మాచవోలు శివరామప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ మాచవోలు శివరామ ప్రసాద్ అరవై ఏళ్ళుగా ఆంధ్రసాహిత్య రంగంలో విశేషకృషి చేస్తున్న గొప్ప పండితుడు. చిన్న వయసులోనే విద్వాన్ డిగ్రీ పాసయి, ఉపాధ్యాయవృత్తి కొనసాగిస్తూ, అంచెలంచెలుగా బి.కాం., ఎం.ఏ. ఎం.ఫిల్. డాక్టరేట్ పట్టాలు అందుకున్నాడు. పోలూరు హనుమజ్డానకీరామశర్మ వంటి ప్రముఖ పండితుల సాహచర్యంలో తన విద్యనువృద్ధి చేసుకున్నాడు.

జననం, విద్య

[మార్చు]

ఇతను 1947లో నెల్లూరులో జన్మించాడు. మాచవోలు శ్రీరాములు, రత్నమ్మ ఇతని తల్లిదండ్రులు. శ్రీరాములు ప్రసిద్ధ హిందీ పండితుడు. ఈయన నెల్లూరు రంగనాయకుల పేట సెయింట్ పీటర్స్ హైస్కూలులో హిందీ పండితుడుగా 30 సంవత్సరాలు పనిచేసి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో స్వయంకృషితో గొప్ప పాండిత్యం సంపాదించాడు. శ్రీరాములు నిరంతర అధ్యయన తత్పరుడు, బహు గ్రంథాలు లోతుగా చదివినవ్యక్తి ఎంతోమంది పిల్లలకు విద్యా దానం చేశాడు.

ఆ వాతావరణంలో శివరామ ప్రసాద్ చిన్న వయసు నుంచి ఉత్సాహంగా చదువుతూ, 1960లో ఎస్.ఎస్.ఎల్.సి.మంచిమార్కులతో పాసై, పి.యు.సి.లో చేరడానికి వయసు తక్కువ కావడం వల్ల, వయోనిబంధనలు లేని నెల్లూరు మూలపేట సంస్కృత పాఠశాలలో 1960లో 'బి' విద్వాన్ లో చేరాడు.

నాయన దగ్గర నేర్చుకొన్న సంస్కృతం ఈ చదువుకు ఊతం ఇచ్చింది. పాఠశాలలో నేలభొట్ల కోటయ్యశాస్త్రి, తంగిరాల శ్రీరామమూర్తి, చిలకపాటి శ్రీనివాసాచార్యులు, ఆకెళ్ల అచ్చెన్నశాస్త్రి వంటి మహాపండితులవద్ద చదువుకొని మంచి విద్యార్థిగా గురువుల మన్నన పొందాడు.

నెల్లూరు పప్పుల వీధిలో శ్రీ నిత్యానందస్వామివారి పాఠశాలలో ప్రస్థానత్రయం ఆధ్యయనంచేసిన ముప్పిరాల వేంకట నారాయణ శాస్త్రి శిష్యరికంలో ప్రసాద్ తెలుగు ప్రబంధాలు, ఛందస్సు, వ్యాకరణం, సాహిత్యదర్పణం, తదితర అలంకార గ్రంథాలు, కొంత వరకు పాణినీయమూ చదువుకున్నాడు.

ఉద్యోగం

[మార్చు]

1964 నుండి సెయింట్ పీటర్స్ హైస్కూలు తెలుగు పండితుడుగా పనిచేస్తూ, ప్రైవేటుగా పి.యు.సి. పాసై, వి.ఆర్. సాయం కళాశాలలో చదివి, 1970లో బి.కాం. ఫస్ట్ క్లాసులో పాసై, ప్రైవేటుగా వేంకటేశ్వర యూనివర్సిటీలో 1972 లో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయాడు . 1973 నుండి 2005 వరకూ నెల్లూరు శ్రీ సర్వోదయ కాలేజీలో తెలుగు అధ్యాపకుడుగా, తెలుగు డిపార్ట్‌మెంట్ అధిపతిగాపేరు తెచ్చుకున్నాడు.

