మహారాజా నందకుమార్
బెంగాల్ కు చెందిన మహారాజా నందకుమార్ (1705? – 1775) ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో బర్ద్వాన్, నదియా, హుగ్లీ జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారి. సమకాలీన పత్రాలలో నున్ కొమార్ (Nun Comar) గా వ్యవహరించబడ్డాడు. నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క క్రౌర్యానికి బలియైన వారిలో నందకుమార్ ప్రముఖుడు.[1] వారన్ హేస్టింగ్స్ చేసిన అవినీతి గురించి సాక్షాధారాలతో బెంగాల్ సుప్రీమ్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఒక కల్పిత ఫోర్జరీ చేసిన కేసులో ఇరికించబడ్డాడు. విలియం ఫోర్ట్ లోని సుప్రీమ్ కోర్ట్ లో విచారించబడి 1775 ఆగస్టు 5 న కలకత్తాలో బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఒక బ్రిటిష్ కోర్ట్ తీర్పు ద్వారా ఉరితీయబడ్డ తొలి వ్యక్తి మహారాజా నందకుమార్.
మహారాజా నందకుమార్ పై జరిగిన నేర విచారణ కేసును న్యాయాన్ని అవహేళన చేసిన కేసు (Travesty of Justice) గా చరిత్రకారులు పరిగణిస్తారు. ఇతని ఉరితీతను బ్రిటిష్ ఇండియాలో జరిగిన తొలి న్యాయ హత్య (Judicial Murder) గా ఎడ్మండ్ బర్కీ, లార్డ్ మెకాలే లాంటి బ్రిటిష్ ప్రముఖులు పేర్కొన్నారు.
మహారాజ నందకుమార్ పై జరిగిన నేర విచారణ – విధించిన మరణదండన తీవ్ర విమర్శకు గురై బ్రిటిష్ పార్లమెంటును కుదిపింది. ఈ విషయానికి సంబంధించి తరువాతి కాలంలో వారన్ హేస్టింగ్స్తో పాటు ఉరిశిక్షను విధించిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలైజా ఇంపీలు బ్రిటిష్ పార్లమెంటులో అభిశంసన ప్రక్రియకు గురయ్యారు. బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో అత్యన్నత పాలనాధికారి అయిన బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క అవినీతిని వెలికితీయడం ద్వారా భారతీయుడైన మహారాజా నందకుమార్ ఒక విధంగా బ్రిటిష్ ఇండియాలో తొలి విజిల్ బ్లోయరుగా గుర్తింపు పొందాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]నందకుమార్ బెంగాలీ బ్రాహ్మణుడు. వైష్ణవుడు. అతని జన్మ స్థలం పశ్చిమ బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలోని భద్రాపూర్.[2] తండ్రి పద్మలాభ రాయ్. ఉరితీయబడిన నాటికి రాజా నందకుమార్ వయస్సు సుమారుగా 70 సంవత్సరాలు ఉంటాయని భావించడం చేత అతను 1705 లో జన్మించి ఉండవచ్చు.
క్రీ. శ. 1756 లో బెంగాల్ నవాబు 'సిరాజ్ ఉద్దౌలా' వద్ద హుగ్లీ ఫౌజ్ దార్ గా పనిచేసాడు. రాబర్టు క్లైవుకి వకీల్ గా వుంటూ ప్లాసీ యుద్ధం (1757) సమయంలో బ్రిటీషు వారికి సాయపడ్డాడు. బెంగాల్ నవాబు 'మీర్ ఖాసీం' ఇతనిని ఒక సందర్భంలో ఢిల్లీ పాదుషా ‘షా ఆలం’ వర్గంతో కుమ్మక్కయ్యాడని అనుమానించి ఖైదు చేసాడు. 1763 యుద్ధంలో బెంగాల్ నవాబు 'మీర్ ఖాసీం' కు వ్యతిరేకంగా 'మీర్ జాఫర్' తో చేతులు కలిపాడు. బక్సర్ యుద్ధానంతరం 1764 లో మొగల్ చక్రవర్తి రెండవ షా ఆలం ఇతని ప్రతిభను, విధేయతను గుర్తించి ‘మహారాజ’ బిరుదును ప్రసాదించాడు. 1764 లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ బర్ద్వాన్, నదియా, హుగ్లీ జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారిగా వారన్ హేస్టింగ్స్ స్థానంలో మహారాజ నందకుమార్ ను నియమించింది. 1765 లో బెంగాల్ ‘నాయిబ్ సుబేదార్’గా అత్యున్నత స్థానంలో నియమించబడ్డాడు.
