమానాశ్రయం దేశంలోని అన్ని విమానాశ్రయాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. అహమ్మదాబాదు నుండి సిద్ధిపూరుకు 3 గంటల సమయంలో చేరుకోవచ్చు.

వసతిగృహ సౌకర్యాలు

[మార్చు]

20,000 జనాభా కలిగిన చిన్న ఊరు అయిన సిద్ధిపూరులో ధర్మశాలలు, గెస్ట్ హౌసులు వసతిగృహ సౌకర్యాలు లభిస్తాయి. సత్రాలు, మఠాలలో కూడా బస చేయవచ్చు. అహమ్మదాబాదు నుండి కూడా సులువుగా రెండు గంటలు ప్రయాణించి చేరుకోవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=మాతృగయ&oldid=3505953" నుండి వెలికితీశారు