ప్రసాద్1984లో యూ.జి.సి.స్కాలర్‌షిప్. కు ఎంపికయి, మద్రాసు యూనివర్సిటీలో ‘ఆంధ్రమహాభారతంలో విదురుడు’అంశం మీద ఎం.ఫిల్. చేసి, ప్రొ. ఆచార్య గంధం అప్పారావు అభినందనలు పొందాడు. ఎం.ఫిల్. పరిశోధన చేస్తూ ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ప్రబంధాలు, ఛందస్సు, వ్యాకరణం పాఠంచెప్పాడు.

పదవీవిరమణ తర్వాత 2 సంవత్సరాలపాటు డి.కె.డబ్ల్యూ కాలేజీలో ఎం.ఏ. తెలుగు విద్యార్థినులకు, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, నెల్లూరు కేంద్రంలోనూ ఐదు సంవత్సరాలు ఎం.ఏ. విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఆంధ్రా యూనివర్శిటీ డిస్టెన్సు ఎడ్యుకేషన్- కోఆర్డినేటర్‌గా చాలా సంవత్సరాలు సేవలనందించి, పరీక్షలు క్రమశిక్షణతో నిర్వహించాడు.

డాక్టర్ కాళిదాసు పురుషోత్తం పర్యవేక్షణలో శివరామప్రసాద్ ‘పూండ్ల రామకృష్ణయ్య సాహిత్య సేవ’ అనే అంశం మీద పరిశోధించి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంనుండి 2000సంవత్సరంలో డాక్టరేట్ డిగ్రీపొందాడు. అముద్రిత గ్రంథ చింతామణి, ఆంధ్ర భాషా సంజీవని, సూర్యాలోకము, వైజయంతి, శశిలేఖ, వాగ్వల్లి మొదలైన అరుదైన తొలినాటి పత్రికలను పరిశీలించి సిద్ధాంత వ్యాసం సమర్పించి పి.హెచ్.డి పొందాడు.

గ్రంథ ప్రచురణలో సహకారం

[మార్చు]

ప్రసాద్ నవులూరు మాలకొండయ్య వద్ద పద్యవిద్యను అభ్యసించి, ఆయన ద్వారా దీపాల పిచ్చయ్యశాస్త్రి పరిచయం సంపాదించి, పాఠ పరిశీలన, పుస్తక ప్రచురణ మర్మాలు తెలుసుకొని, పుష్పగిరి తిమ్మన మూడు శతకాలు, తరిగొండ వెంగమాంబ కృష్ణమంజరి, కోవూరు పట్టాభిరామశర్మ ‘భగవద్గీతార్థ మంజరి ’కావ్యాల ప్రచురణలో నవులూరు మాలకొండయ్యకు సహకరించాడు. పోలూరు హనుమజ్డానకీరామశర్మ రామాయణ తరంగిణి, వాసుదేవ కథాసుధ, నలచరిత్ర, ఆంధ్రవాల్మీకి రామాయణాల శుద్ధప్రతి తయారి లోనూ, ప్రచురణలోనూ సహకరించాడు. చక్కగా ప్రూఫ్ కరెక్షన్ చేసి, పండితులచేత ‘విద్వాన్దోషజ్ఞః’ అనిప్రశంసలు పొందాడు.

డాక్టర్ కాళిదాసు పురుషోత్తంతో పాటు నెల్లూరులో ఫిల్మ్ సొసైటీ ఉద్యమం వంటి సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలలో పాలుపంచుకొని, ప్రొఫిల్మ్ ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యుడుగా 12 సంవత్సరాలు సేవలందించాడు. కాళిదాసు పురుషోత్తం దంపూరు నరసయ్య మీద చేసిన పరిశోధనలో తోడ్పడ్డాడు. 'మనసు ఫౌండేషన్' ప్రచురణలు గురుజాడలు, జాషువ రచనల పరిష్కరణకు సహకరించాడు. జమీన్ రయితు, లాయర్, వాఙ్మయి, సంశోధన, విశాలాక్షి పత్రికలలో ప్రసాద్ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

ప్రాచీన సాహిత్యాన్ని విశేషంగా అభిమానించే ప్రసాద్ సభాప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. నెల్లూరులో వర్ధమానసమాజం, సరస్వతీ సమాజం, పద్యకళాపరిషత్తు, తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ సభలలో భారత భాగవతాల మీదప్రసంగించాడు.