వారన్ హేస్టింగ్స్ పై అవినీతి ఆరోపణలు
[మార్చు]రెండు సంవత్సరాలనంతరం అనుమానాలు రేకేత్తడంతో బ్రిటీష్ వారు 1767 లో రాజా నందకుమార్ ను ‘నాయిబ్ సుబేదార్’ పదవి నుంచి తొలగించి అతని స్థానంలో మహమ్మద్ రెజాఖాన్ ను నియమించారు. 1772 లో వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన పిదప, అతని ప్రోద్బలంపై రేజాఖాన్ యొక్క రెవెన్యూ పరిపాలనలోని అవకతవకలపై ఫిర్యాదు చేసాడు.[3] తద్వారా రెజాఖాన్ పై ప్రాసిక్యూషన్ జరిపించడంలోను, చివరకు అతనిని తొలగించడంలో వారన్ హేస్టింగ్స్కు సాయపడ్డాడు. చివరకు పని ముగిసిన తరువాత వారన్ హేస్టింగ్స్ రాజా నందకుమార్ ను పక్కన పెట్టాడు. దానితో వారన్ హేస్టింగ్స్ పై ఏ విధంగా నైనా కక్ష తీర్చుకోవాలని రాజా నందకుమార్ నిర్ణయించుకొన్నాడు.
1775 మార్చి నెలలో బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ కు వ్యతిరేకంగా బెంగాల్ సుప్రీమ్ కౌన్సిల్ లో లిఖితపూర్వకంగా తీవ్ర అభియోగాలు దాఖలు చేసాడు. వారన్ హేస్టింగ్స్ ఒక లంచగొండి అని, రేజాఖాన్ ను నుంచి 10 లక్షలు లంచం తీసుకోన్నాడని ఫిర్యాదు చేస్తూ, అందుకు సాక్షంగా దివంగత నవాబు మీర్జాఫర్ భార్య అయిన ‘మున్నీ బేగం’ రాసిన ఒక లంచపుటుత్తరాన్ని సైతం జతపరిచి, బెంగాల్ సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు అయిన సర్ ఫిలిప్ ఫ్రాన్సిస్‌కు లిఖితపూర్వకంగా అందచేసాడు. దీన్ని బట్టి మైనర్ అయిన బెంగాల్ నవాబ్ ‘ముబారక్ ఉద్దౌలా’కు సంరక్షకురాలిగా దివంగత నవాబు మీర్జాఫర్ భార్య అయిన ‘మున్నీ బేగం’ను నియమించడానికి ఆమె వద్ద నుండి 3,54,105 రూపాయలు లంచంగా వారన్ హేస్టింగ్స్ స్వీకరించినట్లు తెలుస్తుంది. వారన్ హేస్టింగ్స్ పట్ల తొలి నుంచి వ్యతిరేకత కనపరుస్తున్న సుప్రీమ్ కౌన్సిల్ లోని మెజారిటీ సభ్యులు ఈ వ్యవహారం పై తదుపరి చర్యకు ఉపక్రమించారు. వారు సుప్రీమ్ కౌన్సిల్ లో గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ పై న్యాయ విచారణ (ఆరోపణ చేసిన రాజా నందకుమార్ సమక్షంలో) చేయడానికి ప్రయత్నించారు. తనపై విచారణ చేసే అధికారం సుప్రీమ్ కౌన్సిల్ కు లేదని వారన్ హేస్టింగ్స్ సమావేశం నుండి వాకౌట్ చేసినప్పటికీ, వారన్ హేస్టింగ్స్ను అతను మున్నీ బేగం నుండి లంచంగా స్వీకరించాడని ఆరోపించబడిన ధనాన్ని కంపెనీ ట్రెజరీలో జమచేయవలసిందిగా కోరుతూ సుప్రీమ్ కౌన్సిల్ లో మెజారిటీ సభ్యులు తీర్మానం చేసారు. తరువాత వారన్ హేస్టింగ్స్ తాను మున్నీ బేగం నుండి 1,50,000 రూపాయలు, వేడుక కోసం స్వీకరించానని అంగీకరించినప్పటికీ తనపై చర్యలు చేపట్టకుండా కౌన్సిల్ పై అదుపు సాధించాడు.
