Jump to content

మయూరధ్వజము

వికీపీడియా నుండి
మయూరధ్వజము
కృతికర్త: కలుగోడు అశ్వత్థరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకము
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: కవిరాజ ముద్రాక్షరశాల, రాయదుర్గం, అనంతపురం జిల్లా
విడుదల: 1929
పేజీలు: 90


కలుగోడు అశ్వత్థరావు[1] వ్రాసిన ఈ నాటకములో ఐదు అంకములున్నాయి. కప్పగల్లు సంజీవమూర్తి వ్రాసిన మయూరధ్వజ చరిత్రము అనే చిన్న వచన గ్రంథాన్ని చదివి ఆ కథ తన మనసుకు నచ్చినందున ఆ గ్రంథాన్ని మూలాధారముగా చేసికొని నాటకరచన చేశాడు.

ఇతివృత్తము

[మార్చు]

ఈ కథ జైమినీ భారతం లోనిది. భారత యుద్ధానంతరము బంధువుల నాశనానికి బాధపడుతున్న ధర్మరాజుకు ఉపశమనార్థం వ్యాసమహర్షి అశ్వమేధయాగాన్ని చేయమని బోధిస్తాడు. ధర్మరాజు అందుకు సమ్మతించి యాగాన్ని చేసి అశ్వరక్షకులుగా కృష్ణార్జునులను పంపగా, వారికి కృష్ణభక్తుడైన మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజునికి జరిగే యుద్ధం ఈ నాటకంలో ప్రధాన ఇతివృత్తం. కృష్ణార్జునులు బ్రాహ్మణవేషధారులై మయూరధ్వజుని యాచించి పులి ఆహారానికై వాని దేహంలో కుడి సగభాగం ఇమ్మంటారు. దానికి మయూరధ్వజుడు ఒప్పుకొని తన సతీసుతులను రంపంతో తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమంటాడు. వారు కోస్తున్న సమయంలో మయూరధ్వజుడు కన్నీరు విడువగా బ్రాహ్మణ వేషధారులు మాకు అక్కరలేదని నిరాకరిస్తారు. అప్ప్డుడు సగము కోతపడిన మయూరధ్వజుడు వారితో "అయ్యా, నా ఎడమ కంటి నుండి నీరు వచ్చిందే కాని కుడికంటి నుండి రాలేదు. కారణం కుడి భాగం మాదిరిగా ఎడమ భాగం సత్పాత్రదానానికి ఉపయోగపడలేదనే చింత తప్ప వేరేకాదు" అని వివరించగా కృష్ణార్జునులు వాని సత్యదీక్షకు, త్యాగశీలతకు మెచ్చి తమ నిజరూపములతో ప్రత్యక్షమై వానిని సంతోషపెట్టడం ఈ నాటకములో చక్కగా వర్ణించబడింది.

పత్రికాభిప్రాయము

[మార్చు]

ఈ నాటకం గురించి శ్రీసాధన పత్రిక తన అభిప్రాయాన్ని 1929 ఆగస్టు 24వ తేదీ సంచికలో ఈ విధంగా తెలిపింది.

  • శైలియు, నాటకము లోని ఇతర విషయములు ఆంధ్రనాటక పితామహుని అనుసరించి యున్నవి. కృష్ణమాచార్యుడు చిన్నతనాన రాసి మరచియుంచిన నాటకమా అనిపించుచున్నది. చదువునప్పటికంటె అభినయరంగమున నిది మిక్కిలి మనోహరముగా నుండునని తోచుచున్నది. నాటక సమాజంవారు దీనినొక్క పర్యాయము అభినయించి పరీక్షించుట మేలు. పద్యశైలి కూడా నాటకశైలికి అనుకూలముగా నున్నవి. కవి కరణీకమందుందియు, గ్రామవాసం చేయుచుండియు, నింత మాత్రము నాటకమును రచించి ఆంధ్రలోకమున కోసంగినందుకు అశ్వత్థరావును అభినందించవలసి యున్నది. ఇంకను వారు ప్రయత్నించి మంచి నాటకములను రచించి కీర్తి తెచ్చెదరని నమ్ముచున్నాము.

మూలాలు

[మార్చు]
  1. సీమ సాహితీస్వరం - శ్రీసాధన పత్రిక - డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి - పుటలు 202-204