నెల్లూరి తొలి సాహిత్య పత్రిక ‘అముద్రిత గ్రంథ చింతామణి’(1885-1904)పై ప్రసంగించి మరుపూరు కోదండరామరెడ్డిపత్రికా సంపాదక అవార్డు స్వీకరించాడు.

శివరామప్రసాద్ పుస్తక పరిష్కరణలో విశేషపరిశ్రమ చేశాడు. భారతం, నరసభూపాలీయం మొదలైన కావ్యాల పాఠదోషాలు సరిచేసి, అర్థ నిర్ధారణ చేశాడు. కాళిదాసు శాకుంతలం మీద విశేషకృషిచేశాడు. తన వ్యాసాలు నేడు "కోరా" మాధ్యమంలో ప్రచురణ పొందుతున్నాయి.

ఉత్తమ ప్రమాణాలు, విమర్శాదర్శాలు గలిగిన తన వ్యాసాలు విజ్ఞానదాయకాలుగా పండిత ప్రశంసలు పొందాయి. శివరామప్రసాద్ 2905లో పదవీ విరమణచేసిన తర్వాత, నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి అరుదైన గ్రంథాలు బహూకరించాడు.

పుస్తకప్రచురణ

[మార్చు]
  1. 2008లో ఆంధ్ర ప్రదేశ్ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం వారిప్రచురణ ‘అలనాటి సాహిత్య విమర్శ’కు డాక్టర్ కాళిదాసు పురుషోత్తంతో పాటు సహ సంపాదకత్వం వహించాడు. ఈ గ్రంథం అముద్రిత గ్రంథ చింతామణి నుండి ఎంపికచేసిన వ్యాసాల సంకలనం.
  2. పూండ్ల రామకృష్ణయ్య వేదం వారికి1891-1904ల మధ్యరాసిన అరుదైన ‘సాహిత్య లేఖల’ను కాళిదాసు పురుషోత్తం సహకారంతో వెలుగులోకితెచ్చి, వాటికి వివరణలు కూర్చాడు. నాటి వాగ్వాదాలను, సాహిత్య స్థితిని అంచనా వేయడానికి ఆ లేఖలు సహకరిస్తాయి. అముద్రిత గ్రంథ చింతామణి కృషిని, నాటివిమర్శల అసలు స్వరూపాన్ని తెలుసుకోడానికి ఆలేఖలు, వివరణలు అవసరమౌతాయి.(పూండ్ల రామకృష్ణయ్య సాహిత్య లేఖలు, స్వీయ పచురణ, 2008)
  3. బంగోరె మిత్రులకు రాసిన లేఖలు "బంగోరె జాబులు"కు కాళిదాసు పురుషోత్తంతో పాటు సహ సంపాదకత్వం వహించాడు.2019
  4. దుర్భా సుబ్రహ్మణ్య శర్మగారి రచనలు ‘కావ్యపంచమి’ సంకలనానికి సహ సంపాదకులు.

మూలాలు

[మార్చు]

1. దుర్భా సుబ్రహ్మణ్య శర్మ‘కావ్యపంచమి’ సంకలనం, దుర్భా రామమూర్తి ప్రచురణ, నెల్లూరు, 1976.

2.బంగోరె జాబులు, society For Society Social Change, Nellore. 2019.

3. అలనాటి సాహిత్య సేవ, అముద్రిత గ్రంథ చితామణి సంపుటుల నుంచి ఎంపిక చేసిన వ్యాసాలు, A.P. Oriental Research centre, Hyderabad, 2008 Publication .

4. నెల్లూరు వారపత్రిక జమీన్ రయితు, Page 4, 12-11-2021(VOL NO91, Issue no 46)లో డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ మీద వ్యాసం, "ఉత్తమ పరిశోధకుడు మాచవోలు శివరమప్రసాద్!"