మాడిశెట్టి గోపాల్
మాడిశెట్టి గోపాల్ | |
---|---|
జననం | మాడిశెట్టి గోపాల్ 1964, ఆగస్టు 7 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, నటుడు, వ్యాఖ్యాత |
జీవిత భాగస్వామి | ఉమాదేవి |
పిల్లలు | సాహితి, సాకేత్ |
తల్లిదండ్రులు | మల్లయ్య - అమృతమ్మ |
మాడిశెట్టి గోపాల్ తెలంగాణకు చెందిన రచయిత, నటుడు, వ్యాఖ్యాత. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యాఖ్యానానికి పేరుగాంచిన గోపాల్, గణతంత్ర, స్వాతంత్య్ర, రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో వ్యాఖ్యాతగా వ్యవరించాడు. మలేసియా, సింగపూర్‌లోనూ వ్యాఖ్యానం చేశాడు.[1]
జననం, విద్య
[మార్చు]గోపాల్ 1964, ఆగస్టు 7న మల్లయ్య - అమృతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలంలోని వచ్చునూరు గ్రామంలో జన్మించాడు.[2] ఎం.ఎ, బి.ఇ.డి, ఎల్.ఎల్.బి. చదివాడు. స్థానిక ఎల్.ఐ.సి డివిజనల్ కార్యాలయంలో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.
కళాజీవితం
[మార్చు]గోపాల్ చిన్ననాటినుండే సాహితీ సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తిని ఏర్పరచుకున్నాడు. 8వ తరగతిలోనే 'భువనవిజయం', 'ఉండాఉండన్నర" మొదలగు నాటకాలలో నటించాడు. తరువాతికాలంలో అనేక నాటకాలలతో నటించి ఉత్తమ నటునిగా బహుమతులు అందుకున్నాడు.[3]
కరీంనగర్ తొలి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సమయంలో ఊహాజీవులు నాటకంలో నటించాడు. ఆ తరువాత వివిధ పరిషత్ పోటీలలో ప్రదర్శించిన రాయి, కాలచక్రం, రోజూ చస్తున్న మనిషి వంటి నాటకాలలో నటించాడు. చైతన్య కళాభారతి అనే నాటకసంస్థ ద్వారా తెలంగాణా స్థాయి నాటక పోటీలు నిర్వహించాడు.[4]
వ్యాఖ్యానం
[మార్చు]సాహితీ సాంస్కృతిక, సామాజిక, సేవారంగాలకు చెందిన అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఉగాది సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం, మలేషియా తెలుగుసంఘం వారి ఆహ్వానం మేరకు సింగపూర్, మలేషియా దేశాలలో జరిగిన కార్యక్రమాలకు,అనేక సంవత్సరాలుగా వేములవాడలో జరిగే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలతోపాటు శివరాత్రి ఉత్సవాలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు, రాష్ట్ర అవతరణ వేడకలు వంటి ప్రముఖ కార్యక్రమాలు వ్యాఖ్యానం చేశాడు.[4]
రచనారంగం
[మార్చు]సాహితీ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై గోపాల్ రాసిన కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. శతవసంతాల సందర్భంగా వెలువడ్డ శతవసంతాల సంచికకు సహ సంపాదకుడుగా వ్యవహరించాడు. కరీంనగర్ శతవసంతాల గీతం, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గీతం వ్రాసి, సి.డిలుగా వెలువరించాడు. "చెలిమి చెలిమెలు" పేరుతో నానీల సంపుటి ప్రచురించాడు. సమీక్షణం, సమైక్యవాణి, కరీంనగర్ ఫిలిం సొసైటీ ప్రత్యేక సంచిక వెలువరించడంతో సహకారాలు అందించాడు.[4]
