Jump to content

మల్లంపల్లి ఉమామహేశ్వర రావు

వికీపీడియా నుండి

మల్లంపల్లి ఉమామహేశ్వర రావు తెలుగులో ఆలిండియా రేడియోలో మొట్టమొదటి వ్యాఖ్యానకర్త. ఈయన "రేడియో తాతయ్య" గా సుపరిచితుడు. అతను చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరుడు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన సోదరుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ తో కలసి తన 12వ యేట రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రిలో కొంతకాలం ఉన్నారు. తరువాత ఆయన అన్నయ్య మద్రాసు వచ్చి ఆంధ్రపత్రిక లో కొంతకాలం ఎడిటర్ గానూ, భారతి పత్రికలో కూడా పనిచేసారు. ఆయనతో పాటు మద్రాసు వచ్చారాయన. ఆయన అనౌన్సరుగా రేడియోలో పనిచేయడమే కాకుండా రేడియో నాటకాలలో కూడా వివిధ పాత్రలను నిర్వహించారు. ఆయన 40 సంవత్సరాల పాటు "ఉమ" అన్న పేరుతో సౌండ్ ట్రాక్ లు చేసేవారు. సినిమాను మొత్తం రికార్డింగ్ చేసి సంక్షిప్త కథగా మార్చేవారాయన.

ఆయన మద్రాసు రేడియో కేంద్రం అధికారికంగా మొదలుకాక ముందు నుంచే ఆయన అక్కడ ప్రసారాలకు అవసరమయిన రచనలకు ప్రతులు రాసే ఉద్యోగం చేసారు. రేడియో కేంద్రం పనిచేయడం మొదలు పెట్టేసరికి ఆయన్నే అనౌన్సర్ గా పనిచేయమన్నారు. ఆ విధంగా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తొలి అనౌన్స్ మెంట్ చేసిన ఘనత మల్లంపల్లి వారి ఖాతాలో చేరిపోయింది. ఆయన 1977 మే 31 వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. రేడియో మొదటి రోజుల్లో ఆచంట జానకిరామ్ గారు నాటకాలు రూపొందించేవారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా నాటకం ప్రసారమయితే ఆ తర్వాత నాటకంలో పాల్గొన్నవాళ్లు, తక్కిన ఉద్యోగులు అందరు ఆరుబయట ఆయన ఏర్పాటు చేసిన విందు భోజనం చేసికానీ కదిలే వీలు వుండేది కాదు. ఆ విందు ఖర్చులన్నీ ఆయనే భరించేవాడు.

1942 లో యుద్ధం వచ్చినపుడు జపాన్ వారు మద్రాసు స్టేషనుపై బాంబింగ్ చేస్తారనే పెద్ద వదంతి వచ్చింది. అపుడు రేడియో కేంద్రంలోని షార్టు వేవ్ ట్రాన్స్ మీటరును డిస్‌మాంటిల్ చేసి ఢిల్లీకి పంపించింది ప్రభుత్వం. దానితో పాటు ఆయనను కూడా ఢిల్లీకి పంపించారు. ఆయన ఢిల్లోలో సంవత్సరం 6 నెలలు ఉన్నారు. ఆ కాలంలో ఆయన ఢిల్లోలో తిమార్ పూర్ వద్ద (యమునానది ఒడ్దున) ఒక ఎనౌన్సర్ తో కలసి నివసించేవారు. ఆ కాలంలో ఆయనకు రూ.150 జీతం వచ్చేది. అక్కడ ఆయనకు మలేరియా వచ్చింది. ఆయన బదిలీ కోసం అభ్యర్థిస్తే ఎస్. గోపాలం గారు వేరొకరికి శిక్షణ ఇస్తే బదిలీ చేస్తానని చెప్పారు. వేరొకరికి శిక్షణ యిచ్చారాయన. అయినా బదిలీ కాకపోయేసరికి సెలపువై మద్రాసు వచ్చేసారు. ఆ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ ఆయన అవసరాన్ని గుర్తించి మరల ఉద్యోగంలోనికి తీసుకున్నారు. అప్పటి నుండి 1977 మే 31 న పదవీ విరమణ జరిగే వరకు ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించారు.[3]

రేడియో తాతయ్యగా

[మార్చు]

బాలగురుమూర్తిగారు కార్యక్రమ నిర్వాహకులుగా వున్నప్పుడు పిల్లల కార్యక్రమానికి ఒక పాత్ర కావలసి వచ్చింది. అందుబాటులో ఓ పాత్ర దొరకక ఆయన ఉమామహేశ్వరరావుగారిని గొంతు మార్చి ప్రయత్నించమని చెప్పారు. అట్లా ఆయన తాతయ్య అవతారం ఎత్తారు. తాతయ్యగా చాలా ప్రఖ్యాతి సంపాదించారు. రేడియో స్టేషన్ కు వచ్చిన వాళ్లు తాతయ్యను చూపమని ఆయననే కోరేవాళ్ళు. మరికొందరు అయనే తాతయ్య అంటే నమ్మలేక పోయేవాళ్ళు.

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు తేజోమూర్తులు". Archived from the original on 2016-03-15. Retrieved 2016-01-10.
  2. Full text of "Prasara Pramukulu"
  3. [1]యూట్యూబ్ లో రేడియో తాతయ్య ఇంటర్వ్యూ - ఓలేటి వెంకట సుబ్బారావు

ఇతర లింకులు

[మార్చు]