ఫోర్జరీ కేసులో ఇరికింత
[మార్చు]అయితే చతురుడైన వారన్ హేస్టింగ్స్ వ్యూహాత్మకంగా రాజా నందకుమార్ పై ప్రతీకార చర్యకు వెంటనే పూనుకోలేదు. తరువాత కంపెనీ అధికారులు తాము చెప్పినట్లు ఆడే కీలు బొమ్మ లాంటి భారతీయునిచే ఒక వ్యవహారానికి రంగం సిద్ధం చేసారు. దానిలో భాగంగా 1775 మే 5 న జైలు శిక్ష అనుభవిస్తున్న మోహన ప్రసాద్ ను జైలు నుంచి తప్పించడానికి ఒక వ్యక్తితో రాజా నందకుమార్ కుమ్మక్కైనట్లు, దానిలో భాగంగా ఇరువురూ కలసి ఒక సంపన్న విధవరాల నుండి 50వేల రూపాయలు బలాత్కారంగా గుంజుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజా నందకుమార్ రాసినట్టుగా ఒక ఉత్తరం సృష్టించబడింది. ఆ ఉత్తరంపై రాజా నందకుమార్ చేసినట్టుగా ఒక దొంగ సంతకం చేయబడింది. దీనితో రాజా నందకుమార్ పై ఫోర్జరీ కేసు బనాయించబడి సుప్రీమ్ కోర్ట్ లో అతనిపై విచారణ ప్రారంభమయ్యింది.
న్యాయవిచారణ
[మార్చు]విలియం కోట లోని సుప్రీమ్ కోర్ట్ లో 1775 లో మహారాజా నందకుమార్ పై జరిగిన నేర విచారణకు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలైజా ఇంపీ అధ్యక్షత వహించాడు. జూరీలో వున్న ఇతర న్యాయమూర్తులు సీజర్ లీ మెయిస్టర్, జాన్ హైడ్. సుప్రీమ్ కోర్ట్ లో ఈ విచారణ ఒక తంతుగా మారింది. ఒక విధంగా కంగారూ కోర్ట్ విచారణ లాంటిది సాగింది. న్యాయ ప్రమాణాలు సరిగా పాటించక, భారతదేశంలో అనుసరించాల్సిన న్యాయం ఏదో కచ్చితంగా తేల్చకుండానే, ముందుగానే నిర్ణయమైపోయిన ఒక తీర్పు కోసం అన్నట్లు నేర విచారణ సాగింది అని చరిత్ర కారులు పేర్కొన్నారు.
బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన రెగ్యులేటింగ్ చట్టం, 1773 ప్రకారం కలకత్తాలో సుప్రీమ్ కోర్ట్ ఏర్పాటయింది. ఈ సుప్రీమ్ కోర్ట్ తీర్పులు చెప్పేటప్పుడు ఏ న్యాయం (Law) ప్రకారం చెప్పవలెనో ఆనాటి రెగ్యులేటింగ్ చట్టం నిర్దేశించలేదు. ప్రతివాదికి సంబంధించిన న్యాయం లేదా పాలకులైన బ్రిటిష్ వారికి సంబంధించిన న్యాయం వీటిలో ఏ న్యాయాన్ని అనుసరించి తీర్పు చెప్పవలేనో తేల్చలేదు. పాలిత దేశానికి తీర్పులు చెప్పేటప్పుడు అది పాలిత ప్రజల యొక్క వ్యక్తిగత న్యాయం (Personal Law) ను పాటించాలా లేదా అనేది ఇతమిద్ధంగా నిర్ణయించకపోవడంతో, నాటి సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు తమకు మాత్రమే తెలిసిన బ్రిటిష్ న్యాయం (British Law) ను ఇండియాకు దిగుమతి చేసారు. దొంగ సంతకం (ఫోర్జరీ) చేసిన నేరానికి బ్రిటిష్ న్యాయం ప్రకారం ఉరిశిక్ష విధించవచ్చు కాని హిందూ న్యాయం ప్రకారం కాదు.