టివి, సినిమారంగం
[మార్చు]మనస్సు పొరల్లో అనే టెలిఫిలింలో నటించాడు. బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన మార్గదర్శి సినిమాలో నటించడమే కాకుండా ఆ సినిమాకు పబ్లిసిటీ ఇంచార్జిగా పనిచేసాడు. నంది పురస్కారాల కమిటీ జ్యూరీ మెంబర్ గా కూడా పనిచేశాడు.[4]
సంస్ధల నిర్వహణ
[మార్చు]1990లో సమైక్యసాహితి స్థాపించి అధ్యక్షునిగా పనిచేశాడు.[5] ఆ తరువాత కరీంనగర్ జిల్లా సాహితీ సంఘాల సమాఖ్య సాహితీ గౌతమి పూర్వ అధ్యక్షునిగా, తె.ర.వే. జిల్లా పూర్వ ప్రధానకార్యదర్శిగా, రాగమంజరి సహాధ్యక్షునిగా, ఫిలింసొసైటీ అధ్యక్షులుగా, విజన్ స్వచ్చంధ సంస్థ కార్యవర్గసభ్యునిగా అనేకమంది ప్రముఖులతో చర్చాగోష్టులు, కవిసమ్మేళనాలు, అవధానాలు, పుస్తకావిష్కరణలు, పురస్కార కార్యక్రమాలు నిర్వహించారు. అష్టావధాన కార్యక్రమాలలో పృచ్చకునిగా కూడా పాల్గొన్నాడు. కరీంనగర్ క్విజ్ క్లబ్ ను స్థాపించి వివిధ సందర్భాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించాడు.[6]
పురస్కారాలు
[మార్చు]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాస్థాయిలో ఉత్తమ వ్యాఖ్యాతగా పురస్కారాన్ని అందుకున్నాడు. జగిత్యాల జైశెట్టి రమణయ్య ట్రస్టు వారి ప్రత్యేక పురస్కారం, జిల్లా కళాకారుల సంక్షేమ సమాఖ్య ఉగాది పురస్కారం, జిల్లా రచయితల సంఘం నుండి దేవులపల్లి రామానుజరావు స్మారక పురస్కారం, తడకమల్ల సాహితీ పురస్కారం, తేజ రాష్ట్ర స్థాయి పురస్కారం, గురజాడ అంతర్జాతీయ పురస్కారం, అలిశెట్టి స్మారక పురస్కారం, వాసవి సత్కారాలు, జిల్లా సాంస్కృతిక సమాఖ్య విశిష్ట పురస్కారం, అన్నమయ పురస్కారాలు వచ్చాయి.[6]
- 2024: సాంస్కృతిక సంస్థ నిర్వహణ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)[7]
మూలాలు
[మార్చు]- ↑ "మాటల మాంత్రికుడు గోపాల్". Sakshi. 2023-03-05. Archived from the original on 2023-05-26. Retrieved 2023-05-26.
- ↑ telugu, NT News (2022-06-23). "జిల్లా కవులకు పురసారాలు". www.ntnews.com. Archived from the original on 2022-06-23. Retrieved 2023-05-26.
- ↑ కవిత్వంలో భువన విజయం, నవ తెలంగాణ కరీంనగర్ జిల్లా ఎడిషన్, 2016 మే 25.
- ↑ 4.0 4.1 4.2 4.3 బహుముఖ ప్రజ్ఞాశాలి 'మాడిశెట్టి', సాక్షి కరీంనగర్ జిల్లా ఎడిషన్, 2021 నవంబరు 10.
- ↑ District, Karimnagar (2022-09-17). "జ్యోతిబాపూలే ( సర్కస్ గ్రౌండ్) పార్కులో స్వతంత్ర సమరయోధులు,కవులు, కళాకారులకు సన్మానం అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ – Information and Public Relations Department, Government of Telangana". ipr.telangana.gov.in. Retrieved 2023-05-26.
- ↑ 6.0 6.1 మాడిశెట్టి జగజెట్టి, ప్రజాశక్తి కరీంనగర్ జిల్లా ఎడిషన్, 2013 సెప్టెంబరు 25.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.