మద్దాళి ఉషాగాయత్రి
మద్దాళి ఉషాగాయత్రి కూచిపూడి నృత్య కళాకారిణి, నాట్యగురువు. ఈమె కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ జీవిత భాగస్వామి.
చిన్నతనం, శిక్షణ
[మార్చు]1955 ఏప్రిల్ 26 న మల్లవరపు సుందరేశం, జానకమ్మ దంపతులకు కర్నూలులో జన్మించింది.[1] చిన్నప్పటినుండే ఆమె సంగీతం, నృత్యం నేర్చుకుంది. నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే ఈమె ఉదయ్ శంకర్ శిష్యుడైన శ్రీ దయాల్ శరణ్ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టారు. వీరి దగ్గర కథక్, ఒడిస్సీ, సంగీతం నేర్చుకున్నారు. ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాధ శర్మ వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. అలాగే పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్, డా. వెంపటి చినసత్యం, శ్రీ వేదాంతం ప్రహ్లాద శర్మగారి వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు శ్రీమతి కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నారు.
డా. మద్దాళి ఉషా గాయత్రి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో 1988లో ఎం.ఏ ఉత్తమ శ్రేణిలో చదివారు. తరువాత, "తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర వృద్ధి, వికాసం, నాట్యంలో అవతరణ" అనే అంశంమీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పొందారు. అదే సిద్ధాంత వ్యాసం ప్రచురించారు.
దాదాపు పాతిక సంవత్సరాలు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని, పూర్తిగా నృత్యానికే తన సమయాన్ని కేటాయస్తున్నారు. ఉష వద్ద శిక్షణ తీసుకున్న ఎంతోమంది కళాకారులు ఈనాడు ఉత్తమ కళాకారులయ్యారు, నాట్యానికి తమ సేవ చేస్తున్నారు.
ప్రదర్శనలు
[మార్చు]గత నలభై ఏళ్లుగా ఎన్నో వేల ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో సంగీత నాటక అకాడమీ వారి ఆధ్వర్యంలో, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో, టిటిడి వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. విదేశాలలో ఆటా, తానా, యూరోపు తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1997లో మారిషస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవంనాడు ఇచ్చిన ప్రదర్శనలో ఇచ్చారు. ఆనాటి ప్రెసిడెంటు ఆవిడను సత్కరించారు. 200పైగా నృత్యాంశాలకు ఉషాగాయత్రిగారు కొరియోగ్రఫి చేశారు. కలాపం మీద 3 రోజుల సెమినారు నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయంలో డా.ఉషాగాయత్రి నృత్య విభాగంలో పనిచేశారు. తన శిష్యులతోపాటు, యుకె, యూరోపులో ప్రదర్శనలిచ్చి నెలకుపైగా పర్యిటించారు. యుకెటిఎ, జయతే కూచిపూడి, అంతర్జాతీయ కూచిపూడి ఫెస్టివల్‌లో భాగంగా ఎన్నోప్రదర్శనలిచ్చి అందరి మన్ననలు పొందారు.
- డా. ఉషాగాయత్రి 200పైగా నృత్యాంశాలు కొరియోగ్రఫీ చేశారు.
- ప్రఖ్యాత చారిత్రక నవలా చక్రవర్తి డా. ముదిగొండ శివప్రసాద్ రాసిన శివభక్తమార్కండేయ అనే బాలే ఎన్నోసార్లు ప్రదర్శించారు.
- చారిత్రక, సాంఘిక విలువలున్న నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.[2] మా తెలుగు తల్లికి మల్లెపూదండ, స్వర్ణోత్సవ భారతి, వందేమాతరం, సంక్రాంతి లక్ష్మి వంటి బాలేలు కొరియోగ్రఫి చేసి ప్రదర్శించారు. మన పురాణ కథలపై ఆధారపడిన శివభక్తమార్కండేయ, రుక్మిణీ సత్య, అలిమేలుమంగ చరిత్ర, యశోదకృష్ణ వంటి బాలేలు చేసి, చేయించారు. ఈమె చేసిన ‘మాతృదేవోభవ’ ఎంతో ప్రఖ్యాతమైనది. నృత్యం దర్శయామిలో 72 నృత్యాంశాలు చేశారు. దానిని 12 గంటలు అవిరామంగా, 12 శిష్యురాళ్లతో చేయించారు.
- నృత్యకిన్నెర 30వ వార్షికోత్సవ సందర్భంగా ఆమ్రపాలి, పుష్కర పులకిత గోదావరి అనే నాట్యరూపాకాలను ప్రదర్శించారు.[3]
నృత్యకిన్నెర
[మార్చు]1983లో డా. ఉషాగాయత్రి కిన్నెర ఆర్ట్ థియేటర్స్కు అనుబంధంగా "నృత్యకిన్నెర" అనే సంస్థను స్థాపించి కొన్ని వందల శిష్యులకు కూచిపూడి నేర్పిస్తున్నారు. వీరిలో ఎందరో నృత్యంలో పిహెచ్‌డి, ఎంఏ పట్టాలు పొంది గురువులు, నర్తకులుగా అభివృద్ధి చెందారు. 44 మంది శిష్యులు రంగప్రవేశం చేశారు వీరివద్ద. 50 మంది శిష్యులు సర్ట్ఫికెట్లు, డిప్లొమా నృత్యంలో పొందారు. 10 చిన్నారులు సిసిఆర్‌టి స్కాలర్‌షిప్, భారతదేశ ప్రభుత్వంవారి వద్ద పొందారు.
గౌరవ పురస్కారాలు
[మార్చు]ఎన్నో అవార్డులు, గౌరవాలు, సత్కారాలు పొందారు. నృత్యరత్న, హంస అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001, ఉత్తమ నర్తకిగా యూరోపు తెలుగు అసోసియేషన్, యుకెలో 1987, 2003లో మళ్లీ అన్నమయ్య 600 జయంతి ఉత్సవంలో 2007లో. ఉత్తమ నాట్యగురువు, న్యూయార్క్ గణపతి ఆలయం 2008, ఉత్తమ నాట్యగురువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుతో, 2009లో-ఉత్తమ నాట్యగురువు, అంతర్జాతీయ కూచిపూడి కనె్వన్షన్, సిలికాన్ ఆంధ్రవారితో. అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మారిషస్ ప్రెసిడెంటు, యుకె మేయర్ కూడా డా. ఉషా గాయత్రిని సత్కరించి గౌరవించారు.