ఇంగ్లీష్ చట్టం, ఇంగ్లీష్ భాష ఏమాత్రం పరిచయం లేని, ఇంగ్లీష్ వారి ఆచారాలు, న్యాయవిధానాలు ఏమాత్రం తెలియని ఒక స్థానిక బెంగాలీ ప్రముఖుని బ్రిటీష్ చట్టాలను అనుసరించి విచారించారు. విచారణ ఎనిమిది రోజుల పాటు (1775 జూన్ 8 నుండి 16 వరకు) సాగింది. బలహీనమైన, నిరూపించబడలేని సాక్ష్యాలను పరిగణనలోనికి తీసుకొని 1775 జూన్ 16 న ప్రధాన న్యాయమూర్తి ఇంపే మహారాజా నందకుమార్ ను దోషిగా గుర్తించి, మరణ శిక్షను విదిస్తూ తీర్పు ప్రకటించాడు[4].
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కేసును విచారించి, రాజా నంద కుమార్ కి ఉరిశిక్ష విధించిన నాటి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలైజా ఇంపీ, బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్కు బాల్య స్నేహితుడు. ఇరువురూ ఒకే స్కూల్ లో చదువుకొన్నారు.
ఉరితీత
[మార్చు]1775 ఆగస్టు 5 న ఉరి తీయడానికి నిర్ణయించారు.[5] ఈ తీర్పుపై బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ –III కి అప్పీల్ చేయడానికి తగిన గడువును కోరుతూ రాజా నందకుమార్ కి మద్దతుగా అనేక పిటీషన్లు దాఖలు చేయబడ్డాయి. బెంగాల్ నవాబ్ ‘ముబారక్ ఉద్దౌలా’ వంటి రాజ ప్రముఖులతో పాటు మహారాజా నందకుమార్ కూడా ప్రీవీ కౌన్సిల్ కు అప్పీల్ చేయడానికి గడువును కోరుతూ స్వయంగా పిటీషన్లు సమర్పించారు. కాని న్యాయమూర్తులు వాటిని తిరస్కరించారు. చివరకు 1776 ఆగస్టు 5 న కలకత్తాలో హుగ్లీ నది ఒడ్డున ప్రస్తుత విద్యాసాగర్ సేతు సమీపంలో మహారాజా నందకుమార్ ను బహిరంగంగా ఉరి తీసారు. ఉరి తీసే ముందు 70 సంవత్సరాల వయసులో కూడా నందకుమార్ ధైర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు[6][7].
.
కోర్టు చేసిన హత్య
[మార్చు]మహారాజా నందకుమార్ ఉరితీత ఉదంతం బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ పరిపాలనా కాలంలో అత్యంత తీవ్ర వివాదాస్పద చర్యగా, అతని క్రౌర్యానికి ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది. రాజా నందకుమార్ ఉరితీత అనంతరం ఆ నేర విచారణలో మౌలికమైన లొసుగులు వున్నాయని వెల్లడైంది[4].
- భారతదేశంలో దొంగ సంతకం (ఫోర్జరీ) చేసినందుకు హిందూ ధర్మ శాస్రంలో మరణదండన శిక్ష లేదు. అయినప్పటికీ పాలక వర్గానికి చెందిన బ్రిటీష్ న్యాయమూర్తులు వారి దేశానికి చెందిన బ్రిటిష్ చట్టం అనుసరించి తీర్పు ప్రకటించి ఉరిశిక్ష వేసి అమలు చేసారు.
- బ్రిటిష్ న్యాయశాస్రం ప్రకారం ఈ ఫోర్జరీ కేసులో 12 మంది న్యాయాధిపతులు గల జ్యూరీ విచారించాలి. ఆ విధానం కూడా అనుసరించలేదు.
ఇటువంటి ప్రాధాన్యత గల కేసులలో గవర్నర్ జనరల్ కోర్ట్ తన విశేష అధికారాన్ని అనుసరించి సుప్రీమ్ కోర్ట్ తీర్పుపై వేరే తీర్పు ప్రకటించి ఉరిశిక్షను రద్దు చేసి ఉండవచ్చు. ఆ విధంగా కూడా రాజా నందకుమార్ ను రక్షించడానికి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలోని సుప్రీమ్ కౌన్సిల్ కోర్ట్ ముందుకు రాలేకపోయింది. దీనికి కారణం వారన్ హేస్టింగ్స్ కు రాజా నందకుమార్ కు గల శత్రుత్వం, అతని లంచగొండి చర్యలను మహారాజా నందకుమార్ గట్టిగా నిలదీయడం కావచ్చు.
అనాది నుండి ఉరిశిక్ష భారతదేశంలో అమలవుతున్నప్పటికీ బ్రాహ్మణులకు మాత్రం ఉరిశిక్ష విధించడంపై మినహాయింపు ఉంది. అయితే రాజా నంద కుమార్ బ్రాహ్మణుడు అయినప్పటికీ అతనికి ఈ కేసులో మినహాయింపు లభించలేదు. భారతదేశంలో బ్రిటిష్ చట్టం క్రింద విచారించిన ఈ కేసులో కులపరంగా శిక్ష నుండి మినహాయింపును, హోదా పరంగా కనికరాన్ని కూడా చూపలేదు. కొత్తగా వచ్చిన బ్రిటిష్ చట్టం ముందు, కోర్ట్ ల ముందు కులపరంగా, సాంఘిక హోదా పరంగా భారతీయులకు ఏ విధమైన విచక్షణలు, మినహాయింపులు దొరకవని, బ్రిటిష్ చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని తొలిసారిగా భారతీయులకు తెలిసివచ్చేలా చేసింది ఈ వివాదాస్పద తీర్పు.
ఈ కేసును విచారించి, రాజా నందకుమార్ కి ఉరిశిక్ష విధించిన నాటి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలైజా ఇంపీ, వారన్ హేస్టింగ్స్కు స్కూల్ స్నేహితుడు గావడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. తన బాల్య స్నేహితుడుని రక్షించడంకోసం రాజా నందకుమార్ మెడకు ఉచ్చు బిగించినట్లుగా సాగిన తప్పుడు విచారణ, మరణ శిక్ష విదిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎలైజా ఇంపీ తీర్పు నాటి మీడియాలో తీవ్ర వివాదాస్పదం అయ్యింది. అయితే ఈ నేర విచారణను వివరంగా పరిశీలించిన సర్ జేమ్స్ స్టీఫెన్ (Sir James Stephen) వంటి బ్రిటిష్ రాజకీయనాయకులు నందకుమార్ పై ఫోర్జరీ నేరం ఆరోపిస్తూ చేసిన దావా సాధారణ క్రమంలో వచ్చినదే అని, దానిని వారన్ హేస్టింగ్స్ ప్రవేశ పెట్టలేదని అదే విధంగా ప్రధాన న్యాయమూర్తి ఎలైజా ఇంపీ నేర విచారణను న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాడని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ న్యాయాదికారం పూర్తిగా దుర్వినియోగమైన కేసుగా దీనిని చరిత్రలో వర్ణించారు. తదనంతరం 1802 లో ప్రధాన న్యాయమూర్తి కూడా శాసనాన్ని అనుసరించి ఉరిశిక్ష విధించలేదని అంగీకరించాడు. మహారాజా నందకుమార్ పై జరిగిన విచారణ కేసు ‘న్యాయాన్ని అవహేళన చేసిన’ కేసుగా చరిత్రలో నిలిచిపోయింది. లార్డ్ ఎడ్మండ్ బర్కీ, ఆ తరువాత లార్డ్ మెకాలే లాంటి బ్రిటిష్ ప్రముఖులు మహారాజా నందకుమార్ ఉరితీతను 'కోర్టు చేసిన హత్య' గా పేర్కొన్నారు. హెన్రీ బీవరిడ్జ్ వంటి బెంగాల్ సివిల్ సర్వెంట్, చరిత్రకారుని మాటల్లో చెప్పాలంటే “ మహారాజా నందకుమార్ కి విధించిన మరణ శిక్ష న్యాయ సమ్మతితో జరిగిన హత్య తప్ప మరేమీ కాదు.”
ఉరితీత అనంతర పరిణామాలు
[మార్చు]- బెంగాల్ సమాజంలో సహేతుకమైన గౌరవనీయుడు, బ్రాహ్మణుడు, ఉన్నత వర్గీయుడు అయిన మహారాజా నందకుమార్ ను ఒక ఫోర్జరీ కేసులో ఇరికించి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కలకత్తాలో బహిరంగంగా ఉరితీయడం స్థానిక ప్రజలలో భీతిని కలిగించింది. లార్డ్ మెకాలే అన్నట్లు సుప్రీమ్ కోర్ట్ పాలన భయోత్పాదక పాలన (Region of terror) గా తయారయ్యింది. ఇది స్థానిక బెంగాలీలు కలకత్తా నుండి బెనారస్ లాంటి ప్రాంతాలకు తరలిపోయేలా చేసింది.
- భారతదేశంలో తీర్పులు ప్రకటించేటప్పుడు అనుసరించాల్సిన న్యాయం ఏదో కచ్చితంగా నిర్ణయించకుండానే మహారాజా నందకుమార్ ను ఫోర్జరీ కేసు క్రింద ఉరితీయడంపై తీవ్ర విమర్శలు రేగాయి. ఫలితంగా భారతదేశంలో స్థానిక భారతీయులపై బ్రిటిష్ జడ్జీలు తీర్పు చెప్పేటప్పుడు ఏ న్యాయశాస్రం అనుసరించాలి అన్న విషయంపై తీవ్ర చర్చ జరిగింది. తదనంతరం బ్రిటిష్ పార్లమెంటు 1781 సవరణ చట్టం చేయడం ద్వారా భారతదేశంలో కేసులు విచారించేటప్పుడు, తీర్పులు చెప్పేటప్పుడు ప్రతివాదులకు సంబంధించిన వ్యక్తిగత న్యాయాన్ని పరిగణనలోనికి తీసుకొనవలసిందిగా నిర్దేశించింది.
- భారతీయులకోసం కలకత్తాలో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుప్రిమ్ కోర్ట్ లో ఒక భారతీయుడైన మహారాజ నందకుమార్ పై చేసిన విచారణ – విధించిన మరణదండన తీవ్ర విమర్శకు గురై బ్రిటిష్ పార్లమెంటును కుదిపింది. తరువాతి కాలంలో ఇదే విషయమై వారన్ హేస్టింగ్స్తో పాటు ఉరిశిక్షను విధించిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలైజా ఇంపీ లపై బ్రిటిష్ పార్లమెంటు (కామన్స్ సభలో) అభిశంసన ప్రక్రియ మొదలయ్యింది.
వారన్ హేస్టింగ్స్ పదవీకాలం పూర్తయ్యి ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళిన అనంతరం అతని పదవీకాలంలో చేసిన నేరాలు, అవినీతి, దుర్మార్గపు చర్యలపై ముఖ్యంగా మహారాజా నందకుమార్‌ను కోర్టు హత్య చేసిన ఉదంతం పై వారన్ హేస్టింగ్స్ను బ్రిటిష్ పార్లమెంటు అభిశంసించే ప్రయత్నం చేసింది. బ్రిటిష్ కామన్స్ సభలో ఎడ్మండ్ బర్కి లాంటి పార్లమెంట్ సభ్యులు వారన్ హేస్టింగ్స్ పై ప్రాసిక్యూషన్ చర్యలు 1788 లో చేపట్టారు. ఏడు సంవత్సరాల పాటు ‘వెస్ట్ మినిస్టర్ హాల్’లో జరిగిన సుదీర్ఘ విచారణ (1788-95) లో వారన్ హేస్టింగ్స్ ఆర్థికంగా చితికిపోయి దివాళా అంచుకు నెట్టి వేయబడ్డాడు. చివరకు 1795 లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అతనిని దోష విముక్తిని చేసింది.
వారన్ హేస్టింగ్స్తో కలిసి కుట్ర పన్ని నందకుమార్‌ని అన్యాయంగా ఉరి తీయడం ద్వారా ఎలైజా ఇంపీ హత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బ్రిటిష్ కామన్స్ సభలో లార్డ్ మెకాలే లాంటి ప్రముఖులు ఎలైజా ఇంపీపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టారు. ఉరిశిక్షను విధించిన కేసులో అతని ప్రవర్తనను తప్పుబట్టిన బ్రిటిష్ పార్లమెంటు ఎలైజా ఇంపీను అభిశంసించింది.
వారసత్వం
[మార్చు]వారన్ హేస్టింగ్స్ పరిపాలనా కాలంలో మహారాజా నందకుమార్ ను కలకత్తాలో ఉరితీసిన స్థలాన్ని కచ్చితంగా పేర్కొనే అంశంలో చరిత్రకారులలో భేదాభిప్రాయాలున్నాయి. అతనిని ఉరితీయడం కోసమే ఒక బావిని తవ్వారని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ వారన్ హేస్టింగ్స్ పాలనా కాలంలో రాజా నందకుమార్ ను కలకత్తాలో ఉరితీసిన స్థలాన్ని కచ్చితంగా నిర్ధారించడానికి ఇంకా ప్రభుత్వ పరంగా అధికారిక ప్రయత్నాలు జరగలేదు. ఫలితంగా చరిత్రలో మరుగునపడిన ఎన్నో అంశాలవలె ఉరితీత జరిగిన ప్రదేశంలో సైతం ఆయనకు ఒక స్మారక చిహ్నం నిర్మించబడలేదు.
మహారాజా నందకుమార్ కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు రాజా బహుదూర్ ‘గురుదాస్’. ఇతను నవాబ్ నజీమ్ కు దివాన్ గా ఉన్నాడు. కూతురు సుమని. అల్లుడు జగత్ చంద్ర బెనర్జీ రాయ్. వీరి కొడుకు రాజా మహానంద.
- బ్రాహ్మణీ నది ఒడ్డున భద్రాపూర్ సమీపంలోని ఆకాళీపూర్ గ్రామంలో మహాకాళీ ఆలయాన్ని మహారాజా నందకుమార్ నిర్మించాడు.
- అతని జన్మ స్థలం భద్రాపూర్ లో అతని గౌరవార్ధం “భద్రాపూర్ మహారాజా నందకుమార్ హైస్కూల్ “ స్థాపించబడింది.
- అతని గౌరవార్ధం పూర్బా మిడ్నాపూర్ లో మహారాజా నందకుమార్ విద్యాలయ కళాశాలను స్థాపించారు.[8]
- కలకత్తాలో ఒక రోడ్ కి మహారాజా నందకుమార్ రోడ్ అనే పేరు పెట్టారు.[9]
- 1953 లో బీరెన్ దాస్ దర్శకత్వంలో, రబీ రాయ్ చౌదరి సంగీత దర్శకత్వంలో భాను బందోపాద్యాయ. జహార్ రాయ్, శంభు మిత్ర, ఉత్పల్ దత్, తులసి చక్రబర్తి తదితర నటులతో రిపబ్లిక్ పిక్చర్స్ బేనర్ మీద బెంగాలీ భాషలో 'మహారాజ్ నందకుమార్' చారిత్రిక సినిమా విడుదలయ్యింది.
మూలాలు
[మార్చు]- ↑ "The Kunjaghata Raj family". Murshibad.net. Archived from the original on 18 మే 2013. Retrieved 10 June 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-02-06. Retrieved 2019-10-11.
- ↑ Harlow, Barbara (2003). Carter, Mia (ed.). From the East India Company to the Suez Canal. Durham, NC [u.a.]: Duke Univ. Press. p. 132. ISBN 9780822331643.
- ↑ 4.0 4.1 Bhattacharya, Asim (2010). Portrait of a Vancouver Cabbie. USA: Xlibris Corporation. p. 141. ISBN 9781456836078.
- ↑ Mandal, Sanjay (9 November 2005). "History that hangs fire - Nandakumar neglect". The Telegraph (Calcutta). Retrieved 10 June 2013.
- ↑ The History of Court by Prof. Pithawala
- ↑ Lion Feuchtwanger und Bertolt Brecht, Lion Feuchtwanger, (1927). Kalkutta, 4. Mai: drei Akte Kolonialgeschichte. Dr.PLISCHKA Hans Peter. p. 12.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ "Affiliated Colleges". Vidyasagar University. Archived from the original on 25 ఫిబ్రవరి 2012. Retrieved 11 అక్టోబరు 2019.
- ↑ Your local guide. "INDRANI DUTTA KALA NIKETAN IN MAHARAJA NANDAKUMAR ROAD". Bharat Desi. Archived from the original on 24 అక్టోబరు 2013. Retrieved 12 June 2013.
వనరులు
[మార్చు]- The story of Nuncomar and the impeachment of Sir Elijah Impey], Sir James Fitzjames Stephen London: Macmillan and Co, 1885 - Cornell University Library Historical Monographs Collection [1] Reprinted by University Library Digital Collections
- Trial of Maharaja Nanda Kumar, A Narrative of a Judicial Murder, Henry Beveridge, Bengal Civil Servant, Calcutta Thacker, Spinc & Co (1886)